Suryaa.co.in

Andhra Pradesh

ప్రజల దృష్టి మళ్లించేందుకే అయ్యన్నపై కేసు

విశాఖలో భూ కబ్జాలు, బాబాయ్ హత్య కేసులో సీబీఐకి షర్మిల వాంగ్మూలంపై ప్రజల దృష్టి మళ్లించేందుకే అయ్యన్నపై కేసు

అమరావతి: జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు పరాకాష్ఠ అయ్యన్నపాత్రుడి అక్రమ అరెస్ట్. ఈ ప్రభుత్వం మొదట్నుంచీ ఒక టెక్నిక్ ఫాలో అవుతోంది. ప్రభుత్వ వైఫల్యం బయటపడినప్పుడల్లా దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు మా వాళ్లపై తప్పుడు కేసులు బనాయించి జైలు పాల్జేస్తున్నారు. విశాఖలో భూ కబ్జాలు, బాబాయ్ హత్య కేసులో సీబీఐకి షర్మిల వాంగ్మూలం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు అయ్యన్నపాత్రుడిపై కేసు బనాయించి అరెస్ట్ చేశారు. విశాఖలో వైసీపీ నేతల భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, ఆస్తుల స్వాధీనంపై టీడీపీ అలుపెరుగని పోరాటం చేస్తోంది. రుషికొండను బోడిగుండు చేసేయడంపై టీడీపీ పోరాడుతోంది. దీనిపై పూర్తి వివరాలు పరిశీలించిన కోర్టు విచారణకు కూడా ఆదేశించింది. కేంద్ర పర్యావరణ శాఖ అధికారులు వచ్చి సర్వే చేసి ఎంత ప్రాంతం ఆక్రమణకు గురైందో, ఎంత ప్రాంతంలో నిర్మాణాలు జరుగుతున్నాయో చెప్పాలని ఆదేశించింది. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం దిక్కుమాలిన పనులకు తెరలేపారు. జగన్ రెడ్డీకి సిగ్గుందా? జగన్ రెడ్డిది ఫేక్ ప్రభుత్వం. అయ్యన్నపాత్రుడి ఇంటికి తెల్లవారుజామున 3 గంటలకు వెళ్లాల్సిన అవసరమేమొచ్చింది?ఆయనేమైనా హత్య చేశారా?

మీరు మీ బాబాయ్ ని హత్య చేసినట్టు అయ్యన్న ఏమీ చేయలేదు. భూకబ్జాలు చేయలేదు. తప్పుడు పనులు చేయలేదు. అరెస్ట్ తీరుపై అయ్యన్న భార్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీఐడీ వాళ్లు మమ్మల్ని తోసుకుని ఇంట్లోకి చొరబడ్డారని, కొందరు తాగి ఉన్నారని కూడా చెప్పారు. సీఐడీ వాళ్లు గేట్లు పగలకొట్టి అరాచకంగా వ్యవహరిస్తున్న సమయంలో ఎందుకొచ్చారని అడిగిన తమ కుమారుడిని కొట్టుకుంటూ తీసుకెళ్లారని ఆమె బాధపడ్డారు. కనీసం చెప్పులు కూడా వేసుకోనివ్వకుండా అయ్యన్నపాత్రుణ్ణి తీసుకెళ్లారు. ఏమనుకుంటున్నారు అసలు. కొంత మంది కళంకిత అధికారులను అడుగుతున్నా. రాజ్యాంగబద్దంగా, ప్రజాస్వామ్యబద్దంగా నడుచుకోవాలని తెలియదా?

