-బందోబస్తు విధుల కోసం వచ్చిన ఎస్ఐ శిరీషను విఆర్ కు పంపిన అధికారులు
అమరావతి:- గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో రహస్య కెమేరాల అంశంపై విచారణ జరుగుతోంది. ఈ విచారణను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో మాట్లాడి విచారణపై సమీక్ష చేస్తున్నారు. ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా సిఐ రమణమ్మను ఎస్పీ నియమించారు. ఆమె నేతృత్వంలో విచారణ జరుగుతుండగా….బందోబస్తు కోసం పలు ప్రాంతాల నుంచి మహిళా పోలీసు అధికారులను, సిబ్బందిని నియమించారు.
ఈ సమయంలో కోడూరు ఎస్ఐ శిరీష విద్యార్ధినులతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వెలుగు చూసింది. ఆ పోలీసు అధికారి తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధలో, ఆందోళనలో ఉన్న విద్యార్థినులతో అధికారులు దురుసుగా ప్రవర్తించడం మంచిదికాదని…ఇలాంటి పోకడలను సహించేదిలేదన్నారు.
ఘటనపై పోలీసు ఉన్నతాధికారలు నుంచి వివరణ కోరారు. దర్యాప్తు బృందంలో ఎస్ఐ శిరీష లేరని…బందోబస్తు కోసం పిలిపించామని అధికారులు వివరించారు. అమెను ఆ ప్రాంతంలో బందోబస్తు విధుల నుంచి ఇప్పటికే తప్పించామని తెలిపారు. కోడూరు ఎస్ఐ గా ఉన్న శిరీషను విఆర్ కు పంపుతున్నట్లు ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. స్టూడెంట్స్ ఆవేదనను అర్థం చేసుకుని…వారికి భరోసా ఇచ్చేలా అధికారులు వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు.