-రాజకీయాలకతీతంగా ఎన్టీఆర్ ను తెలుగు వారంతా అభిమానిస్తారు
-మీ తండ్రి వైయస్సార్ కూడా… ఎన్టీఆర్ అభిమానే
-అయిందేదో అయ్యిందని, ప్రజా నిర్ణయం మేరకు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించాలి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
తెలుగు వారికే గౌరవం తెచ్చిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును ఇంతలా అవమానిస్తే, తెలుగువారు అన్నవారు ఎవరు కూడా మన పార్టీకి ఓటు వేయరని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. టిడిపిని అభిమానించని వారు కూడా, రాజకీయాలకతీతంగా ఎన్టీ రామారావు అభిమానిస్తారని గుర్తు చేశారు. మీ తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూడా ఎన్టీఆర్ అభిమానేనని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అయ్యిందేదో… అయ్యింది, ప్రజా నిర్ణయం మేరకు, ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించాలని సూచించారు. లేకపోతే 175 స్థానాలకు 175 స్థానాలలో ఓటమి చెందడం ఖాయమని, మర్యాదపూర్వకంగా పార్టీ సభ్యునిగా తెలియజేస్తున్నానని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి పక్కనే ఉన్న శకునుల్లారా ఇస్తే మరొక ఫిర్యాదు తనపై ఇచ్చుకోవాలని, మరొక కేసు ఎదుర్కోవడానికి తాను సిద్ధమని ప్రకటించారు.
1986లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ అప్పుడు, ఆ యూనివర్సిటీ కి తన పేరు పెట్టుకోలేదన్నారు. 1998లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు హయాంలో, యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిధులను అప్పు పేరిట కొట్టివేసిన తమ ప్రభుత్వం, ఇప్పుడు ఆయన పేరును కూడా కొట్టివేయాలని చూస్తుందని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ఆశీస్సులతో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి శాసనసబాధిపతిగా ఉండగానే, స్పీకర్ సాక్షిగా… ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చుతున్నామనే తీర్మానాన్ని ప్రవేశపెట్టి, సభ ఆమోదించడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన కారణం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవైపు ఎన్టీఆర్ అంటే తమకు ప్రేమానురాగము ఉన్నదని చెబుతూనే, మరొకవైపు వైయస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ కావడం వల్లే, హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెడుతున్నానని చెప్పడం హాస్యాస్పదంగా అనిపించిందన్నారు. దేశంలో లక్షలాది మంది వైద్యులు ఉన్నారని, రాజశేఖర్ రెడ్డి ఎంబిబిఎస్ చేసిన వైద్యుడు మాత్రమేనని, స్పెషలిస్ట్ కూడా కాదని, ఒక పల్లెటూరులో వైద్యం చేశారని చెప్పారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి స్థాపించని యూనివర్సిటీకి, మనము అప్పుగా డబ్బులు కొట్టేసిన యూనివర్సిటీకి, ఆయన పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని జగన్మోహన్ రెడ్డిని, రఘురామకృష్ణంరాజు సూటిగా ప్రశ్నించారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే, దానికి ఆయన పేరు పెట్టారని గుర్తు చేశారు. గతంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కడప జిల్లాకు… వైయస్సార్ కడప జిల్లా అని నామకరణం చేశారని, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు, జిల్లా పేరును మార్చలేదన్నారు. మనం అధికారంలోకి వచ్చిన తరువాత కడప పేరును కూడా మాయం చేసిన మహానుభావులం మనమని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో హైదరాబాద్ నగరంలో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్, కేబీఆర్ ఇండోర్ స్టేడియం అని పేర్లు పెట్టారని, మనలాగా సిగ్గు లేకుండా సొంత పేర్లు పెట్టుకోలేదని రఘురామ అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీకాలం చివరిలో చంద్రన్న బీమా, చంద్రన్న తోఫా అంటూ ఒకటి, అర పథకాలకు తన పేర్లు పెట్టుకున్నారన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు గురించి, చెబుతున్న కారణం జుగుస్సా కరంగా ఉందన్న రఘురామ, మీ తండ్రికి మన ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏమిటని, మీ తండ్రి పేరు పెట్టుకుంటే ప్రజలు హర్షిస్తారని భావిస్తున్నారా? అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సూటిగా నిలదీశారు.
