Suryaa.co.in

Telangana

దటీజ్ గుమ్మడి నర్సయ్య!

సాధారణ పేషెంట్ మాదిరిగా క్యూలో నిలబడి వైద్య చికిత్స
– ఇప్పటికీ బస్సు, సైకిల్‌పై తిరిగే నర్సయ్య
– ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇప్పటికీ పించనే ఆధారం
( సుబ్బు)

ఈ చిత్రంలో కనిపిస్తున్న క్యూలైన్‌లో ఓ వృద్ధుడు కనిపిస్తున్నారు చూశారు కదా. అయితే దానికి అంత ప్రాధాన్యం ఏముంది అనే కదా మీ సందేహం? ఆయన ఎవరో కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఐదుసార్లు ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజా నాయకుడు గుమ్మడి నర్సయ్య. మరి ఆ స్థాయి నాయకుడు ఇలా సాధారణ వ్యక్తిలా, అందరి లెక్క క్యూలో నిల్చోవడం ఏమిటన్న మరో సందేహం రావడం సహజం.

అసలు ఆయన శైలే అంత. నర్సయ్య ఇప్పటికీ ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తుంటారు. సైకిల్‌పైనే తిరుగుతుంటారు. ఒక పేద జీవనశైలి ఆయనది. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న నర్సయ్యకు ప్రభుత్వం ఇచ్చే పించనే ఆధారం! ఇప్పుడాయన కంటి చూపు పరీక్ష కోసం పాల్వంచలోని ఎల్‌వి ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లారు. సాధారణ పేషెంట్ల మాదిరిగానే ఓపీ చీటీ రాయించుకుని, తన వంతు వచ్చేవరకూ ఓపికగా నిలబడి చికిత్స చేయించుకుని వెళ్లారు. ఆ చిత్రమే.. ఈ చిత్రం!

కేవలం ఒకేఒక్కసారి ఎమ్మెల్యే-ఎంపీగా గెలిచిన వారే.. ఫార్చూన్, ఇంకా రెండుకోట్ల రూపాయల ఖరీదు చేసే కార్లు, బంజారాహిల్స్‌లో ఖరీదైన భవంతులు నిర్మించుకునే ఈ కాలంలో.. గుమ్మడి నర్సయ్య లాంటి సాదాసీదా జీవితం గడిపేవారు కనిపించడం గొప్ప విషయమే. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అందరికీ అబ్బదు కదా?

LEAVE A RESPONSE