-మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు
అగ్నిపథ్ విధానం యువతకు అర్థం కాలేదని కేంద్రం అనడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్ మండలం మోతెలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మోతె బైపాస్ రోడ్డు, మోతె-నడికుడ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సభలో మంత్రి మాట్లాడారు.1.30 కోట్ల వ్యయంతో నిర్మించిన మోతె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు హరీష్ రావు,వేముల ప్రశాంత్ రెడ్డి లు ప్రారంభించారు.
అంతకుముందు వేల్పూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు తనిఖీ చేశారు. మోతే సభ అనంతరం బింగల్ వంద పడకల ఆస్పత్రిని మంత్రి ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన వైద్య అధికారులతో సమీక్షించారు.
అగ్నిపథ్‌పై కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దేశమంతా అట్టుడుకుతోందని.. భాజపా ప్రతి ఒక్కరి ఉసురు పోసుకుంటుందని ఆక్షేపించారు. సైన్యాన్నీ ప్రైవేటు పరం చేసేందుకు యత్నిస్తోందని మండిపడ్డారు.సికింద్రాబాద్ అల్లర్లను తెరాస చేయించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపిస్తున్నారన్న మంత్రి.. అలా అయితే.. యూపీలో యోగి, బిహార్‌లో నితీష్ అల్లర్లు చేయించారా? అని ప్రశ్నించారు. ఆర్మీ ఉద్యోగాలను సైతం యువతకు దూరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సైన్యంపై కేంద్రం నిర్ణయంతో దేశం అట్టుడుకుతోంది. అగ్నిపథ్ పథకం యువతకు అర్థం కాలేదనటం హాస్యాస్పదం. ఆర్మీని కూడా ప్రైవేట్‌పరం చేయాలని మోదీ చూస్తున్నారు. అడగటానికి వెళ్లిన యువకులపై కాల్పులు జరిపారు. దాడులను తెరాస చేయించిందని బండి సంజయ్ అంటున్నారు. మరి ఉత్తరప్రదేశ్‌లో యోగి, బిహార్‌లో నితీశ్ చేయించారా?- అని మంత్రి ప్రశ్నించారు.మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కేసిఆర్ 2001 లో ఉద్యమం మొదలు పెట్టినప్పుడు మేము మీ వెంట ఉంటామని ఏకగ్రీవ చేసి తీర్మానం ఇచ్చిన గ్రామం మోతె అన్నారు.
ఇక్కడి ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో మట్టిని ముడుపు కట్టి తీసుకెళ్లారన్నారు. రామునికి హనుమంతుడు యెట్లనో…20 ఏళ్ల క్రితం కేసిఆర్ కు హనుమంతుని లా హరీష్ రావు ఇక్కడికి వచ్చాడన్నారు. మోతె గ్రామం స్ఫూర్తి ఆదర్శం.నాడు ఉద్యమానికి అండగా నిలిచిన మోతె గ్రామానికి ముఖ్యమంత్రి కేసిఆర్ ఏది అడిగినా కాదనరని,70 కోట్లతో అన్ని విధాల మోతె గ్రామాన్ని అభివృద్ది చేసుకున్నామ్మన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, గణేశ్ గుప్త,MLC లు వి.జి గౌడ్,రాజేశ్వర్,జెడ్పీ చైర్మన్ విఠల్ రావు,మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి,జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.