బతికుండగానే మీ పేరు పథకాలకు పెట్టడం ఏమిటి అన్న ఆయన, అసలు ఈ పేర్ల గొడవ చూస్తుంటే అసహ్యం వేస్తుందన్నారు. పేర్ల పిచ్చి పరాకాష్టకు చేరుకుందని , ఈ సంస్కృతిని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. వైయస్ వైద్యుడు కావడం వల్ల, హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టామని చెప్పుకుంటున్న జగన్ మోహన్ రెడ్డి, వాహన మిత్ర పథకానికి వైయస్సార్ పేరు పెట్టడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. వైయస్ ఏమైనా ఆటో నడిపారా అంటూ చురకలు అంటించారు. రైతు నేస్తం పథకానికి ముందు కూడా వైయస్సార్ పేరుని చేర్చడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వైయస్సార్ ఏమైనా వ్యవసాయం చేశారా అంటూ నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ముందు జగన్మోహన్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు తో కొనసాగిస్తున్న పథకాల పేర్లను రఘురామకృష్ణంరాజు చదవి వినిపించారు.
మెడికల్ కాలేజీల నిర్మాణానికి మార్జిన్ మనీ చెల్లించని రాష్ట్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా మార్జిన్ మన చెల్లించలేదని కేంద్రమంత్రి భారతి పవర్ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా రఘు రామకృష్ణంరాజు వెల్లడించారు. ఏడు మెడికల్ కాలేజీల మంజూరి కోరితే, మూడు మెడికల్ కాలేజీలకు అనుమతిని ఇచ్చినట్లు భారతి పవర్ వెల్లడించారని పేర్కొన్నారు. అయితే ఆ మూడు మెడికల్ కాలేజీ నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా నిధులను చెల్లించలేదని ఆమె స్పష్టం చేసిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం కేవలం మూడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాత్రమే అనుమతినిచ్చిందని కేంద్రమంత్రి భారతి పవర్ చెబుతుండగా, మిగిలిన 14 కాలేజీలను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తారా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.
మచిలీపట్నంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీకి జగనన్న నూతన ప్రభుత్వ వైద్యశాల అని నామకరణం చేయడం పట్ల, భారతి పవర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో… చేసేది లేక దాని పేరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ గా మార్చారన్నారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటూ, కాలేజీ నిర్మాణానికి 325 కోట్ల రూపాయల వ్యయానికి, కేంద్ర ప్రభుత్వ తన వంతు వాటాగా 195 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటాగా 130 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేస్తుందన్నారు. ఈ 130 కోట్ల రూపాయలను అప్పుగా ఇవ్వమని అడిగితే, కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంటోందని చెప్పారు.
తాను నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలకు తన తండ్రి పేరు పెడితే తప్పు ఉందా? అని అంటున్న జగన్మోహన్ రెడ్డి, మరి కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు మోడీ పేరును పెడతారా? అంటూ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ఏమి భారతి సిమెంట్స్ నుంచో, కొట్టేసిన డబ్బుల నుంచో తెచ్చి మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఖర్చు పెట్టడం లేదని రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి తండ్రి ఎవరైతే ఏమిటి? అంటూనే, రేపొద్దున్నే తన శ్రీమతిగా భారతీ రెడ్డి సేవలు చేసిందని… ఆమె పేరు కూడా పెడతానని అంటారని అపహాస్యం చేశారు. మా తండ్రి పేరిట పార్టీ పెట్టామని, మా పార్టీ చేసింది కాబట్టి వైద్య విధాన పరిషత్ కు మా తండ్రి పేరు పెట్టుకుంటే తప్పేంటని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించగానే అసెంబ్లీలో తమ పార్టీ శాసనసభ్యులు బల్లలు చర్చడం విస్మయాన్ని కలిగించిందన్నారు.
