– తన అభిమాని కుమారునికి నామకరణం చేసిన కేసీఆర్
– జన్మ నక్షత్రం ప్రకారం ‘సుమన్’ అనే పేరు ఖరారు
– ఫలించిన తొమ్మిది నెలల ఉద్యమ దంపతుల నిరీక్షణ
హైదరాబాద్: తన కుమారునికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదంతో, వారి చేతుల మీదుగా పేరు పెట్టుకోవాలని ఎదురుచూసిన తెలంగాణ ఉద్యమకారుల దంపతుల ప్రయత్నం, వైకుంఠ ఏకాదశి పవిత్ర దినం నాడు ఫలించింది.
పరిగి నియోజక వర్గానికి చెందిన మల్లేపల్లి గ్రామ నివాసి దొడ్ల నర్సింహులు తెలంగాణ ఉద్యమ కారుడు. కాగా నర్సింహులు దంపతులు తమ ప్రియతమ నేత కేసీఆర్ తో తన కనిష్ట కుమారునికి నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.
కాగా…బాబు పుట్టిన తొమ్మిది నెలల నుండి ఎదురుచూస్తున్న వారి ప్రయత్నం, వైకుంఠ ఏకాదశినాడు ఫలించింది. మంగళవారం నందినగర్ నివాసానికి వెళ్లారు. కుటుంబంతో వచ్చిన దొడ్ల నర్సింహులు అనిత దంపతులను అధినేత కేసీఆర్ ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆ ఉద్యమ దంపతుల కోరికను మన్నించి, వేద పండితుని సలహాతో, బాబు జన్మ నక్షత్రం ప్రకారం వచ్చిన, ‘సు’ అక్షరాన్ని ఆధారం చేసుకుని సుమన్’ అనే పేరు పెట్టారు. చిన్నారి బాబును ప్రేమతో తలపై నిమిరి, సంపూర్ణ ఆరోగ్యం తో నూరేళ్లు వర్ధిల్లాలని కోరుకుంటూ ఆశీర్వదించారు.