Suryaa.co.in

Andhra Pradesh

వివేకా హత్య కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి మౌనం వీడాలి

– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ఎన్నికల్లో గెలిచేందుకు జగనే… వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు పథక రచన చేసి ఉంటారన్న వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాన్ని బట్టి చూస్తే.. వేళ్లన్నీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వివేకా మర్డర్ కేసులో ఇప్పటికే అన్ని వాంగ్మూలాలు జగన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని వేలెత్తి చూపిస్తున్నా.. ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పడం లేదు? మౌనంగా ఎందుకు ఉంటున్నారు? మౌనం నేరాంగీకారమని భావించాలా?

వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది.. ఇప్పటికే 11 సీబీఐ కేసులు ఉన్నాయి.. ఇది 12వది అవుతుందని జగన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా చెప్పబడుతుంటే.. మీకు చట్టాలంటే లెక్కలేనితనమా? అంటే పరోక్షంగా వివేకా మర్డర్ కేసులో తన హస్తం ఉందని జగన్ రెడ్డి గారు చెప్పకనే చెబుతున్నారా? వివేకా ఇంట్లో లేఖ దొరికిన విషయంగానీ, అందులో డ్రైవర్ ప్రసాద్ పేరు ఉన్నట్లుగానీ రాజశేఖర్ రెడ్డి, పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే హత్య జరిగిన రోజు జగన్ రెడ్డి తన విలేకరుల సమావేశంలో ఆ లేఖ గురించి ఎలా ప్రస్తావించారు?

వివేకా హత్యను రాజకీయాలతో ముడిపెట్టి జగన్ రెడ్డి మాట్లాడటాన్ని బట్టి చూస్తే.. ఈ హత్య గురించి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసని తేటతెల్లమవుతోంది. అన్నీ తెలిసే.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నెపాన్ని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పై నెట్టారు. నేడు అన్ని సాక్ష్యాధారాలు, వాంగ్మూలాలు జగన్మోహన్ రెడ్డిని వేలెత్తి చూపిస్తున్నాయి. దోషులను జగన్మోహన్ రెడ్డి ఎందుకు రక్షిస్తున్నారు? ఎన్నికల్లో గెలిచేందుకు కోడికత్తి కేసులానే ఈ హత్యను కూడా ఉపయోగించుకున్నారా?

వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర బయటపడినందున నైతిక బాధ్యత వహిస్తూ.. తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? ఒక హత్య కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఉన్నదా? పలు దఫాల్లో కోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేసినా నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ హత్య కేసులో నైతిక విలువలు పాటించి గౌరవోపేతమైన నిర్ణయం తీసుకోవాలి.

ఎంపీ అవినాష్ రెడ్డిని రక్షించడానికి ముఖ్యమంత్రి సతీసమేతంగా పడుతున్న తాపత్రయం రాష్ట్ర ప్రజలందరికీ తేటతెల్లం అయింది. ఈ రక్తచరిత్ర సాక్ష్యాధారాలతో బయటపడిన నేపథ్యంలో నైతిక విలువలతో కూడిన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి భుజస్కందాలపై ఉందని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారు. ఈ రక్త చరిత ఏనాడూ హత్యా రాజకీయాలవైపు కన్నెత్తి చూడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అంటించాలని ప్రయత్నించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ఆయనకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను.

LEAVE A RESPONSE