-విస్సన్నపేట స్కూలులో వరుణ విప్లవం
– నాడు-నేడు ఫలితమిదీ!
( మార్తి సుబ్రహ్మణ్యం)
అతి ప్రచారం వికటిస్తే అభాసుపాలయ్యే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ప్రచారం ఎక్కువ-పని తక్కువయితే నవ్వులపాలవడం సహజం. అందుకు ఎవరూ అతీతులు కారు. ఇప్పుడు ఏపీలోని సర్కారీ స్కూళ్లలో ఇదే కనిపిస్తోంది. లక్షలు పోసి నాడు- నేడు పేరుతో.. సోకు చేసిన స్కూళ్ల చక్కద నం ఏమిటో, వర్షాలు బట్టబయలు చేశాయి. స్కూల్లో పిల్లలు గొడుగుపట్టుకుని చదువుకునే, విచిత్ర దృశ్యాలను తాజా వర్షాలు ఆవిష్కరిస్తున్నాయి. విస్సన్నపేట సర్కారీ స్కూలులో రాష్ట్రం విస్తుపోయే వరుణ విప్లవమిది. విని తరించండి.
ఏపీలో నాడు నేడు స్కీముతో సర్కారీ స్కూళ్లకు మోక్షం వచ్చిందని, అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం అంతా ఇంకా కాదు. నాడు- నేడుతో సర్కారీ స్కూళ్లకు మహర్దశ వచ్చిందంటున్న పాలకులు చెప్పే మాటల్లో, నిజమెంతో చాటే దృశ్యమిది. ఇది విస్సన్నపేటలోని ప్రభుత్వ పాఠశాల. దీనిని ఇటీవలే 66 లక్షలు పోసి ఆధునీకరించారట. అంటే అభివృద్ధి చేశామన్నది పాలకుల కవి హృదయం. కానీ కొద్దిరోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో, నాడు- నేడు ఆధునీకరణ డొల్లతనం ఏమిటో బట్టబయలయింది. భారీ వర్షాలకు స్కూలు నీటిలో నిండిపోయింది. క్లాసురూములో కూర్చున్న చిన్నపిల్లలు పైన తల తడవకుండా, గొడుగు పట్టుకునే పాఠాలు వింటున్న విషాద దృశ్యమిది.
మరి స్కూలు సోకు కోసం పెట్టిన ఆ 66 లక్షలు ఏమయ్యాయి? అన్ని లక్షలు తగలేసినా పై కప్పుమీద నీళ్లు నిలవకుండా, నేరుగా క్లాసు రూములోకి ఎలా వచ్చాయి? పనుల నాణ్యత చూడకుండా అధికారులు కాంట్రాక్టరుకు బిల్లులు మంజూరు చేశారా? అంటే రాష్ట్రంలో నాడు-నేడు పేరుతో చేసిన స్కూళ్ల ఆధునీకరణ చక్కదనం ఇలాగే ఉందా? అసలు ఈ పాపానికి బాధ్యులెవరు? ఈ వైఫల్యానికి శిక్ష ఎవరికన్నదే ప్రశ్న.