(సుబ్బు)
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వస్తున్నారంటే చాలు.. ఆ దేశాల్లోని తెలుగువారంతా ఆయనను చూసేందుకు ఎయిర్‌పోర్టుకు వాలిపోతారు. ఆయనతో కాసేపు మాట్లాడి, ఫొటోలు తీసుకునేంత వరకూ వారు అక్కడి నుంచి కదలరు.మళ్లీ ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకుని తెగ సంబరపడుతుంటారు.
‘సార్ మీరు సీఎం అయిన తర్వాత ఏపీ బాగా డెవలప్ అవుతోంది. మిమ్మల్ని ఆ రాక్షసుడు జైల్లో పెట్టినప్పుడు బాగా బాధపడ్డాం సార్. మాకు భోజనం కూడా తినబుద్ధికాలేదు. మా తెలుగు అసోసియేషన్ మీటింగుకు మీరు తప్పకుండా రావాలి’ అంటూ బాబును అభ్యర్ధిస్తుంటారు. ఇప్పుడూ అంతే!
తాజాగా దుబాయ్ పర్యటనకు వెళ్లిన బాబుకు, అక్కడి ఎయిర్‌పోర్టులో తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళుతున్నట్లు.. పట్టుచీరలతో ముస్తాబయి, చంద్రబాబుకు బారులు తీరి స్వాగతం పలికారు. బాబును చూడగనే బోలెడు సంబరపడ్డారు. ఆయనతో సెల్ఫీలు తీసుకున్నారు.
ఇక బాబు సంగతి సరేసరి! జనాలను చూస్తే ఆయన పులకిరించిపోతారు. ఒక పట్టాన నిలవరు. అప్పుడు ఆయనకు ఎవరు చెప్పినా వినరు. షెడ్యూల్ కూడా పక్కనపెట్టి వారితో ముచ్చటిస్తుంటారు. మరి జనమే ఆయన బలం. బలహీనత! దుబాయ్‌లోనూ సేమ్‌టు సేమ్! తన వద్దకు వచ్చిన మహిళలతో.. మీరు ఇక్కడ ఎన్నాళ్ల నుంచి ఉంటున్నారు? మీ వారు ఏం వ్యాపారం చేస్తుంటారు? మీకు పిల్లలు ఎంతమంది? ఏం చదువుతున్నారు? ఏపీ గురించి ఇక్కడ ఏమనుకుంటున్నారు? మీరు ఎక్కడున్నా పుట్టిన గడ్డను మర్చిపోవద్దు. మీ అందరి అభిమానం, ఆశీర్వాదం వల్లే నేను మళ్లీ సీఎంనయ్యా. పుట్టినగడ్డకు ఏదైనా మేలు చేయండి. అమరావతి వచ్చినప్పుడు వచ్చి కలవండి’’ అని చంద్రబాబు చెబితే, దుబాయ్ తెలుగుమహిళలు ఫిదా అయిపోయారు. ఆ చిత్రమే.. ఈ ‘చిత్రం’