– బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
-మధ్యాహ్నం నుంచి రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయింది
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
– అయోధ్య తరహాలో అమరావతి నిర్మాణం జరగాలన్న డా.పెమ్మసాని
గుంటూరు:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ కోసం బిజెపి టిడిపి జనసేన మూడు పార్టీలు కలిసి ఎన్నికలలో పోటీకి సిద్ధమయ్యాయని బిజెపి ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పారు. తమ కూటమి విజయానికి ‘తొలి అడుగు’ గా ఆదివారం నరేంద్ర మోడీ హాజరు కాబోయే ‘ప్రజాగళం’ సభ నాంది పలుకుతుందన్నారు. టీడీపీ జనసేన బిజెపి పొత్తు ప్రకటించాక ఉమ్మడిగా నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ప్రజాగళం చిలుకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో ఆదివారం జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శనివారం టిడిపి, బిజెపి, జనసేన మూడు పార్టీల నేతల కార్యకర్తల ఉమ్మడి సమావేశం గుంటూరులోని స్థానిక మౌర్య ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ… కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకటించిన మరుక్షణం నుంచి రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయిందని అన్నారు. ప్రజలు ఈ అవకాశం కోసమే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారన్నారు. ఏపీని పునర్మించుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా పొత్తులో భాగంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఎలాంటి అరమరికలు లేకుండా పనిచేయాలని కార్యకర్తలను ఉద్దేశించి ఆయన సూచించారు.
అనంతరం టిడిపి గుంటూరు పార్లమెంట్ ఎంపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ అయోధ్య నిర్మితమైనంత వేగంగా అమరావతి కూడా నిర్మాణం జరగాలన్నారు. మూడు శక్తివంతమైన, సామర్థ్యం గల పార్టీలు ఏర్పరచిన సభ అంటే ఎంత ప్రభావవంతంగా ఉంటుందో ఈ సమావేశాన్ని చూస్తే అర్థమవుతుందని ఆయన తెలిపారు. అమరావతి వంటి ప్రతిష్టాత్మకమైన నగర నిర్మాణానికి బిజెపి సహకారం కూడా కావాలని ఆయన కోరారు.
అనంతరం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ఆవిడే మాట్లాడుతూ త్వరలో ఏపీకి వైసిపి నుంచి విముక్తి కలుగుతుందని,నేడు జరగబోయే ‘ప్రజాగళం’ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో తెనాలి జనసేన టిడిపి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు పశ్చిమ టిడిపి అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, గుంటూరు తూర్పు నియోజకవర్గ టిడిపి అభ్యర్థి మహమ్మద్ నసీర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ కోవెలమూడి రవీంద్రబాబు(నాని) తదితరులు పాల్గొన్నారు.
పెమ్మసాని ఆధ్వర్యంలో టిడిపిలో చేరికలు టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పై వైసీపీ నాయకుల్లో నమ్మకం నానాటికి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.ఆయన ఆధ్వర్యంలో టిడిపిలో చేరే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండడంతో క్రమంగా నియోజకవర్గాల వారీగా వైసిపి శిబిరాలు ఖాళీ అవుతున్నాయి. తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొమ్మినేని రామ చంద్రరావు ఆధ్వర్యంలో 600 కుటుంబాలు నేడు టిడిపిలో చేరాయి.