Suryaa.co.in

Editorial

పొత్తు పొడుస్తోంది!

– బాబు-పవన్‌ భేటీలో స్పష్టత
– టీటీడీ-జనసేన పొత్తు దాదాపు ఖరారు
– ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివివ్వమని జనసేన స్పష్టీకరణ
– లోకేష్‌ పాదయాత్రలో జనసేన జండాలు
– ఇంకా ఆలస్యం చేయడం మంచిదికాదన్న భావన
– ఇప్పటినుంచే ఇరుపార్టీల క్యాడర్‌ మైండ్‌సెట్‌ చేయాలని నిర్ణయం
– పొత్తు సంకేతాలిస్తేనే క్యాడర్‌ కలసి ఉంటారన్న యోచన
– నాదెండ్ల మనోహన్‌తో ప్రకటన లక్ష్యం అదేనా?
– వైసీపీ రెచ్చగొట్టేమాటలకు విలువ ఇవ్వకూడదన్న భావన
– వైసీపీ మైండ్‌గేమ్‌లో పావు కావద్దని నిర్ణయం
– చౌదరి-నాయుడు-రాయల్‌ పేర్లతో వచ్చే వ్యతిరేక పోస్టింగులు పట్టించుకోకూడదని నిర్ణయం
– ఇకపై టీడీపీ-జనసేన కలసి కదనం
– బీజేపీ-టీడీపీ-జనసేన కలసి పోటీచేస్తాయన్న ఆదినారాయణరెడ్డి
– తాను మాట్లాడనన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో రాజకీయ ముఖచిత్రంలో స్పష్టత వస్తోంది. ఇప్పటిదాకా అస్పష్టత-అనిశ్చితి కొనసాగుతున్న టీడీపీ-జనసేన పొత్తు పొడిచే వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేనాధిపతి పవన్‌ కల్యాణ్‌ తాజా భేటీతో పొత్తుపై స్పష్టత వచ్చినట్లు సమాచారం. కాగా బీజేపీ కూడా రెండు పార్టీలతో జట్టు కలిసేందుకు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ భవిష్యత్తు రాజకీయావసరాల కోసం తటస్థంగా లేదా దూరంగా ఉన్నప్పటికీ.. టీడీపీ-జనసేన మాత్రం కలిసే పోటీ చేయాలని మానసికంగా నిర్ణయించున్నట్లు సమాచారం.

వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనిచ్చే సమస్య లేదని, ఆ మేరకు రానున్న ఎన్నికల్లో తమ పార్టీ పొత్తులుంటాయని.. జనసేనలో నెంబర్‌ టూగా నాదెండ్ల మనోహర్‌ చేసిన విస్పష్ట ప్రకటన, టీడీపీ-జనసేన పొత్తు పొడిచేందుకు బాటలు వేశాయి. నాదెండ్ల నేరుగా చెప్పకపోయినా.. టీడీపీతోనే పొత్తు ఉంటుందన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం.

ఎన్నికలకు ఎక్కువ సమయం లేనందున, పొత్తును ఇప్పటినుంచే జనంలోకి తీసుకువెళ్లాలని రెండు పార్టీలూ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రధానంగా క్షేత్రస్థాయిలో పనిచేసే క్యాడర్‌ను, మానసికంగా ఇప్పటినుంచే సన్నద్ధం చేయడం ముఖ్యమని ఇరు పార్టీల నాయకత్వాలు గ్రహించినట్లు కనిపిస్తోంది. అవసరమైతే ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై చేసే ఆందోళనలో రెండు పార్టీలు పాల్గొంటే మంచిదన్న చర్చ జరిగినట్లు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోమన్న నాదెండ్ల మనోహర్‌ ప్రకటన తర్వాత.. జనసేన కార్యకర్తలు లోకేష్‌ పాదయాత్రలో పాల్గొనడం విశేషం.

‘‘దమ్ముంటే అన్ని సీట్లకూ పోటీ చేయండి’’ అని రెండు పార్టీలనూ సవాల్‌ చే సి.. మైండ్‌గేమ్‌ ఆడుతూ, రెండు పార్టీల క్యాడర్‌ను గందరగోళంలో నెడుతున్న వైసీపీ వ్యూహంలో చిక్కుకోవద్దని, ఇరుపార్టీలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సోషల్‌మీడియాలో చౌదరి- నాయుడు-రాయల్‌-నాయుడు పేర్లు సృష్టించి, వారితో చంద్రబాబు-పవన్‌ అభిమానులు ఒకొరికరు తిట్టుకునే పోస్టులపై అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నాయి. వైసీపీ చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ఫొటోలకు ఏమాత్రం స్పందించకూడదని తీర్మానించుకున్నట్లు సమాచారం.

గత ఎన్నికల్లో మాదిరిగా, రేపటి ఎన్నికల్లో కూడా కమ్మ-కాపు వర్గాల మధ్య చిచ్చు పెట్టే పీకే వ్యూహంలో ఇరుక్కోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వాటికి స్పందిస్తే వ్యవహారం ఎటో వెళ్లిపోయి, రెండు పార్టీలు రాజకీయంగా దెబ్బతినే ప్రమాదం లేకపోలేదని, ఇరు పార్టీ నాయకత్వాలు గుర్తించాయి.

పేరు చివర చౌదరి వచ్చేలా ఉన్న అకౌంట్లు సృష్టించి, వాటి ద్వారా పార్టీపరంగా పవన్‌ను-సామాజికవర్గపరంగా కాపులను రెచ్చకొట్టే, పీకే వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించాలని నిర్ణయించాయి. ఈ విషయాలను రెండు పార్టీలు తమ సోషల్‌మీడియా విభాగాల ద్వారా, కార్యకర్తలను అప్రమత్తం చేయాలని తీర్మానించుకున్నట్లు తెలిసింది. ఈలోగా పొత్తును వ్యతిరేకించే ఇరుపార్టీల నాయకులను, అవసరమైతే బయటకు పంపించడం గానీ, లేదా వారిని దూరం పెట్టడం గానీ చేయాలన్న సూచన వచ్చినట్లు సమాచారం.

కాగా టీడీపీ-జనసే పొత్తు పొడుస్తున్న నేపథ్యంలో.. బీజేపీ సంగతి ఏమిటన్న దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మూడు పార్టీలూ కలసి పోటీ చేస్తాయని బీజేపీ నేత, మాజీమంత్రి, ఆదినారాయణరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. అయితే బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు మాత్రం, పొత్తులపై తానేమీ మాట్లాడనని వ్యాఖ్యానించారు. ఎంపి సీఎం రమేష్‌ కూడా తాము అధికారంలో ఉన్న పార్టీతో కలసి ప్రభుత్వంలో ఉంటామని చేసిన వ్యాఖ్య కూడా చర్చనీయాంశమయింది.

నిజానికి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర కో ఇన్చార్జి సునీల్‌ దియోధర్‌, సంఘటనా మంత్రి మధుకర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి మినహా… మిగిలిన బీజేపీ అగ్రనేతలంతా, టీడీపీ-బీజేపీ-జనసేన కలసి పోటీ చేయాలన్న భావనతోనే ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. స్వతహాగా తమకు ఎలాంటి బలం లేనందున.. టీడీపీ-జనసేన బలంతో, మళ్లీ ఉనికిచాటుకోవాలన్నది బీజేపీలోకి ఒక వర్గం వాదన. సోము వీర్రాజు వర్గం మాత్రం.. సీట్లు రాకపోయినా ఒంటరిగా పోటీ చేసి, పార్టీని బలోపేతం చేయాలని వాదిస్తోంది. ఈ క్రమంలో ఇటీవలి పవన్‌ కల్యాణ్‌ ఢిల్లీ పర్యటనలో కూడా పెద్దగా స్పష్టత రాలేదని పార్టీ వ ర్గాలు చెబుతున్నాయి.

ఒకవైపు తమతో కలసి ఉన్న పవన్‌- మరోవైపె టీడీపీతో కలసి ఉండటాన్ని, బీజేపీలోని టీడీపీ వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేపోతోంది. అయితే.. అధికారపక్షంతో అంటకాగుతున్న నాయకులను పట్టించుకోవద్దని, టీడీపీతో కలసి వెళ్లటమే మంచిదని.. ఆ పార్టీతో పొత్తును సమర్ధించే బీజేపీ నేతలు, ఢిల్లీ నేతల వద్ద తమ వాదన వినిపిస్తున్నారు.

అయితే.. వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డితో సన్నిహిత సంబంథాలున్న ఒక కేంద్రమంత్రి మాత్రం.. టీడీపీ-బీజేపీ కలవకుండా, తన వంతు ప్రయత్నాలు చేస్తున్న వైనంపై విపరీతమైన ప్రచారం జరుగుతోంది. దానికి జగన్మోహన్‌రెడ్డితో ఆయనకున్న వ్యక్తిగత సంబంధాలే కారణమంటున్నారు.

గత ఎన్నికల ముందు కూడా, టీడీపీతో పొత్తు ఉండదని-అవసరం లేదని సదరు నాయకుడే, తొలుత ప్రకటించిన వైనాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే నాయకుడు, మళ్లీ టీడీపీ-బీజేపీ కలవకుండా పావులు కదుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది.

LEAVE A RESPONSE