– వైసీపీ పాలనలోనే వర్షాలన్న నేతలెక్కడ?
– ప్రాజెక్టుల్లో నీళ్లు పరవళ్లెతున్నాయన్న వైసీపీ నేతలేరీ?
– నాటి పట్టిసీమ నీరు ఇప్పుడేదీ?
– నాడు చంద్రబాబు హయాంలో పుష్కలంగా సాగునీరు
– ఆయకట్టుకు నీరు లేక నాట్లు వేసిన రైతు గోడు
– నాగాయలంక మండల రైతుల రోదన
సాగునీటి కొరతతో దమ్ము చేసిన చేసిన నేల ఎండిపోతోంది. నాట్లు వేసిన చేను బీటలు వారుతోంది. పిండి చల్లిన చేనులో వరి మొక్కలు నీటి కోసం అల్లాడిపోతున్నాయి.
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండల పరిధిలో వక్కపట్లవారిపాలెం రెగ్యులేటర్ సెంట్రల్ ఛానల్ 4ఏ పంట కాలువ, కమ్మనమోల 3,4 నెంబర్ పంట కాలువల ఆయకట్టుకు సాగునీరు అందక నాట్లు వేసిన చేలు బీటలు వారిపోతున్నాయి.
సాగునీరు పుష్కలంగా ఉందని, చంద్రబాబు హయాంలో అయినా కరువు వస్తుందేమో కానీ, మా హయాంలో ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయని వైసీపీ నాయకుల ఆర్భాటం చూసి సాగునీరు సక్రమంగా ఇస్తారు అని భావించి దుక్కి, దమ్ము, నారుమడి, నాట్లకు, పిండికి ఎకరాకు పద్దెనిమిది వేలు ఖర్చు పెట్టిన రైతులు సాగునీరు ప్రవహించని పంట కాలువలను చూసి లోలోపల రోదిస్తున్నారు.
ఇంకో నాలుగు రోజులు ఆగితే తమ నాట్లు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టిసీమ నుంచి రెండు వేల క్యూసెక్కుల సాగునీరు ఇవ్వవలసి ఉండగా, కేవలం 800 క్యూసెక్కులు మాత్రమే ఇస్తోంది. టీడీపీ ప్రభుత్వం నిర్మించిన పట్టిసీమ ద్వారా చంద్రబాబు కృష్ణాడెల్టాకు పుష్కలంగా సాగునీరు అందిస్తే, ఈ ప్రభుత్వం సాగునీటి సరఫరాలో విఫలమైందని రైతులు వాపోయారు.
దివిసీమలో అమలు చేస్తున్న వంతుల వారీ విధానంతో వస్తున్న సాగునీరు భావదేవరపల్లి ఆయకట్టు వరకే సరిపోతోందని, తమ భూములు ఎండిపోతున్నాయని తెలిపారు. తక్షణమే వంతుల వారీ విధానం తొలగించి అవసరం మేరకు సాగు నీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు.