Suryaa.co.in

Editorial

ఆ ‘బాబు’ బంగారమేనట!

– జగన్ ఏలుబడిలో ఓ ఐఏఎస్ చేతి మీదుగా అమూల్ పాలైన 2 వేల కోట్ల ఋణం
– క్విడ్ ప్రోకో పథకంలో ‘కోడ్ ట్రీ’ ద్వారా ఆ ఐఏఎస్ కు భారీ నజరానా‌
ఏమిటీ కోడ్ ట్రీ ?
– ఐఏఎస్ కు కోడ్ ట్రీకి లింకేంటి?
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయనో మ్యాజిక్ మాస్టర్. ఐఏఎస్‌లలో ఆయన స్టైలే వేరు. కథలు చెప్పడంలో చేయితిరిగిన రచయితలు కూడా ఆయన ముందు దిగదుడుపే. దేవతావస్త్రాల కథ చెప్పడంలో ‘ఉత్తుత్తి యూనివర్శిటీ’లో ఆయన పీహెచ్‌డీ చేశారు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చూపడంలో అఘటనాఘట సమర్ధుడు. గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యల్లో ఆరితేరిన అధికారి. ఆర్ట్ ఆఫ్ లివింగ్‌లో రవిశంకర్‌కే పాఠాలు చెప్పగలిగేంత గొప్పోడు.

అలాంటి మ్యాజిక్ చేసే.. గతంలో బాబు సర్కారును భ్రమల్లో పెట్టి ముంచేశారు. టెక్నాలజీ అంటే మురిసిపోయే చంద్రబాబు కూడా, సారు మాటలకు అమాయకంగా పడిపోయారు. పాలిటిక్స్‌లో ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్రీ’్ట అయిన బాబు బలహీనత తెలుసుకున్న ఆ బాబు.. ‘మళ్లీ మనదే అధికారం. మీరు బేఫికర్‌గా ఉండండి’ అని అరచేతిలో వైకుంఠం చూపారు. జనమంతా మీ వైపే అన్నారు.. జగన్‌కు ఏమీ లేదన్నారు.. పాలనపై ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారన్నారు.. సమస్యల రహిత రాష్ట్రమని, ప్రజలు తెగ మెచ్చుకుంటున్నారని గ్యాస్ కొట్టారు.

చేతిలో తరాజు పెట్టుకుని, రోజూ జనం సంతృప్తస్థాయిని తూకం వేసే మొనగాడాయన. ప్రజల సంతృప్తి శాతం 80 నుంచి ఎకాఎకి 92 శాతం వరకూ ఉన్నట్లు భ్రమల్లో ఉంచి, ముంచారు. అప్పట్లో ఓ యువనేత వద్ద సలహాదారుగా ఉన్న మరొకాయన కూడా ఈ సారు మేథస్సులో భాగమయ్యారు. ఆ తర్వాత ఆయన ఎన్నికల ముందు చంద్రబాబును పొగుడుతూ పుస్తకం కూడా రాశారనుకోండి. అది వేరే విషయం.

రోజూ ఫోన్లలో వేలమందితో మాట్లాడి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని.. వారిలో 85 శాతం బాబు పాలనపై ఫుల్ హ్యాపీగా ఉన్నారని, రంగుల రంగుల టేబుల్స్ వేసి మరీ చంద్రబాబుకు ఇచ్చేవారు. దానితో చంద్రబాబు కూడా వాళ్ల మాయకు పడిపోయారు. కాకిలెక్కలు నమ్మేశారు. అఫ్ కోర్స్.. అప్పట్లో కలెక్టర్లు కూడా ఆ సారు వాడిన గ్యాస్ కంపెనీనే వాడి, చంద్రబాబుకు దేవతావస్త్రాల కథలు చెప్పి, నిండా ముంచేశారనుకోండి.

సీన్ కట్ చేస్తే జగనన్న సర్కారు అధికారంలోకి వచ్చింది. కాబట్టి కచ్చితంగా ఆయనను పక్కనపెట్టాలి. పైగా జగన్ విపక్ష నేతగా ఉన్నప్పుడు, ఆ మ్యాజిక్ మాస్టర్‌పై నందిగామలో చేయి చేసుకున్నారు. కాబట్టి జగన్ ఆ ఐఏఎస్ సారు లెక్కప్రకారం, ఆ ఐఏఎస్ సారుకు అసలు పోస్టింగే ఇవ్వకూడదు. సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో జగనన్న ఈ పాలిసీనే పాటించారు.