ఈ నిర్ణయం వల్ల ఫోటో తొలగించే పరిస్థితి
ప్రతి పేదవాడి ఇంటిలో తన తండ్రి ఫోటో పక్కన తన ఫోటో ఉండేలా చర్యలు తీసుకుంటానని గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రఘురామకృష్ణం రాజు ప్రస్తావిస్తూ… ఎంతమంది ఇంటిలో రాజశేఖర్ రెడ్డి ఫోటో ఉందో తనకు తెలియదని, కానీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్ల ఆ ఫోటోలను తొలగించే పరిస్థితి నెలకొంటుందనడంలో సందేహం లేదన్నారు. బీసీలకు అన్ని విధాలుగా పెద్దపీట వేసిన ఘనత ఎన్టీ రామారావు కే దక్కుతుందని ఆయన అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో బీసీల హృదయాలలో చిరస్మరణీయుడు, తెరస్మరణీయుడు ఎన్టీ రామారావు అని పేర్కొన్నారు.
అసెంబ్లీలో జగనన్న చెల్లి విడుదల రజిని ఒక మార్పుడ్ వీడియోను చూపించారని, అందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ అధినేత రాధాకృష్ణ ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ పేరును మార్చుదామని మాట్లాడుకున్నట్లుగా ఉందని… ఆరోగ్యశ్రీ పథకం పేరును 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చారని గుర్తు చేశారు. అటువంటప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ పేరు ఎక్కడ నుంచి వచ్చిందని, ఆ పేరును చంద్రబాబు నాయుడు మార్చాలని ఎందుకు అనుకుంటారని ప్రశ్నించారు.
ఎన్టీఆర్ వైద్య సేవ పేరును ఒకవేళ మార్చాలని అనుకుంటే ముందుగానే మార్చి ఉండేవారని, తన పదవీకాలం చివరిలో మార్చాలని ఎందుకు అనుకుంటారని నిలదీశారు. ఇది తమ ప్రభుత్వ దిగజారుడు రాజకీయానికి నిదర్శనం అంటూ రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. మాట్లాడితే ఎన్టీఆర్ పేరును ఒక జిల్లాకు పెట్టామని చెబుతూ, ఇప్పుడేమో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చాలన్న నిర్ణయాన్ని ప్రజలు ఎవరు హర్షించరన్నారు. ఈ నిర్ణయం వల్ల మన పార్టీ తుడుచుకుపెట్టు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ముఖ్యమంత్రికి సలహాలు ఇస్తున్న వారు మంచి సలహాలు ఇవ్వాలని, దుర్యోధనుని పక్కన శకుని మాదిరిగా చేరి సలహాలు ఇవ్వరాదు అంటూ సుతిమెత్తగా చురకలు అంటించారు . ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్పును అసెంబ్లీ ఆమోదించిన తక్షణమే వెనక్కి తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఒక చెల్లి తెలంగాణలో తిరుగుతుంటే, మరొక చెల్లి ఢిల్లీలో పోరాటం చేస్తున్నారని, మరి అసెంబ్లీలో చెప్పిన చెల్లి పరిస్థితి రేపు ఏమిటోనంటూ ఎద్దేవా చేశారు.
హిందూ సాంప్రదాయాలను గౌరవించండి
హిందూ సాంప్రదాయాలను గౌరవించాలని, రాష్ట్ర జనాభాలో 72 నుంచి 73 శాతం మంది ఉన్నా హిందూ మనోభావాలను దెబ్బతినకుండా చూసుకోవలసిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఉన్నదని రఘురామకృష్ణం రాజు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈసారైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీసమేతంగా బ్రహ్మోత్సవాలకు హాజరవుతారా? అంటూ జనసేన రాయలసీమ ఇంచార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారని, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మన పై ఉన్నదన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ మళ్లీ పులివెందులలో ప్రారంభం కావడం శుభసూచకమని పేర్కొన్నారు.
గురజాడ గారికి రఘురామ ఘన నివాళి
గురజాడ అప్పారావు గారి జయంతిని పురస్కరించుకొని రఘురామకృష్ణం రాజు ఘనంగా నివాళులర్పించారు. సినీ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.