– బీజేపీకి మంత్రి తలసాని సవాల్
– కాంగ్రెస్, బీజేపీ నుంచి కార్యకర్తల చేరిక
మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పిన తర్వాత బీజేపీ నేతలు ప్రజలను ఓట్లు అడగాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలలో భాగంగా సోమవారం దీపావళి పండుగ రోజు కూడా మంత్రి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మునుగోడ్ నియోజకవర్గ పరిధిలోని నాంపల్లిలో గల ఉప్పరిగూడ, ముదిరాజ్ కాలనీ తదితర ప్రాంతాలలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో TRS శ్రేణులు డప్పు చప్పుళ్ళ తో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రికి మహిళలు నుదుటన కుంకుమ తిలకం దిద్ది మంగళ హారతులతో స్వాగతం పలికారు. ప్రచారం సందర్భంగా ప్రజలు పలు సమస్యలను మంత్రికి విన్నవించారు. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమటి రాజగోపాల్ రెడ్డిపై నమ్మకంతో ఈ ప్రాంత ప్రజలు MLA గా గెలిపిస్తే మూడున్నర సంవత్సరాలలో కనీసం గ్రామాల వైపు కన్నెత్తి కూడా చూడలేదని, ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కు అమ్ముడుపోయి పార్టీ మారిన కారణంగా ఉప ఎన్నికలు వచ్చాయని, దీని వలన ప్రజలకు ఎలాంటి మేలు జరగదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి జరగాలన్న, ప్రజల సమస్యల పరిష్కారం కావాలన్న అది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని TRS ప్రభుత్వం తోనే సాధ్యం అవుతుందన్నారు. TRS అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో MLA గా గెలిపించాలని కోరారు.
నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా BJP నేతలు అదే పనిగా ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వాని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, ప్రజలు అంటా గమనిస్తున్నారని, ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్, బీజేపీ నుండి TRS లో చేరిక
ఇతర పార్టీల నుండి TRS పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నాంపల్లి పట్టణ బీజేపీ అద్యక్షులు కామిశెట్టి యాదయ్య ల ఆధ్వర్యంలో మరికొంత మంది ముఖ్యనాయకులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో TRS పార్టీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక్క TRS తోనే సాధ్యం అనే పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పారు.
ఎన్నో సంవత్సరాల ప్లోరిన్ సమస్యను మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి సురక్షిత మంచినీటిని సరఫరా చేయడం ద్వారా శాశ్వతంగా పరిష్కరించిన చరిత్ర TRS ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణారెడ్డి, నాయకులు వెంకన్న గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, పట్టణ TRS అద్యక్షులు సత్తయ్య, రమేష్, బెల్లి సత్తయ్య, కిరణ్, చంద్రమౌళి, శేఖర్, శివారెడ్డి, యాదయ్య, చరణ్, కొండయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.