కానీ విచిత్రం జగనన్నను కూడా సారు మెప్పించేశారు. కీలకమైన వ్యవసాయశాఖ కట్టబెట్టారు. జగనన్న ముచ్చటపడి రాష్ట్రానికి తెచ్చుకున్న అమూల్ ప్రాజెక్టుకు స్పెషలాఫీషర్‌గా నియమించారు. కో ఆపరేటివ్, కో ఆపరేటివ్ సొసైటీస్ ఎండీగా నియమించారు. దానితో జగనన్న కళ్లలో మెరుపుల కోసం.. టీడీపీ నుంచి 5 సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను దుంపతెంచారు. ఆయనను ‘కేవలం 32 రోజులు మాత్రమే’ విజయవంతంగా జైల్లో ఉంచారు.

ధూళిపాళ్ల చైర్మన్‌గా ఉన్న సంగం డైరీని మూయించేందుకు శ్రమదానం చేశారు. అధికారులతో అర్ధరాత్రి దాడులు చేయించారు. ఉద్యోగులను భయభ్రాంతులను చేశారు. న్యాయపోరాటంతో నరేంద్ర గండం గడిచి బయటపడ్డారు. చిత్తూరు డైరీని పుట్టిముంచి, అమూల్ పాపకు దాన్ని దక్కించేందుకు ఐఏఎస్ సారు పడని కష్టమంటూ లేదు. చంద్రబాబు కుటుంబ కంపెనీ అయిన హెరిటేజ్‌ను మూయించి, దానిని దెబ్బతీసేందుకు సారు పడ్డ కష్టం చూసి జగన్ మురిసి ముక్కలయ్యారు.

మళ్లీ సీన్‌కట్ చేస్తే.. ఎన్నికల్లో కూటమి సర్కారు విజయం సాధించింది. హెరిటేజ్, సంగం కంపెనీలను సమాధి చేసేందుకు జగన్ ఆడిన ఆటలో, కెప్టెన్ పాత్ర పోషించిన ఈ ఐఏఎస్ సారుకు, ఏబీ వెంకటేశ్వరరావు మాదిరిగా శంకరగిరి మాన్యాలు తప్పవని కార్యకర్తలు కలలుగన్నారు. కానీ విచిత్రం. ఫిషరీస్, హార్టికల్చర్ శాఖ అప్పగించారు.

మళ్లీ సీన్ కట్ చేస్తే… లేటెస్టుగా ఖజానాకు కాసులు తెచ్చే కీలక శాఖ అప్పగించింది. తాజాగా రాష్ట్ర పన్నుల శాఖ కమిషనర్ పదవి ఇస్తూ, ఉత్తర్వులు జారీ చేయడం టీడీపీ సోషల్‌మీడియా సైనికులను హాశ్చర్యపరిచింది. గతంలో టీడీపీ ప్రభుత్వ పతనానికి, చంద్రబాబు భ్రమల్లో ఉండేందుకు కారకుడైన అధికారి… టీడీపీ యుద్ధసేనాని ధూళిపాళ్ల నరేంద్ర, 32రోజులు జైల్లో ఉండేందుకు కారకుడైన అధికారికి.. కీలకమైన పోస్టింగ్ ఇవ్వడంపై, టీడీపీ సోషల్ మీడియా సైనికులు అగ్గిరాముళ్లలవుతున్నారు.

‘బహుశా ఇంకా సీఎంగా జగన్, సీఎస్‌గా జవహర్‌రెడ్డి -సీఎంఓ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్య కొనసాగుతున్నట్లుంది’ అంటూ తెలుగుతమ్ముళ్లు వెటకారాలాడుతున్నారు. దీన్నిబట్టి జగన్ దన్నుతో సంగం-హెరిటేజ్‌లను వేధించిన అధికారికి, కీలకమైన పదవిని సిఫార్సు చేసిన ఉన్నతాధికారికి.. ‘జగనాభిమానం’ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోందన్న విమర్శలు, తెలుగుతమ్ముళ్లు పార్టీ సోషల్‌మీడియాలో పోటాపోటీగా పంచుకుంటున్నారు.

