హైదరాబాద్ : ప్రజలకు వివిధ రూపాలలో సేవలు అందించే ఉద్యోగులపై తమ రాజకీయ లక్ష్యాలకోసం భౌతిక దాడులకు దిగటం దుర్మార్గమైన చర్య అని తెలంగాణ గెజిటెడ్ మరియు ఉద్యోగుల , ఉపాధ్యాయుల , నాలుగవ తరగతి ఉద్యోగుల , కార్మికుల మరియు పెన్షనర్ ల జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస రావు అభిప్రాయ పడ్డారు . వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు ఇతర రెవిన్యూ ఉద్యోగులపై దాడికి నిరసనగా జేఏసీ మరియు ట్రెసా ఇచ్చిన పిలుపు మేరకు లంచ్ అవర్ డెమన్స్ట్రేషన్ లో భాగంగా గురువారం నాడు భూపరిపాలన కమీషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అయన పాల్గొని మాట్లాడారు .
అత్యంత వెనుకబడిన జిల్లాలో ఒకటైన వికారాబాద్ జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం మేరకు జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులు ప్రజాభిప్రాయ సేకరణకు వెళితే భౌతిక దాడులకు దిగటం ప్రజలకు , యువతకు అభివృద్ధి కి దూరం చేసే ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు . దాడికి పాల్పడిన వారిపైనే కాకుండా తెరవెనుక ఉండి రెచ్చగొట్టిన వారు ఎంతటి స్థాయిలో ఉన్నా వారిని కఠినంగా శిక్షించాలని అయన కోరారు .