-భావితరాలకు స్ఫూర్తి ప్రదాతల చరిత్ర బాటలు వేసిన నారా లోకేష్
గుంటూరులో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొత్త వరవడికి, భావితరాల సేవలకు నాంది పలికిందని, దానిలో భాగంగానే అన్నదాతలకు, అన్నదానానికి స్ఫూర్తి ప్రదాత, అపర అన్నపూర్ణ అయిన కీర్తిశేషురాలు “డొక్కా సీతమ్మ” గారి పేరుని “మధ్యాహ్నం బడి భోజన పథకానికి” ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామకరణం చేయటం హర్షించదగ్గ విషయమని అన్నారు.
స్వాతంత్రం రాక పూర్వం నుంచి డొక్కా సీతమ్మ తూ.గో జిల్లాలో లంకల గన్నవరం అనే గ్రామ కేంద్రంగా అప్పట్లో బాటసారులకు అడిగిందే తడువుగా ఆమె, ఆమె కుటుంబ సభ్యులు వంటలు వండి ఉచితంగా అన్నదానం చేసేవారు. అలానే అక్కడి లంకల్లో వరదలు వచ్చిన సందర్భాల్లో కూడా వంటలు వండి పడవల్లో తీసుకెళ్లి అక్కడ ఉన్న బాధిత ప్రజలకు అన్నదానం చేసేవారు. బ్రిటిష్ వారుకి కూడా ఆకలి సమయంలో భోజనాలు అందించిన ఆమె “అపర అన్నపూర్ణ”గా ప్రపంచవ్యాప్తంగా అన్నదానానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. అటువంటి ఆమె పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “మధ్యాహ్న బడి భోజన పథకానికి” పెట్టటాన్ని బ్రాహ్మణ సమాజంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారని శ్రీధర్ తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆమె పేరును చాటి చెప్పే విధంగా గత ప్రతిపక్షంలో కొణిదెల పవన్ కళ్యాణ్ వివిధ కార్యక్రమాలు చేయడం జరిగిందని, అలానే ఆమె పేరు ప్రభుత్వ పథకానికి పెట్టడంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మాత్యులు నారా లోకేష్ కృషి వెలకట్టలేనిదని అని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు, భారతదేశానికి, స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచి, వివిధ రంగాల్లో సేవలు అందించి పేరు ప్రఖ్యాతలు గడించిన పెద్దలు, కీర్తిశేషుల పేర్లు పెట్టడంలో దేశంలోనే ప్రముఖ స్థానం వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బ్రాహ్మణ సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు శ్రీధర్ తెలియజేశారు.
అలానే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే స్కూలు బ్యాగులు, నోటు పుస్తకాలు, తదితర పథకానికి భారత మాజీ రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరును, ప్రభుత్వ పాఠశాలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థి పురస్కారాల పథకానికి సైంటిస్ట్ మరియు భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేర్లు పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు శ్రీధర్ తెలియజేశారు.
గత సైకో శాడిస్ట్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ ప్రభుత్వ పథకాలకు తన పేరు, తన తండ్రి పేరు తప్ప ఏ జాతీయ నేతల, స్ఫూర్తి ప్రదాతల పేర్లు పెట్టిన దాఖలాలు గత ప్రభుత్వంలో లేవని, ప్రజల సొమ్ము కాజేసిన క్రిమినల్ కేసులలో ముద్దాయి గా వున్న వైయస్ జగన్ ఇదే భోజన పథకానికి “జగనన్న గోరుముద్దల పథకం” అని పెట్టుకోవటాన్ని సిగ్గుచేటని అన్నారు. దీనిపై ప్రజలందరూ చులకనగా మాట్లాడుకోవడం కూడా జరిగిందని, అందుకే అతని ప్రభుత్వ పరిపాలన విధానాన్ని చూసి ప్రజలు తమ భావ స్వేచ్ఛను వ్యక్తం చేస్తే ఎక్కడ కేసులు పెడతారేమోనని భయపడి ఐదేళ్ల తర్వాత 2024 ఎన్నికల్లో భారీ రీతిలో జగన్ కు బుద్ధి చెప్పారు. అతని పరిపాలన విధానానికి ఈ ప్రజా తీర్పే నిదర్శనం అని, ప్రభుత్వ సొమ్ముతో తన పేర్లు పెట్టుకోవడం, ప్రభుత్వ ఫర్నిచర్ కంప్యూటర్లు కాజేయడం, ప్రభుత్వ భూములు కబ్జా చేయటం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని శ్రీధర్ హేళన చేశారు.
ప్రజలు బుద్ధి చెప్పినా సరే జగన్ లో నేటికీ కూడా మార్పు రాలేదు. అతను ఈ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతగా పనికిరాడని తేల్చి చెప్పారు. పాఠశాల స్థాయి నుంచి విద్యార్థినీ విద్యార్థులకు సేవా రంగాల్లో ప్రజలకు సేవ చేసిన వ్యక్తుల చరిత్రను తెలుసుకునే ఏర్పాటును, భవిష్యత్తులో ఈ విద్యార్థుల ద్వారా సమాజానికి సేవలందించే ఏర్పాటును ఈనాటి విద్యార్థులకు కల్పించి, ప్రభుత్వ పాఠశాల పథకాలకు స్ఫూర్తి ప్రదాతల పేర్లు నామకరణం చేసిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు దక్కుతుందని శ్రీధర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యండపల్లి శబరి, వంగవేటి చైతన్య చిలుమూరు ఫణి, వడ్డమాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.