సోషల్‌మీడియా కథనాల ప్రకారం.. హెరిటేజ్, సంగం ఇతర డైరీలని మూయించాలనే జగన్ కుతంత్రాలను అమలు చేసింది అంతా ఆ ఐఏఎస్ అధికారే. గత ప్రభుత్వంలో జగనన్న పాల వెల్లువ పేరుతో రెండు వేలు కోట్లు రుణం తీసుకుని, రకరకాల పాల డైరీ పరికరాలు కొనుగోలు చేశారు. వాటితో చిత్తూరు డైరీని పునరుద్దరిస్తున్నామని చెప్పి, అంతా అయ్యాక చిత్తూరు డైరీని అమూల్ కి నామమాత్రం లీజుకి ఇచ్చారు.

2వేల కోట్లతో కొత్తగా కొన్న డైరీ ఎక్విప్మెంట్, ఈ విధంగా చిత్తూరు డైరీ ద్వారా అమూల్ చేతికి చిక్కింది. కానీ అమూల్ నుంచి జగన్ ప్రభుత్వం, ఒక్క పైసా కూడా తిరిగి వసూలు చేసిన పాపాన పోలేదు.ఏమిటి దీని వెనక మతలబు ? 2000 కోట్ల ప్రజాధనం, చిత్తూరు డైరీ ద్వారా అమూల్ కు చేరిందంటే దాని వెనుక వున్న పెద్దలు గద్దలు ఎవరు ? ఇదంతా అమూల్ పైన అవ్యాజమైన ప్రేమా ? లేక ప్రజాధనాన్ని దోపిడీ చేసే కుతంత్రమా?ఒక పక్క ఇవన్నీ మౌలిక ప్రశ్నలు.

ఇంకో పక్క.. ఈ జనం సొమ్ము అమూల్ పాలైపోవటంలో కీలక పాత్ర ఎవరో కాదు. పర్యవేక్షణంతా ఆ ఐఏఎస్ అధికారే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రభుత్వ శాఖల్లో.. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తామని దూరి స్వామి కార్యం, స్వకార్యం రెండూ చక్కబెట్టిన బినామీ కంపెనీ గురించి మాట్లాడుకోవాలి. ఆ బినామీ కంపెనీ పేరే కోడ్ ట్రీ సొల్యూషన్స్. ఈ కంపెనీ ఎవరిదో కాదు.. ఐఏఎస్ సారు గారి భార్య గారిదే, ఈ కంపెనీ కోడ్ ట్రీసొల్యూషన్స్!

కోఆపరేటివ్ సొసైటీల కంప్యూటరైజేషన్ పేరుతో, ఐఏఎస్ సారు గారి భార్య పేరుతో ఉన్న కోడ్ ట్రీసొల్యూషన్స్ కి ప్రభుత్వం నుంచి భారీ మొత్తంలో నిధులు మళ్ళించారు. జగన్ కుతంత్రాలకు అనుగుణంగా ఫ్యామిలీ సర్కస్ చేస్తూ… స్వార్థ ప్రయోజనాలు పొందారు ఐఏఎస్ సారు. అప్పట్లో డేటా మాయం చేస్తూ, రాష్ట్ర వినాశనం కోసం పనిచేశారు. ఇప్పుడు కూడా జగన్ కి, ఆ నీలి కూలి సైకో మీడియా ముఠాకు డేటా లీక్ చేస్తూ ప్రభుత్వం కి నష్టం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులకు ఇప్పుడు కమర్షియల్ టాక్స్ పగ్గాలివడం అంటే.. కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే కదా?!

ఈ మొత్తం కోడ్ ట్రీ సొల్యూషన్స్ కంపెనీ వ్యవహారంతో పాటు, 2వేల కోట్ల డైరీ ఎక్విప్మెంట్ మొత్తం అమూల్ డైరీకి చేరిన వ్యవహారం పై, నిష్కర్షగా ఎంక్వైరీ వేయించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఐఏఎస్ ముసుగులో ఉన్న వైఏఎస్ లతో పాటు, ప్రభుత్వ యంత్రాంగంలో వుంటూ గోతులు తీస్తున్న జగన్ కోవర్ట్ లను, ప్రభుత్వ వ్యవహారాల నుండి దూరంగా ఉంచాలని జగన్ బాధిత కూటమి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A RESPONSE