– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి
– ఘన్ పూర్ లో ని రిజర్వాయర్ లో చేప పిల్లలను విడుదల చేసి ఉచితంగా చేపపిల్లల పంపిణీ
జనగామ : కులవృత్తులను ప్రోత్సహించడం, గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సోమవారం జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లో ని రిజర్వాయర్ లో చేప పిల్లలను విడుదల చేసి ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ MLA రాజయ్య, MLC బండ ప్రకాష్ లతో కలిసి ప్రారంభించారు. ముందుగా 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఫిష్ మార్కెట్ పనులను ప్రారంభించారు. అదేవిధంగా గొర్రెలకు వ్యాక్సిన్ పంపిణీ చేశారు.
అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యశాఖ కు ఎలాంటి నిధుల కేటాయింపు లేక తెలంగాణ ప్రాంతంలో నిరాదరణకు గురైందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో కులవృత్తులను ప్రోత్సహించేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని వివరించారు. మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సంవత్సరం రాష్ట్రంలోని 26,778 నీటి వనరులలో 88.53 కోట్ల చేప పిల్లల ను విడుదల చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఘన్ పూర్ రిజర్వాయర్ లో 9.35 లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 2014 లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మత్స్య కారులకు గుర్తింపు తెచ్చామని, మత్స్య కార్మికుల సంక్షేమం కొరకు 2015 సెప్టెంబర్ 23న నీటి వనరులు సమృద్దిగా ఉన్న ప్రాంతాలలో ఉచితంగా చేప పిల్లలను పెంచాలనే సంకల్ప బలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బృహత్తర నిర్ణయం మత్స్య కారుల జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసినట్లయ్యిందన్నారు . 2016-17 నుండి 3,939 రిజర్వాయర్లలో ప్రారంభిస్తూ 26,778 రిజర్వాయర్ల కు పెంచిన ఘనత మా ప్రభుత్వానికే దక్కిందన్నారు. 26వేల చెరువులకు జియో ట్యాగింగ్ చేయడం జరిగిందని తెలియజేశారు.
27.80 కోట్లతో 90కోట్ల చేపపిల్లలే కాకుండా 20 కోట్ల రొయ్య పిల్లలు చెరువులలో విడిచి పెడుతున్నట్లు తెలిపారు. 2 నెలల్లో 620 సొసైటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.వెయ్యి కోట్లతో తెప్పలు, జాకెట్స్, వాహనాలు సబ్సిడీపై అందజేశామన్నారు. అన్ని చెరువులపై మత్స్య కారుల కే పూర్తి హక్కులు కల్పించామని చెప్పారు. దళారులకు చెరువులను అప్పగించి నష్టపోవద్దని సూచించారు.
చేప పిల్లల పంపిణీ కార్యక్రమంను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు రూపొందించిన
మత్స్య మిత్ర యాప్ వినియోగం పై మత్స్యకారులకు అవగాహన కల్పించారు. చేప పిల్లల నాణ్యత లేకపోయినా లెక్క ప్రకారంగా చేరక పోయినా వాహనాలను తిప్పి పంపాలని సొసైటీ సభ్యులకు తెలియజేశారు. 8 మత్స్య కారుల సొసైటీ లకు మంత్రి అర్హత పత్రాలను అందజేశారు. పశువులకు వైద్యసేవలను తక్షణమే అందించేందుకు ప్రవేశ పెట్టిన మొబైల్ అంబులెన్స్ లకు దేశ వ్యాప్తంగా రాష్ట్రానికి మంచిపేరు తెచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, మత్స్య శాఖ కమీషనర్ భూక్య లచ్చి రామ్, కలెక్టర్ శివ లింగయ్య, అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్డీవో కృష్ణవేణి, మత్స్య కారుల సొసైటీ సంఘం నాయకులు సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.