దేశంలో ఏ రాష్ట్రంలో లేని రాజకీయ సందడి నిత్యమూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇటు ప్రభుత్వం నుంచైనా, అటు ప్రతిపక్షం నుంచైనా కూడా ప్రతీరోజూ రాజకీయ పార్టీల కార్యక్రమాలు ఏదో ఒకటి జరుగుతూనే వుంటాయి. 2019 ఎన్నికల్లో దారుణ పరాజయం తరువాత 23 సీట్లతో తెలుగుదేశం పార్టీ బలమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తుందా అనే అనుమానాలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో నలుగురు వైసీపీ పంచన చేరారు. కొందరు మౌనం దాల్చారు. ఇటువంటి సంక్షోభ పరిస్థితుల నుంచి నెలల వ్యవధిలోనే తేరుకుని తెలుగుదేశం పార్టీ సీట్లు, ఓట్లు లెక్కల్లో కాకుండా ప్రజాసమస్యలపై పోరాడే ప్రధాన ప్రతిపక్షంగా తన సత్తా చాటుతోంది.
ప్రజాపక్షంగా ప్రతిపక్షం…
గతం కంటే భిన్నంగా తెలుగుదేశం పార్టీ దూసుకుపోతోంది. టిడిపి ప్రభుత్వం వున్నప్పుడు నిర్వహించిన మెజారిటీ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక..అసెంబ్లీ సంప్రదాయాలను పూర్తిగా తోసిరాజని బూతులు, అవాస్తవాలతో ఎదురుదాడి చేస్తారని తెలిసి కూడా ప్రజాసమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీకి టిడిపిలో మిగిలిన ఎమ్మెల్యేలతోనే ప్రతిపక్షనేత చంద్రబాబు హాజరయ్యారు. వైసీపీ అధికారమదంతో సభలో చేసే దూషణలు, అవమానాలు మీకు అవసరమా? అసెంబ్లీ బాయ్ కాట్ చేయొచ్చు కదా అని చంద్రబాబుకి చాలా మంది పార్టీ పెద్దలు సలహా ఇచ్చారు. అయితే ఆయన పట్టువదలని రాజనీతిజ్ఞుడు. ప్రజాసమస్యలు చర్చించి పరిష్కరించే వేదికైన అసెంబ్లీ నుంచి, దూషణలకు భయపడి దూరం కావడం మంచిది కాదని వారికి చెప్పి, హాజరయ్యారు. కొందరు పెద్దలు అనుకున్నదే జరిగింది. చంద్రబాబుతో సహా టిడిపి ఎమ్మెల్యేలపై మాటలు, చేతలతో దాడులు జరిగాయి. అయినా వెరవకుండా పంటనష్టపరిహారం బీమా ప్రీమియం సర్కారు చెల్లించకపోవడం వల్ల నష్టపోయిన రైతులు అంశాన్ని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేశారు. దీంతో అసెంబ్లీలో చర్చ జరిగిన రాత్రికి రాత్రి పంటల బీమా ప్రీమియంని ఆగమేఘాలపై అధికారులు చెల్లించారు. తనను వైసీపీ సభ్యులు దూషించినదాని కంటే, వేలకోట్లు రైతుల నష్టాన్ని తప్పించగలిగానని చంద్రబాబు అసెంబ్లీకి వెళ్లొద్దని సలహా ఇచ్చిన పెద్దలకు చెప్పారు.
లాక్‌డౌన్‌లో ఆన్‌లైన్లో…
కరోనా కల్లోలంతో లాక్‌డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చిన సమయంలోనూ తొలిగా జూమ్ యాప్‌ని వాడుతూ ఆన్‌లైన్ సమావేశాలతో కొత్త ఒరవడి సృష్టించారు చంద్రబాబు. పార్టీ శ్రేణుల సమావేశాలకీ, కార్యక్రమాలకీ జూమ్‌ని ఒక అనుసంధాన వేదికగా వాడుకునేలా అలవాటు చేయించారు. తెలుగుదేశం పార్టీ మహావేడుక మహానాడుని ఆన్‌లైన్‌లో నిర్వహించి చరిత్ర సృష్టించారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ లాక్‌డౌన్ కఠినతర నిబంధనల అమలవుతున్న కాలంలో భూమికి దూరంగా, జూమ్‌కి దగ్గరగా వుంటారంటూ అధికారపార్టీ నుంచి విమర్శలు వచ్చినా.. వెరవకుండా ఆన్లైన్‌లోనే సమీక్షలు, సమావేశాలు, ప్రణాళికలు, పార్టీ పోరాటాలకు ఓ రూపమిచ్చారు.
నిర్బంధాల్ని ఎదిరించి మరీ…
కోవిడ్ నిబంధనలు సడలించిన తరువాత టిడిపి నిరసన కార్యక్రమాలకు పోలీసుల్ని అనుమతి కోరడం వారు నిరాకరించడం.. ఆందోళనకి పిలుపునివ్వడం పోలీసులు గృహనిర్బంధం చేయడం.. టిడిపి నేతల్ని అక్రమ అరెస్టులు చేయడం సర్వసాధారణమైపోయాయి. పోలీసుల్ని అనుమతి కోరితే కోవిడ్ పేరుతో అనుమతి నిరాకరిస్తున్నారు. టిడిపి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు దేవినేని ఉమా మహేశ్వరరావు, కొల్లు రవీంద్ర…టిడిపి నేతలు, ధూళిపాళ్ల నరేంద్ర, కిమిడి కళా వెంకటరావు, జేసీ ప్రభాకర్‌రెడ్డి, కూన రవికుమార్, పట్టాభి, నాదెండ్ల బ్రహ్మం, టీఎన్ఎస్ఎఫ్ ప్రణవ్‌గోపాల్ ఇలా రాష్ట్రవ్యాప్తంగా నేతల్ని తప్పుడు కేసుల్లో అరెస్టు చేసినా ..ఒక్కరూ వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం తీరుపై పోరాడుతూనే ఉండడం తెలుగుదేశంలో నవ్యోత్తేజం నింపింది. ఒక వేళ అనుమతి ఇచ్చినా తలపెట్టిన కార్యక్రమానికి ఒక్క నాయకుడు కూడా హాజరు కాకుండా నిర్బంధించేస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ తమ పోరాట, ఉద్యమాల స్ట్రాటజీని మార్చేసింది.
టిడిపి స్ట్రాటజీ మారింది…
క్షేత్రస్థాయి నుంచి సమస్త సమాచారం తెప్పించుకుని,.. దానిని విశ్లేషించుకుని ..దానిని ప్రాంతాల వారీగా, రాష్ట్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలిగా గుర్తించడం శాస్త్రీయంగా చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల సమయంలో ప్రజలకు మద్దతుగా వుండాల్సిన అవసరంపై చర్చిస్తూ ఉద్యమ కార్యాచరణకి దిగుతున్నారు. ఇసుక పాలసీ రద్దు చేసి కొత్త విధానం అమలులోకి తీసుకురావడంలో జగన్ సర్కారు వహించిన జాప్యంతో వందలాది భవననిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిపై ఆధారపడిన 120కి పైగా వ్యాపారాలు, అనుబంధ రంగాలు సంక్షోభంలో పడిన సమయంలో ఇసుక కొరతపై భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు టిడిపి ఆధ్వర్యంలో చేపట్టారు.
అన్నా క్యాంటీన్ల మూసివేతని నిరసిస్తూ..క్యాంటీన్లు ఉన్న ప్రాంతాలలోనూ టిడిపి వంటావార్పు కార్యక్రమం నిర్వహించి, పేదలకు అన్నదానం చేసి శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టారు. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్ల ప్రాంతాలలో ఆందోళన చేశారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలు, విద్యుత్ చార్జీల పెంపుపై గ్రామ పార్టీ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆకాంక్షని ప్రభుత్వానికి వినిపించగలిగారు. దళితులపై దాడులు, మైనారిటీలపై దాడులని నిరసిస్తూ ఉధృతమైన పోరాటం సాగించింది తెలుగుదేశం పార్టీ. ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాలయాలపై దాడులను ఖండిస్తూ చేసిన నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టించింది టిడిపి. కోవిడ్ బాధితుల్ని ఆదుకోవాలంటూ వాడవాడలా పార్టీ కేడర్ నినదించింది.
పాతతరం..కొత్తతరం కలిసి…
తెలుగుదేశం పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తోన్న కీలక నేతలు…యువనేతలతో కలిసి హుషారుగా పనిచేయడం ఇప్పుడు కేడర్‌లో సరికొత్త జోష్ నింపుతోంది. తండ్రీకొడుకులు, బంధువులు, పార్టీలో యువనేతలు-సీనియర్ నేతలు కలిసి సుహృద్భావ వాతావరణం నింపుతున్నారు. చంద్రబాబు- లోకేష్-అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు-కూన రవికుమార్, చింతకాయల అయ్యనపాత్రుడు-చింతకాయల
విజయ్, కిమిడి కళావెంకటరావు-కిమిడి నాగార్జున, జేసీ ప్రభాకర్‌రెడ్డి-జేసీ అస్మిత్‌రెడ్డి, జేసీ పవన్‌రెడ్డి, పట్టాభి, బ్రహ్మం, అశోక్‌బాబుతో పాటు ప్రతీజిల్లాలోనూ వయస్సు తారతమ్యంలేకుండా పార్టీకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
సొంతంగా పార్టీ కార్యక్రమాల్లో…
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నిర్దేశించిన కార్యక్రమాలే కాకుండా నియోజకవర్గ సమస్యలు, అవసరాలు, ప్రజల కోసం ఆయా నియోజకవర్గాలు, జిల్లాల్లో టిడిపి నేతలు సొంతంగా పార్టీ కార్యక్రమాలు ప్లాన్ చేసుకుని పకద్బందీగా నిర్వహిస్తున్నారు.
పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే రామానాయుడు సైకిల్‌పై నియోజకవర్గం వ్యాప్తంగా పర్యటించి, కోవిడ్ బాధితులకు సాయం అందిస్తూనే, కోవిడ్ బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించొద్దని, పెంచిన కరెంటు బిల్లులు తగ్గించాలనే డిమాండ్లతో ఉద్యమించింది టిడిపి.
ప్రభుత్వ వైఫల్యాలపై మీడియా, సోషల్‌మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది. జలవనరుల ప్రాజెక్టులలో అవినీతి, జాప్యంపై దేవినేని ఉమా, ఆర్థిక అవకతవకలు అప్పులపై యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల స్కాం పేరుతో తప్పుడు ఫిర్యాదులిచ్చిన వైసీపీ బండారం బయటపెట్టడంతో ధూళిపాళ్ల నరేంద్ర, ఏజెన్సీలో జగన్‌రెడ్డి సోదరులు మైనింగ్ మాఫియాపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, సోషల్‌మీడియాలో నిత్యమూ ప్రభుత్వాన్ని ముళ్లుకర్రతో పొడుస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి..పార్టీ కార్యకర్త నుంచి నాయకుడి వరకూ అంతా యాక్టివ్ కావడంతో తెలుగుదేశం తన పోరాట పంథాని ఇంకా ఉధృతం చేసింది.
ప్రజోపయోగమే ప్రతిపక్ష లక్ష్యంగా…
ఇదే సమయంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కీలక నేతలు, పొలిట్‌బ్యూరో సభ్యులతో స్ట్రాటజీ సమావేశాలు నిర్వహిస్తూ…ప్రజలకు అండగా నిలిచేందుకు పోరాడే అంశాలపై సమీక్షిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ క్షేత్రస్థాయి పర్యటనలు టిడిపికి కొత్త జోష్ నింపితే, వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ప్రెస్‌మీట్లు, ప్రెస్ నోట్లు, ట్వీట్లు, లెటర్లు, క్షేత్రస్థాయి ఆందోళనలు, వినతిపత్రాల సమర్పణ వంటి అన్ని అవకాశాలనూ టిడిపి చక్కగా వినియోగించుకుంటూ ప్రజల్లో ఉంటోంది. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన నైరాశ్యంలో వుండిపోతుందనుకున్న అధికార పార్టీకి విచిత్రంగా టిడిపి మరింత బలోపేతం కావడం వ్యూహకర్తలకు అంతుచిక్కడంలేదు. అన్నిరకాల నిర్బంధాలు కొనసాగిస్తూన్న ఎవ్వరూ తగ్గడంలేదు.
అనుబంధసంఘాల దూకుడుతో…
దేశంలో ఎవ్వరికీ లేనంతగా తెలుగుదేశం పార్టీకి 70 లక్షల మంది కార్యకర్తలున్నారు. అయితే వివిధ అనుబంధసంఘాలున్నా అంత యాక్టివ్‌గా లేవని గుర్తించిన అధిష్టానం…ఒక్కో అనుబంధ సంఘం కమిటీలు వేసుకుంటూ వచ్చింది. అలాగే పార్టీ పార్లమెంటరీ కమిటీల నియామకం పూర్తి చేసింది. ప్రజాక్షేత్రంలోకి తెలుగుదేశం కోర్ టీమ్‌తోపాటు ఆయా అంశాలపై స్పందించి ఉద్యమించేందుకు తెలుగు యువత, తెలుగు మహిళ, టీఎన్ఎస్ఎఫ్, టీఎన్టీయూసీ, తెలుగు రైతు, ఐటీడీపీ, టిడిపి ప్రొఫెషనల్స్ వింగ్‌తోపాటు ఎస్టీ సెల్, ఎస్సీ సెల్, బీసీ సెల్, క్రిస్టియన్ సెల్, మైనార్టీ సెల్, టిడిపి వాణిజ్యవిభాగాలకు అన్నింటికీ కమిటీలు వేసి…ప్రజాపక్షమైన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ నవ్యోత్తేజంతో ఉద్యమిస్తోంది. ఇటీవల వైసీపీ టిడిపి కేంద్ర కార్యాలయంపైనా, రాష్ట్రవ్యాప్తంగా వున్న టిడిపి ఆఫీసులపైనా దాడులకు తెగబడింది.
ఆ దాడుల తరువాత ప్రతిపక్షంలో కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు ఎవరైనా భయపడతారు. కానీ దీనికి భిన్నంగా టిడిపిలో కేడర్ నుంచి లీడర్ దాకా ఇంకెన్ని దాడులు చేస్తారు దమ్ముంటే రండి అంటూ సవాల్ విసిరే స్థాయికి వచ్చారు. మా కార్యాలయం అద్దాలు పగులకొట్టారు కానీ, మా గుండెల్లో వున్న టిడిపి జెండాని పగులకొట్టగలరా అంటూ మరింత ఉత్సాహంతో పనిచేయడం ఆరంభించారు. మీకు బీపీ వచ్చింది… మాకూ వస్తుందంటూ కొత్త నినాదం అందుకున్నారు. క్షేత్రస్థాయిలో కూడా రెండున్నరేళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజావ్యతిరేకత పెరుగుతుండడంతో టిడిపి శ్రేణులు ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. టిడిపి కార్యాలయంపై దాడి..అంతకు ముందు చంద్రబాబు ఇంటిపైకి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తన రౌడీమూకలతో చేయించిన దాడితో ప్రజల్లో టిడిపిపై సానుభూతి పెరిగింది.
ఇవన్నీ సానుకూల అంశాలుగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో మరింతగా ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు, రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా పోరాడేందుకు చక్కనైన ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్, నాలెడ్జ్ సెంటర్, ప్రొగ్రాం కమిటీ…వివిధ మార్గాలలో సేకరించిన ప్రజాసమస్యలు, దీనికి సంబంధించిన వాస్తవ గణాంకాలు, ప్రభుత్వం తీరుతో జరుగుతున్న నష్టంపై పూర్తి ఆధారాలు ఒక దగ్గర చేర్చి..క్షేత్రస్థాయిలో వారితో చర్చించి… ఉద్యమరూపం ఇచ్చేందుకు స్ట్రాటజీ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఇలా మారిన ఉద్యమ పంథాతో అసలు సిసలు ప్రతిపక్షపాత్ర పోషిస్తూ తెలుగుదేశం నవ్యోత్తేజంతో దూసుకుపోతోంది.
కార్యాచరణలోకి కీలక నేతలు …
కేసులు, అరెస్టులతో విసిగిపోతారనుకున్న వైసీపీకి మైండ్‌బ్లాంక్ అయ్యేలా దెబ్బ కొడుతున్నారు టిడిపి నేతలు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ని లెక్కలేనన్ని సార్లు అరెస్ట్ చేశారు. పార్టీ కార్యక్రమం అంటేనే చింతమనేని భయపడాలన్నంతగా సర్కారు పోలీసుల్ని ప్రయోగించింది. ఇంత నిర్బంధంలోనూ, టిడిపి ఏ కార్యక్రమం తలపెట్టిన ముందుంటున్నారు చింతమనేని. అక్రమమైనింగ్ అంటూ కేసులంటూ యరపతినేని శ్రీనివాసరావుని లొంగదీసుకోవాలని చూశారు. ఏ కేసులకూ బెదరని ఆయన మరింత క్రియాశీలంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు.
అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ని వందలకోట్ల మేరకు నష్టం చేశారు. ఆయనైతే కోర్టులో తేల్చుకున్నారు కానీ తగ్గేదేలే అంటున్నారు. చాలా రోజులుగా పార్టీకి అంటీముట్టనట్టు వున్న కీలక నేతలూ పూర్తి యాక్టివ్‌గా మారారు. టిడిపి కార్యాలయంపైకి వచ్చిన గూండాలకు దమ్ముంటే రండంటూ సవాల్ విసిరారు ఎంపీ కేశినేని నాని. వైసీపీ అరాచకాలపై ఢిల్లీలో చంద్రబాబు వెంటే వున్నారు విజయవాడ ఎంపీ. కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ని పార్టీ కార్యక్రమాలకు దూరం చేయాలనుకుంటే…కేసులెన్ని పెట్టుకుంటావో పెట్టుకో అంటూ వైసీపీని ఆయన ఉక్కిరి బిక్కిరి చేస్తూ, ఊరూవాడా చుట్టేసి వస్తున్నారు.
ఏపీ టిడిపి అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తన మాస్ ఇమేజ్‌ని కొనసాగిస్తూ… ఉత్తరాంధ్ర వ్యూహాలలో తలమునకలవుతూనే…జాతీయ అధ్యక్షుడితో కలిసి పార్టీ బలోపేతం బాధ్యతలు తీసుకున్నారు. కర్నూలులో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తన తండ్రి స్టైల్‌లో హడావిడిలేని రాజకీయ ఎత్తులకు తెరతీశారు. విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు మళ్లీ తెలుగుదేశం వికాసం వైపు అడుగులు పడుతున్నాయి. ప్రకాశం జిల్లాలో అయితే రోజూ టిడిపిలో చేరికలు ఊపందుకున్నాయి. నెల్లూరు, చిత్తూరు నాయకులు ఎన్నికల బరిలో తమ సత్తా చాటుతామని ప్రకటిస్తున్నారు. అనంతపురంలో గ్రూపులున్నా…ఎవరికి వారే టిడిపి అధికారంలోకి తీసుకొస్తామంటూ క్షేత్రస్థాయి వ్యూహం అమలు ఆరంభించారు. 13 జిల్లాల్లోనూ కేడర్ నుంచి లీడర్ వరకూ అందరికీ జగన్ పాలన అర్థమైపోయింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి, ప్రజలకీ ఎంత అవసరమో…పార్టీ అధికారంలోకి రావడం తమకూ అంతే అవసరమని టిడిపి నేతలు గుర్తించి, అహర్నిశలూ పనిచేస్తున్నారు.
– చైతు