– జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్
ఎమ్మెల్సీ లుగా 11 మందికి బీసీలకు పదవులు అంటూ మరొకసారి బీసీలను సామాజిక న్యాయం పేరిట సీఎం జగన్ మోసం చేస్తున్నారని జనసేన పార్టీ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. శాసనమండలి ఎప్పుడైనా రద్దు అవుతుందనే విషయాన్ని ఇటు జగన్ మోహన్ రెడ్డి గాని, అటు కొత్తగా ఎమ్మెల్సీ లు గా ప్రకటించబడ్డ వారు గాని గుర్తుంచుకోవాలని అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
శాసనమండలి రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన సీఎం జగన్ శాసన మండలి లో ఎమ్మెల్సీ స్థానాలను ఏ విధంగా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. రద్దు కాబోయే శాసన మండలి లో బీసీలకు ఇచ్చిన 11 ఎమ్మెల్సీ పదవులు తుమ్మితే ఊడిపోయే పదవులు లాంటివి. దీనివల్ల బీసీలకు ఒరిగే ప్రయోజనం ఏమీ లేదన్నారు. సామాజిక న్యాయం అంటూ బీసీలను మోసం చేస్తున్న సీఎం జగన్ ముమ్మాటికి బీసీల ద్రోహి అని అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు తగ్గించి 16,800 బీసీలు రాజ్యాంగ బద్ధంగా పదవులు కోల్పోయేలా చేసిన సి ఎమ్ వైయస్ జగన్ ముమ్మాటికి బీసీల ద్రోహని పోతిన ప్రకటించారు. సీఎం జగన్ ప్రభుత్వంలో కులచేతివృత్తులను ఏనాడైనా ఆదరించారా?. పెళ్ళికానుక పథకంలో అనేక నిబంధనలను చేర్చి బీసీ ఆడపిల్లలను మోసం చేసిన సీఎం జగన్ అని పోతిన వెంకట మహేష్ ధ్వజమెత్తారు.