Suryaa.co.in

Telangana

గ్రామీణులకు ఉపాధి లేకుండా చేస్తున్న బీజేపీ ప్రభుత్వం

-ఎమ్మెల్సీ కవిత ను కలిసిన ఉపాధి హామీ పథకం సంఘాల ప్రతినిధులు
-ఉపాధి హామీ పథకం అమలుకు కనీసం రూ.2.72 లక్షల కోట్లు అవసరం ఉండగా, బడ్జెట్ లో కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించిన బీజేపీ ప్రభుత్వం: ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ‌పథకాన్ని నిర్వీర్యం చేసి పేదల పొట్టగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బుధవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు భారీగా తగ్గడమే ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ లోని నివాసంలో ఉపాధి హామీ పథకం సంఘం ప్రతినిధులతో సమావేశమయ్యారు.

బుధవారం ప్రకటించిన బడ్జెట్ లో ఉపాధి హామీ పథకానికి కేంద్రం కేవలం రూ.60 వేల కోట్లు ‌కేటాయించిందన్న ఎమ్మెల్సీ కవిత, గత ఐదేళ్ల బడ్జెట్ లో ఇదే అతి తక్కువ అని విమర్శించారు. 2020-21 Rs.1,10,000 కోట్లు, 2021-22: Rs 98,000కోట్లు, 2022-23: Rs 89,400కోట్లు, 2023-24: 60,000కోట్లు కేటాయించి, దశల వారీగా ఉపాధి హామీ పథకానికి బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ఉపాధి హామీ పథకం అమలుకు కనీసం రూ.2.72 లక్షల కోట్లు అవసరం ఉండగా, బడ్జెట్ లో కేవలం రూ.60 వేల కోట్లు కేటాయించడం దేనికి సంకేతమని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. గత తొమ్మిదేళ్లలో గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించని బీజేపీ ప్రభుత్వం, ఉన్న ఉపాధి కార్యక్రమాలను‌ సైతం అమలు చేయడం లేదన్నారు. ప్రజలకు వీలైనంత ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సహకరించడం లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
ఉపాధి హామీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధి హామీ పథకం JAC చైర్మన్ యలబద్రి లింగయ్య, కో చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి , విజయ్ కుమార్ , రఘు , సర్దార్ సింగ్ , అంజి రెడ్డి , సుదర్శన్ మరియు ప్రతినిధులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE