Suryaa.co.in

Andhra Pradesh

మార్గదర్శిపై దాడులు, కేసులు జగన్ రెడ్డి కుట్రలో భాగమే

-ఏపీలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది
-మార్గదర్శిపై దాడి ప్రజాస్వామ్యంపై దాడే
– టీడీపీ శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి

ఈనాడు ద్వారా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గణమెత్తిన రామోజీరావుకు అవినీతి మరక అంటించడమే సీఎం జగన్ రెడ్డి లక్ష్యం. జగన్ రెడ్డి దోపిడీ, అప్రజాస్వామ్య పాలన బయటపడుతున్నందుకే మార్గదర్శిపై కుట్ర చేస్తున్నారు. ఒక్క ఖాతాదారుడు ఫిర్యాదు చేయని మార్గదర్శిపై సోదాలు, అరెస్టుల పేరుతో హడావుడి చేయడం జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. మార్గదర్శిని కుప్పకూల్చడం ద్వారా ఈనాడు ఆర్థిక మూలాలను దెబ్బతీయొచ్చన్నది జగన్ రెడ్డి దురాలోచన. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియాను ప్రమాదంలో పడేసేందుకు నాలుగేళ్లుగా జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు.

చందాదారుల సొమ్మును మార్గదర్శి ఎక్కడా దారి మళ్లించలేదు. కేవలం తమకు వచ్చిన లాభాలనే ఇతరత్రా పెట్టుబడులకు ఉపయోగించుకున్నారు. చిట్ ఫండ్ యాక్ట్ 1982ను జగన్ అండ్ కో ఓసారి చదివితే తత్వం బోధపడుతోంది. మార్గదర్శి కేంద్ర, రాష్ట్ర చట్టాలకు కట్టుబడే ఉందని ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ చిట్ ఫండ్స్ కూడా స్పష్టం చేసినా జగన్ రెడ్డి ఎందుకు హడావుడి చేస్తున్నట్టు? మార్గదర్శిలో ఉల్లంఘన జరగలేదని, మార్గదర్శిపై ఆరోపణలు చేయడం చిట్ ఫండ్ పరిశ్రమ ప్రతిష్టను దెబ్బతీయడమేనని చెప్పినా జగన్ రెడ్డి ఇష్టానుసారం వ్యవహరించడం దేనికి సంకేతం?

జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా మార్గదర్శిపై ఇలానే సోదాలు చేయించి చివరకు చేతులు కాల్చుకున్నాడు. జగన్ రెడ్డికి అంతకుమించిన పరాభవం తప్పదు. తమ సొమ్ము మార్గదర్శిలో భద్రమని ఖాతాదారులు పదేపదే చెబుతున్నా సీఐడీ అధికారులు వారికి ఫోన్లు చేసిన ఎందుకు వేధిస్తున్నారు? మార్గదర్శి విషయంలో సీఐడీ అధికారులు మొదట్నుంచీ పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. మార్గదర్శి అంశంలో నేరం జరిగిందని చెబుతున్న జగన్ రెడ్డి ఒక్క బాధితుణ్ణీ ఎందుకు చూపించలేకపోతున్నారు? చట్టాలపై ఏమాత్రం అవగాహన లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న జగన్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు.

LEAVE A RESPONSE