జగన్ రెడ్డికి సిగ్గుంటే, ధైర్యముంటే వివేకానంద రెడ్డిని చంపిన వారిపై చర్యలు తీసుకోండి. అయ్యన్నపాత్రుడి కుటుంబం 60 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ప్రజలకు వందల ఎకరాల భూములు దానమిచ్చారు. వారు చేసిన సేవలకు గుర్తుగా ఒక ఊరికి అయ్యన్నపాలెం అని పేరు పెట్టారు. ఆయన తాత ఎమ్మెల్యేగా చేశారు. అయ్యన్నపాత్రుడు 40 ఏళ్లుగా టీడీపీలో అగ్రనేతగా కొనసాగుతున్నారు. అయ్యన్న పాత్రుడు కట్టుకున్న ఇంటి స్థలంలోని నాలా భూమిలోని రెండు సెంట్లకు అనుమతులు ఇవ్వకుండా.. ఇప్పుడు ఇల్లు కట్టారని కేసు పెట్టారు. వేల కోట్ల భూములు కబ్జా చేసిన చరిత్ర జగన్ రెడ్డిది కాదా?. ఇడుపులపాయలో 650 ఎకరాల దళితులకు అసైన్డ్ భూములు కబ్జా చేశారు. నాడు ఆ ఏరియా మొత్తం ఏరియల్ సర్వే చేయించి అసెంబ్లీలో పూర్తి ఆధారాలతో సహా వైఎస్సార్ ను నిలదీశాను. తప్పించుకోలేక అడ్డంగా దొరికిన వైఎస్ …తన తండ్రికి చట్టం తెలియక తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు. చట్టపరంగా చర్యలు తీసుకోకుండా తప్పించుకునేందుకు సరెండర్ చేస్తున్నానని అసెంబ్లీలో చెప్పి చట్టాన్ని మార్చిన చరిత్ర వైఎస్ కుటుంబానిది. రెండు సెంట్ల భూమి పేరుతో అర్ధరాత్రి అరెస్టు చేస్తారా? అక్రమంగా లాక్కెళతారా?

హైదరాబాద్ లో జగన్ రెడ్డి కట్టుకున్న ఇంటి చరిత్ర ఏమిటి? ఇంటి వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. కాలయాపన చేసి అధికారంలోకి వచ్చాక ఆ ఇంటిని రెగ్యులరైజ్ చేసుకున్నారు. దీనికి సమాధానం చెప్పే ధైర్యం వైసీపీ చెంచాలకు ఉందా? వైఎస్ కుటుంబం మంగంపేట బైరటీస్ ను అక్రమంగా తవ్వుకున్నారని కోర్టు నిర్ధారించింది వాస్తవం కాదా? జగన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కడపలో వక్ఫ్ బోర్డు భూములను ఆక్రమించి థియేటర్ కట్టాడు. పోలీసులు అక్కడికి వెళ్లగలరా? ఇష్ట ప్రకారం చేస్తే నడవదు జగన్ రెడ్డీ?

టెయింటెడ్ అధికారులకు వార్నింగ్ ఇస్తున్నా… అర్ధరాత్రి రౌడీల్లా వస్తున్నారు. ఎవరినీ వదలను. రిటైర్ అయ్యిన అధికారులతో అడ్డగోలు పనులు చేస్తున్నారు. చట్ట పరంగా పనిచేస్తే మేమూ సహకరిస్తాం. చట్టాన్ని ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోం. ఖబడ్దార్ జగన్ రెడ్డీ. ఇందుకు పదిరెట్లు మీరు అనుభవిస్తారు. వైఎస్ వివేకాది గుండెపోటు అని చెప్పమని బెదిరించారని సీఐ శంకరయ్య చెప్పింది వాస్తవం కాదా? అతనిపై ఒత్తిడి చేసి తర్వాత అబద్ధం చెప్పించింది నిజం కాదా? వివేకానందరెడ్డి కేసు విచారిస్తున్న రాంసింగ్ పై తప్పుడు కేసు పెట్టేలా ప్రేరేపించడం నిజం కాదా?

ఎవరీ మల్లిఖార్జున రావు.? ఈ వ్యవహారం మొత్తం కోర్టులో నడుస్తుండగా.. సీఐడీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశాడు. సీఐడీ కార్యాలయం ఫిర్యాదులు చేసేవారి కోసం తెరుచుకుని ఉన్నారా? అతను ఇచ్చిన స్టేట్ మెంట్ ఫోర్జరీ అని ఫిర్యాదు చేశారంట. దానికి చింతకాయల విజయ్, రాజేశ్ పై ఫిర్యాదు చేస్తే.. సీఐడీ పోలీసులు అయ్యన్న పాత్రుడిని ఏ 1గా పేర్కొంటూ కేసు పెట్టారు. 70 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి అవినీతి చేసినట్లూ నిరూపించలేక.. అయ్యన్న పాత్రుడిని ఏ1గా కేసు పెడతారా? జగన్ రెడ్డి రూ.43 వేల కోట్ల అక్రమాలు చేశారని సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లు వేశాయి. 16 నెలలు జైలు శిక్ష అనుభవించిన జగన్ రెడ్డి.. అయ్యన్నపై కేసు పెడతారా? నో అబ్జక్షన్ సర్టిఫికెట్ ఇచ్చిన మల్లిఖార్జున రెడ్డిని తీసుకొచ్చి ప్రత్యర్ధులపై రాజకీయ కక్ష పెట్టుకుంటారా? ఇలాంటి తప్పుడు కేసులతో మమ్మల్ని ఇబ్బంది పెట్టలేరు. ఈ రోజు చేసిన అరాచకాలకు వంద రెట్లు ప్రతీకారం తీర్చుకుంటాం. మేము కూడా మీలాగే వ్యవహరిస్తే మీ పరిస్థితి ఏంటి? తప్పు చేసిన వారిని వదిలేసి.. ఉద్దేశ్యపూర్వకంగా టీడీపీ నేతలపై కేసులు పెట్టి టార్చర్ చేస్తారా? మీరు చేసే ఇలాంటి పనులు చేస్తే ఊరుకునేది లేదని గుర్తుంచుకోవాలి.

అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, కూన రవి, అయ్యన్న పాత్రుడిపై కేసులు పెట్టారు. ఫోటో తీసేయడాన్ని ప్రశ్నించినందుకు 70 సంవత్సరాల వయసున్న అయ్యన్నపై రేప్ కేసు పెట్టడానికి సిగ్గనిపించడం లేదా? కొంత మంది అధికారుల్ని బెదిరించి తప్పుడు కేసులు పెట్టించొచ్చు.. కానీ వాళ్లే రేపు మీ భరతం పట్టడం ఖాయం. సీఐడీపై ఇప్పటికే కోర్టు చీవాట్లు పెట్టింది. అయ్యన్న కుటుంబంపై ఇప్పటి వరకు సుమారు 12 కేసులు పెట్టారు. 43 సంవత్సరాలుగా ఇలాంటి రాజకీయం ఎప్పుడూ చూడలేదని అయ్యన్న భార్య చెబుతున్నారు. ఇది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కాదంటారా? పోలీసులే ఇలా వ్యవహరిస్తే.. లా అండ్ ఆర్డర్ ఎలా కాపాడుతారు?

సీఐడీ అధికారులు కూడా ఆలోచించాలి. రెండు సెంట్లు ఆక్రమించారని చెబుతూ.. అర్ధరాత్రి వేళ అరెస్టు చేస్తారా? పైగా కాకమ్మ కబుర్లు చెబుతున్నారు. జగన్ రెడ్డి ఖాతాల్లోకి వేల కోట్లు వచ్చినట్లు లెక్కలు దొరికాయి. ఇంకా నీవు నీతిమంతుడివా జగన్ రెడ్డీ? కానీ రూపాయి కూడా అచ్చెన్నాయుడికి చేరలేదని తేలినా.. అతనిపై కేసులు పెట్టారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడి కేసు కూడా అలాంటిదే. దేశంలో రాజ్యాంగం అనేది ఉంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరూ శిక్షార్హులే అని గుర్తుంచుకోవాలి. ఈ దేశంలో ఇంకా రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవిస్తారు. బీసీ వర్గానికి చెందిన 24 మంది టీడీపీ నేతలను హత్య చేశారు. అయ్యన్న కుటుంబానికి మంచి చరిత్ర ఉంది. జగన్ రెడ్డి తాతలా మంగమ్మ పేట గనులను కొట్టేయలేదు.

వివేకా హత్య కేసులో షర్మిల సంచలన వాంగ్మూలం ఇచ్చింది. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి హత్య చేయించారని చెప్పడం జరిగింది. కడప ఎంపీ టికెట్ పై వివాదం నేపథ్యంలోనే చంపించారని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎంపీ టికెట్ కోసం వివేకానందరెడ్డి గట్టిపోటీలో ఉన్నారని, అవినాష్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారని, వివేకా పోటీలో ఉంటే తమ ఉనికికి ఇబ్బందని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డే ఆయన్ను చంపించారని మాకున్న సమాచారం అని షర్మిల చెప్పింది. మీ రక్తం పంచుకుపుట్టిన షర్మిల వాంగ్మూలంపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. కడప ఎంపీ టికెట్ తనకు లేదా, షర్మిలకు లేదా, విజయమ్మకు ఇవ్వాలని వివేకానందరెడ్డి జగన్ ను కోరారు.

ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఈ హత్య చేయించారనే కోణంలో.. సీబీఐ షర్మిల స్పందన అడిగితే.. వాస్తవం చెప్పడం జరిగింది. కనీసం తల్లి విజయమ్మ లేదా, చెల్లి షర్మిలకైనా టికెట్ ఇవ్వడం జగన్ రెడ్డికి ఇష్టం లేదు. హంతకులకు శిక్ష పడాలని, ఎవ్వరూ అడ్డుకోవడానికి వీల్లేదని షర్మిల స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంతో బాబాయి హత్య చేసిన హంతకులను అడ్డుకునేదెవరు జగన్ రెడ్డి.. దీనికి సమాధానం చెప్పాలి. శంకరయ్య సీఐ వాంగ్మూలం ఇచ్చే సమయంలో బెదిరించి, సస్పెండ్ చేయించి, ప్రమోషన్ ఇచ్చిందెవరు? సీబీఐ అధికారి రాంసింగ్ పై తప్పుడు కేసులు పెట్టించారు. ఇవన్నీ సుప్రీంకోర్టు విని… కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేసే పరిస్థితి నెలకొంది. దీనిపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఇవన్నీ బయటకు వస్తాయని అయ్యన్నపాత్రుడుపై తప్పుడు కేసి పెట్టి అరెస్ట్ చేశారు. ఆయన పేరు ఎక్కడా లేకపోయినా కేసు పెట్టి జైల్లో పెట్టాలనే కుట్రతో చేశారు. పోలీసులు, జగన్ రెడ్డికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలి. ప్రజలు ఛీ కొడతారని గుర్తుంచుకోవాలి.

రాష్ట్రంలో కొన్ని వేల కేసులు ఉన్నాయి. అయ్యన్నపాత్రుడే దొరికాడా. అయ్యన్నపాత్రుడి విషయంలో చిన్న చిన్న ఉల్లంఘనలు ఉంటే ఫైన్ వేస్తారు. రెండు సెంట్లకు ఇంత చేశారు. తప్పుడు పనులు చేయడానికే జగన్ రెడ్డి ఉన్నాడు. నీ చరిత్రే తప్పుడు చరిత్ర. మీరు చేసిన పాపాలు రేపు శాపాలుగా మారతాయి. ఈ రోజు తాత్కాలిక ఆనందం ఉండొచ్చు. జగన్ రెడ్డిని నమ్ముకుని ఐఏఎస్ లు, ఐపీఎస్ లు జైలు కెళ్లారు. ఇప్పుడు మేం అన్నీ రికార్డ్ చేస్తున్నాం. ఫోర్జరీ సంతకం, డాక్యమెంట్ అన్నావు.. అయ్యన్న పేరు ఎక్కడన్నా ఉందా? సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ సమాధానం చెప్పాలి. పైవారు చెప్పింది రాయడం, చదవడం కాదు. అధికారులు అప్లికేషన్ ఆఫ్ మైండ్ తో పనిచేయాలి. పైవాళ్లు చెప్పారని అధికారులు చేస్తే భవిష్యత్తులో శిక్ష తప్పదని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 175 సీట్లు గెలుస్తానని సిగ్గులేకుండా చెబుతున్నారు. పదవిపోయిన తర్వాత జగన్ రెడ్డి వెళ్లేది జైలుకి, వైసీపీ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుంది. పగటికలలు కంటూ గాలి మాటలు మాట్లాడవద్దు.

జనసేన నేత పవన్ కళ్యాణ్ ఎక్కడఉంటే అక్కడ రెక్కీ నిర్వహిస్తారా? ఎంత ధైర్యం మీకు? మాట్లాడితే ప్రజలను చంపేస్తారా? జైల్లోపెడుతారా? చింతకాయల రాజేష్ ను కొట్టారని మాకు సమాచారం ఉంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టానుసారంగా వ్యవహరించే అధికారులపై కంపరం పుడుతోంది. ఇలాంటి వారిపై మాట్లాడాలంటే సభ్యత అడ్డం వస్తోంది. రాజ్యాంగం అధికారులకు హక్కులు ఇచ్చింది. కానీ, ప్రజల ప్రాధమిక హక్కులకు భంగం కలిగించే అధికారం ఎవరికీ లేదు. గతంలో ఇదే పోలీసులు అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారి పీచమణిచి మట్టుపెట్టారు. కానీ, నేడు కొంతమంది పోలీసులు ఇలా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఇష్టానుసారం వ్యవహరిస్తామంటే కోర్టులున్నాయి. ప్రజలు గమనిస్తున్నారు.

మీకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. 0.2 సెంట్ల భూమికి నాలా అనుమతి రాలేదని అయ్యన్నపాత్రుడిపై ఇలా వ్యవహరిస్తే వివేకను హత్య చేసి సిబిఐ అధికారులను బెదిరించిన మిమ్మల్ని ఏం చేయాలి? రఘురామకృష్ణం రాజుపై భౌతికంగా దాడిచేసిన కేసు సుప్రీంకోర్టులో నడుస్తున్నా మీకు భయం లేదా? మా పార్టీ మీడియా కో-ఆర్డినేటర్ నరేంద్రపై సైతం భౌతికదాడికి పాల్పడ్డారు. వీటన్నింటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని గుర్తించుకోండి. చట్టం ప్రకారం పనిచేసే అధికారులను నేను గౌరవిస్తా. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాకు చట్టాల గురించి చెబుతారా? అధికారులు తాత్కాలికం. చట్టం శాశ్వతం అని అధికారులు గుర్తుపెట్టుకోవాలి. కళంకిత అధికారులందరిపై ప్రైవేటు కేసులు నమోదు చేస్తాం.

రాష్ట్రంలోని ప్రజలు భయభ్రాంతులతో జీవిస్తున్నారు. జగన్ రెడ్డి రాజకీయ పార్టీలనే ఇబ్బందిపెడుతున్నాడు. మేం బయటకు వస్తే మమ్మల్ని ఏం చేస్తాడో అని బయపడుతున్నారు. డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కోవాలని జగన్ రెడ్డి అనుకుంటున్నారు. కానీ, జగన్ రెడ్డి చేసిన అరాచకాలకు ఇబ్బందులు పాలైన ప్రజలు ఎన్నికలు నోటీఫికేషన్ ప్రకటించిన రోజే వైసీపీ పార్టీపై రాళ్లు వేసేందుకు సిద్దంగా ఉన్నారు. జగన్ రెడ్డి ఇంట్లో కూర్చుని డబ్బాలు కొట్టుకుంటూ బయటకి వస్తే పరదాలు కట్టుకుంటున్నాడు. పాదయాత్ర చేసి ముద్దులు పెట్టిన వ్యక్తి నేడు బయటకు రావడానికి బయపడి చస్తున్నాడు.

కాకినాడ మహిళ ఆరుద్రమ్మ కుమార్తెకు ఆరోగ్యం సరిగాలేదని వేడుకుంటే ముఖ్యమంత్రి సహాయం చేయకపోగా జగన్ రెడ్డి మంత్రి గన్ మెన్ ఆ మహిళను చిత్రహింసలకు గురిచేశాడు. ఆ మహిళ ఆస్థిని కూడా అమ్ముకోనీకుండా దాన్ని కూడా కబ్జా చేసే స్థితికి వచ్చారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉందా అని అడుగుతున్నాను. ఆ మహిళ నరాలు కట్ చేసుకుని ఆత్మహత్య చేసుకునే పరిస్తితులు కల్పించారు. కనీసం ఆ మహిళను పిలిచి ఆమె సమస్య వినని ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా? ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత జగన్ రెడ్డికి ఉందా? మానవత్వం లేని ముఖ్యమంత్రి బటన్ నొక్కినంత మాత్రాన ఉపయోగం ఏంటి? నిన్న అనంతపురం లో కరెంటు తీగలు తెగి 6 మంది అన్యాయంగా మరణించారు. నెలలో ఇలాంటివి నాలుగు ప్రమాదాలు జరిగాయి. ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదా? ఉత్తరాంధ్రపై కపట ప్రేమ చూపిస్తూ ప్రాంతీయ విధ్వేషాలు సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలీపోయాయి.

LEAVE A RESPONSE