ఆమె అపోలో సంస్థల అధినేత్రి.. పేరు డబ్బు ఉన్న అమ్మాయి కానీ వాటికి మించిన మంచి మనసు కారణంగా ఇవాళ ఎందరో జేజేలు అందుకుంటున్న మంచి మనిషి. మెగా కోడలు అని రాయడం చాలా చిన్నమాట. ఎందుకని ఈ గుర్తింపు ఆమె పేరు ఉపాసన చాలు.. ఇందుకుమించి రాయకూడదు.. రాస్తే అతి.. ! అపోలో ఫౌండేషన్ తరఫున త్వరలో చేపట్టే ఓ మంచి కార్యక్రమానికి ఆల్ ద బెస్ట్. అందం మాట్లాడుతుంది అందమయిన మనసు మాట్లాడితే ఈ లోకం ఇంకాస్త మార్పు చెంది ఉంటుంది.. మాటలు కావు చేతలు కావాలి. కనుక ఉపాసన మాట్లాడరు.. మాట్లాడ కూడదు కూడా ! అప్పుడు ఔన్నత్యం పెరిగి తీరుతుంది. జీవన గతిలో ఆనందాలు ఇంకాస్త రెట్టింపు అవుతాయి. అప్పుడు తల్లీ,తండ్రీ మిమ్మల్ని చూసి అభినందిస్తారు ఉపాసనా !
తండ్రికి తగ్గ బిడ్డలు అమ్మకు తగ్గ కూతుళ్లు ఉన్నారా ఈ లోకంలో ! పేరు కీర్తి సంపాదించి ఇచ్చి తమ తల్లిదండ్రులకు ఓ చిర జ్ఞాపకం అందించి వెళ్తున్నారా మరి ! ఆసరా కోల్పోయిన జీవితాలకు వృద్ధాశ్రమాలు నిలువ నీడ పంచి వెళ్తున్నాయి. ఆ నీడల్లో కొందరు తమని తాము ప్రశ్నించుకుంటూ
ఉంటున్నారు. చేదు నిజాలు ఎన్నో వెన్నాడి వారిని ఒంటరిని చేసిన క్రమాన ప్రేమ రూపాలు కొన్ని అప్రకటితం అయి ఉంటాయి. ఎవరి ప్రేమ అయినా గొప్పదే ! ఇతరుల జీవితాలను సంస్కరించే ప్రేమ గొప్పది అని మీ తల్లిదండ్రులు మీకు నేర్పాలి.. నేర్పి ఉంటే ఆచరించి తీరాలి. తల్లీ తండ్రీ ఓ అనాథల్లా ఉండిపోయిన రోజు మీరు ఓడిపోయారు. మీ సంపద కూడా ఓడిపోయింది.. అప్పుడు మీ జీవితం ప్రయోజనం దక్కించుకోని వైనానికి తార్కాణం. నిష్ఫలం.. నికృష్టం.. నీఛం కూడా.
తోడు ఒకరుంటే జీవితం ఏమౌతుంది.. ఏమైపోతుంది.. నవ్వుకోండి ఏం కాదు. తోడు లేని జీవితాలు చాలా ఉన్నాయి మరి! వారి గురించి పట్టించుకునే వారేరి? అమ్మా నాన్న ఒక బంధంగా మనకు మారాక ఈ తోడు అన్నది ఓ విస్తృతం అయిన ఒంటరికి కారణం అవుతోంది. మనుషుల్లో చింతన లేదు. బాధ లేదు. తప్పు చేశాం అన్న చింతన లేదు. తప్పు తరువాత పుట్టిన బాధకు తోడే లేదు. కనుక బాధలు ఒంటరి. దిగులు నీడలు ఒంటరి. జీవితం ఓ ఒంటరి ప్రావాసాన ఆవాసాన ఉన్నప్పుడు నేను కన్నీటి ప్రావస్థలను ప్రేమించాను అని ఎవ్వరైనా అనుకుంటున్నారా?
అనుకుని మళ్లీ తమని తాము తెలుసుకుని నిర్వచిత ప్రావస్థల్లో అమ్మనూ నాన్ననూ తీసుకుని వెళ్లి ఉంచుతున్నారా ? మీకొక విన్నపం మీ బిడ్డలను మీరు ఒంటరిని చేయడం మానుకోండి అని తల్లిదండ్రులను ఎలా వేడుకుంటామో , అలానే మీ తల్లిదండ్రులను ఒంటరిని చేయొద్దు అని కూడా ఓ విన్నపం ఎక్కడి నుంచో వస్తుంది వింటున్నారా మీరు..
డబ్బు మాత్రమే చాలా పనులు చేయిస్తుంది అని అనుకోవడం తప్పు. ప్రేమ నిండిన మనుషుల దగ్గర డబ్బు లేదు కంటి నిండా నిద్ర ఉంది. అది కలత నిద్రే కావచ్చు కానీ కొన్ని దుఃఖాలను ఎటువంటి మందులూ వాడకుండానే దూరం చేస్తోంది. కనుక మీ బిడ్డలను మీరు ప్రేమిస్తూ, మీ తల్లికీ తండ్రికీ వెలితి లేని ప్రేమ అందించండి. కొదవంటూ లేని ప్రేమకు సాకార రూపం ఒకటి వెతికి రండి. కొన్ని డబ్బున్న కుటుంబాల్లోనే కాదు మరికొన్ని పేద కుటుంబాల్లోనూ జాలి దయ అన్నది లేవన్నవి తేలిపోతున్నాయి కొన్ని సందర్భాల్లో !
వృద్ధులు ఒంటరిగా ఉంటారు. ఉంటున్నారు. అవసాన దశలో జీవితం ఓ అందమయిన దృశ్యకావ్యం కావాలి. కాదు కానీ జీవితాన్ని మార్చే ప్రయత్నం ఒకటి తప్పక చేయాలి. అలాంటి ప్రయత్నానికి ఊతం ఇస్తూ ఉపాసన కొణిదెల ముందుకు వచ్చారు.
బిలియన్ హార్ట్స్ బీటింగ్ ఫౌండేషన్ ద్వారా వివిధ రాష్ట్రాలలో (తెలుగు రాష్ట్రాలతో సహా) వృద్ధాశ్రమాలను దత్తత తీసుకుని వారికి నెల నెలా మందులు అందించేందుకు ముందుకు వచ్చారు. అమ్మలంతా ఆనందిస్తున్నారు..నాన్నలంతా ఆ లాలనలో సంతోష సందోహాలలో ఉండిపోతున్నారు. కొన్ని క్షణాల ఆనంద కారకాలు మీ బిడ్డలు మీకు ఇవ్వడం లేదు.. జీవితం ఇలానే ప్రశ్నించి వెళ్తుంది.. డబ్బు కీర్తీ ప్రతిష్టలకు మించిన ఓ రూపం మీకు కనిపించి ఆదరించి వెళ్తుంది.
మనుషులం కదా తప్పులు చేస్తాం.. దిద్దుబాటులో లేకపోతేనే కోపం వస్తుంది సర్.. ఉపాసన అనే ఓ మంచి మనిషి వీరికి సాయం చేసి ఆ కాస్త కోపాన్ని తగ్గించిన వైనమే గొప్పది. దేశ వ్యాప్తంగా 150 వృద్ధాశ్రమాలను దత్తత తీసుకున్న వేళ.. కోడలు పిల్లా నీకో కృతజ్ఞత ! నీకో ధన్యవాద
– కిశోర్ శంభుమహంతి