ఏ భాష శ్రీకృష్ణదేవరాయలకంత
కీర్తి తెచ్చిందో…..
ఏ భాష కవి సార్వభౌముల
కనకాభిషేకంలో
పల్లకీల మీద ఊరేగిందో…..
ఏ భాష అనురక్తి
వెయ్యేండ్ల పద్యాల
విందునిచ్చిందో…..
ఏ భాష అవధాన విద్యను
ఆదరించిందో….
ఏ భాష వచన కవితలో
ఒదిగిపోయిందో…..
అదే అమృతసమానమైన,
ఆపాత మధురమైన,
శ్రేష్టమైన ,శ్రావ్యమైన
హృద్యమైన
“మన తెలుగు భాష”…!!
“అ “అంటే అమ్మ అని
చదివినప్పుడు
తెలుగు నుడి
సాక్షాత్తూ కనిపిస్తుంది
అమ్మ ఒడిలా …!!
అమ్మ నేర్పిన భాష
నాన్న వేలితో చూపిన బాట
తరతరాలకు వెలుగులు పంచే
మన మాతృభాషలోని
తీయదనాన్ని అందించాలి
భావితరాలకు….!!
భావ వ్యక్తీకరణలో
అత్యంత అనువైనది
యాభై అక్షరాలున్న
మన తెలుగు భాష….!!
జన్మభూమి,కన్న తల్లి,
మాతృభాష మన అస్తిత్వం….!!
ఎన్ని భాషలు నేర్చుకున్నా….
మాతృభాషను
రక్తంలో నింపుకొని
రాగ మాధుర్యంతో
జన్మధన్యం చేసుకోవాలి…….!!
మాతృభాషను
మనం ఎన్ని విధాలుగా కీర్తించినా
ఎప్పటికప్పుడు
సత్య సనాతనం నిత్యనూతనం…..!!
అంతిమయాత్రలో
ఆరిపోతున్న
“కర్పూర దీపంలా”
మిణుకుమంటున్న మన తెలుగును
వాడి తగ్గని తెలుగుదనంతో
అచ్చుల కుచ్చెళ్ళు పోసి
హల్లుల మల్లెలు తురిమి
పదహారణాల తెలుగుదనాన్ని
పదిలంగా నిలబెడదాం
ఇంటి నుండిమింటి వరకు….
తెలుగు వెలుగు నింపేద్దాం…!!
– నలిగల రాధికా రత్న