Suryaa.co.in

Editorial

విశ్వ ‘విషాద’నగరం!

– హైదరా‘బాధలె న్నో’
– సెక్రటేరియేట్‌ ఎదుటే స్విమ్మింగ్‌పూల్‌
– మునకేస్తున్న మహానగర బస్తీలు
– స్కూలు సెలవుల్లోనూ కనిపించని స్పష్టత
– ‘సిటి’జనులకు మానని ట్రాఫిక్‌ గాయాలు
– పాపం హైదరా‘బ్యాడ్‌’
( మార్తి సుబ్రహ్మణ్యం)

సుందరమైన సెక్రటేరియేట్‌.. ఆ పక్కనే నిలువెత్తు అంబేద్కర్‌ విగ్రహం.. ఆ ముందు కనువిందు చేసే అమరవీరుల స్తూపం.. కొంచెం ముందుకువెళితే పర్యాటక పరవళ్లు, పార్కులు. కొద్దిదూరం వెళితేకళకళలాడే కేబుల్‌ వంతెన.. ఇంకా దూరం వెళితే అందమైన అవుటర్‌ రింగ్‌రోడ్డు. ఆ మధ్యలో ప్రతి అయిదు నిమిషాలకోసారి శ్రావ్యంగా వినిపించే మెట్రో రైలు కూత. అందమైన వాటి స్టేషన్లు. మణికొండ, మియాపూర్‌, హైటెక్‌సిటీ, శంషాబాద్‌ సుందరాలు. ఆకాశంతో పోటీ పడేంత ఎత్తు ఎదిగిన, ఐటి కంపెనీల భవనాలు. ఇదంతా విశ్వనగరానికి ఒకవైపే!

సుందరమైన సెక్రటేరియేట్‌ ఎదురు భారీ వర్షాల పుణ్యాన తాత్కాలికంగా ప్రత్యక్షమైన పరవళ్లెత్తే స్విమ్మింగ్‌పూల్‌.. ఇంకొంచెం ముందుకెళ్తే ఖైరతాబాద్‌ బస్తీలను ముంచెత్తిన వర్షపు దృశ్యం.. కొంచెం ముందుకెళితే మోకాలులోతు నీళ్లు.. బస్తీల్లో తొంగిచూస్తే మనుషులను మింగేసే మ్యాన్‌హోళ్లు.. బస్తీల మధ్యలో ప్రవహించే మురికినీళ్లు నేరుగా ఇళ్లలోకి వచ్చే దృశ్యాలు. కొంచెం దూరంగా ఉండే కూకట్‌పల్లి..కుళ్లిన వస్తువులు, మురికినీటితో కూరుకుపోయి స్వాగతం పలుకుతుంది. కోఠి టు వనస్థలిపురం, సికింద్రాబాద్‌ టు కూకట్‌పల్లి, ఉప్పల్‌ టు వరంగల్‌ రోడ్‌ విషాదం గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఇక నగరంలో రోడ్డెక్కితే, గంటలపాటు తినేసే ట్రాఫిక్‌ ‘జాము’లు. ఇవి విశ్వనగరంలోని విషాదానికి మరోవైపు!!

హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని బీఆర్‌ఎస్‌ సర్కారు ప్రకటించింది. అంతేనా.. ఒక డల్లాస్‌, మరో ఇస్తాంబుల్‌గా మారుస్తామనీ బాసలు చేసింది. పాలకులు చెప్పిన స్ట్రాటజికల్‌ రోడ్లు, ఈ వర్షాలకు గుంతలు తేలిపోతూ దర్శనిమిస్తున్నాయి. మెట్రోస్టేషన్ల కింద రోడ్లు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. రోడ్డుపై పదినిమిషాల ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతున్న దుస్థితి.

శివారు ప్రాంతాల్లో ఏ వెంచర్లు చూసినా నిలువెత్తు నీటితో కనిపిస్తున్నాయి. అనుమతి లేని లేవుట్లతో నిర్మించిన కొత్త కాలనీలన్నీ, గత వారం నుంచి నీళ్లతో నానుతూ దర్శనమిస్తున్నాయి. ఇక శిధిల భవనాల్లో ఉన్న వారి బతుకులు బలిపీఠంపైనే ఊగుతున్న పరిస్థితి.

తాజా వర్షాలకు కొత్తగా వేసిన రోడ్లు కూడా కొట్టుకుపోతున్నాయి. మళ్లీ అవి ఎప్పుడు వేస్తారో తెలియదు. ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో, కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైపోయాయి. ఇప్పుడు కొత్తగా కొట్టుకుపోయిన రోడ్ల స్థానంలో మళ్లీ కొత్త రోడ్లు వేయడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పడం కష్టం. విశ్వనగరం లోని దాదాపు అన్ని బస్తీలు, కాలనీల్లోని రోడ్డు ఈ వర్షాలకు ధ్వంసమయిపోయి, గుంతలు తేలి కనిపిస్తున్నాయి. అక్కడా, ఇక్కడా అని లేదు. ఎక్కడైనా ఇవే దృశ్యాలు!

చివరాఖరకు పాలకులు తరచూ సగర్వంగా చెప్పుకునే, అవుటర్‌ రింగ్‌రోడ్‌ మార్గంలోని రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. ఎక్కడ గుంతలున్నాయో, ఎక్కడ రోడ్డు ఉందో తెలియని ప్రాణభయం. ఫలితంగా వాహనాలన్నీ ఒకవైపే ప్రయాణించాల్సిన దుస్థితి. రోడ్లపై గంటలపాటు ట్రాఫిక్‌ నిలిచిపోతే, వెంటనే నియంత్రించేంతసంఖ్యలో ట్రాఫిక్‌ సిబ్బంది లేని దయనీయం.

గతంలో భారీ వర్షాలకు డ్రైనేజీలో పడి మరణించిన వారి సంఖ్యకు లెక్కలేదు. 2020 నుంచి నగరంలో ఇవే విషాద దృశ్యాలు. ముంపు ప్రాంతాల సంఖ్య తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించకపోగా, నేతల అత్యాశతో మరింత పెరుగుతున్న వైనం. అధికార-విపక్ష నేతల కుమ్మక్కుతో లోతట్టు ప్రాంతాలను కాలనీగా మారుతున్న దారుణం.అయినా పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యం-అవినీతి, కలసి వెరసి సిటిజనులను బలితీసుకుంటున్న విషాదకర దృశ్యాలు.. విశ్వ నగరాన్ని విషాద నగరంగా మారుస్తున్నాయి.

ఇంత వాన బీభత్సంలో కూడా స్కూళ్లకు సెలవుపై, స్పష్టత లేని పాలకుల నిర్వాకం పిల్లలకు శాపంగా మారింది. ఒకవైపు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని అధికారులే ప్రకటిస్తున్నారు. మరి అంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు, స్కూళ్లకు ముందుగానే సెలవులివ్వాలన్న సోయి ఎవరికీ లేకపోవడమే విచిత్రం. ముఖ్యమంత్రి ఆదేశిస్తే తప్ప, విద్యాశాఖ మంత్రికి తనంతట తాను నిర్ణయం తీసుకోవాలన్న స్పృహ లే పోవడం మరో విషాదం. పిల్లలు స్కూలుకు వెళ్లిన తర్వాత.. మధ్యలో సెలవులు ప్రకటించిన ‘ప్రభుత్వ అప్రమత్తత’, నవ్వులపాలయింది. విపక్షాలకు అస్ర్తాలిచ్చింది. పాలకులు ఇకనైనా మేల్కొనపోతే.. ఫలితం అనుభవించేది రేపటి తరమేనన్నది నిష్ఠుర నిజం.

LEAVE A RESPONSE