– జగన్ చెప్పినట్లు కాలరు పట్టుకోవద్దు, ప్రశ్నించండి చాలు
– మద్య నిషేధానికి తూట్లు
– న్యాయస్థానాలు నేరాలను ప్రోత్సహిస్తాయనుకోవడం లేదు
– కానీ ఇది నేరమని న్యాయస్థానం దృష్టికి తన లాంటి వాళ్లు తీసుకు వెళ్లాల్సిందే
– కోర్టు ఉత్తర్వుల వక్రీకరణలో సాక్షి టాప్
– కార్పొరేషన్ పేరిట రుణం… రాజ్యాంగ ఉల్లంఘనే
– నియోజకవర్గానికి వెళ్లాలనే ఉంది
– పదవ షెడ్యూల్ నిబంధన ఉల్లంఘించలేదు
– క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త గా అధ్యక్షున్ని విమర్శించలేదు
– ముఖ్యమంత్రి, మంత్రులను విమర్శించడం పదవ షెడ్యూల్ ఉల్లంఘనల కిందకు రాదు
– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
తమ పార్టీ అధ్యక్షుడు చెప్పినట్లుగా, ముఖ్యమంత్రి వినడం లేదని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఎన్నికలకు ముందు ఆడపడుచులకు ఇచ్చిన హామీలో భాగంగా సంపూర్ణ మద్య నిషేధాన్ని నాలుగు దశల్లో అమలు చేస్తామని తమ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… మద్య నిషేధానికి తూట్లు పొడిచే విధంగా, రాష్ట్ర ప్రభుత్వం, రుణ సంస్థలతో ఒప్పందాన్ని కుదుర్చుకుందని చెప్పారు.
రాష్ట్రంలో పాక్షికంగా కానీ, పూర్తిగా మద్యనిషేధం అమలు చేయబోమని, అలాగే మద్యం ధరలను, మార్జిన్ ను కూడా తగ్గించ బొమని రుణ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారన్నారు. ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, మూడు నెలల వ్యవధిలోగా తీసుకున్నా 8 వేల కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొన్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఐదు లక్షల రూపాయల అభివృద్ధి పని చేసేవారిని, ఇచ్చినప్పుడే బిల్లులు తీసుకోవాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం, 8 వేల కోట్ల రూపాయలను ఎలా చెల్లిస్తుందని ప్రశ్నించారు.
అంటే ఎన్నికల ముందు తమ పార్టీ అధ్యక్షుడు, అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన హామీ అమలుకు ముఖ్యమంత్రి సుముఖంగా లేరన్న విషయం స్పష్టమవుతుంది. రానున్న ఎన్నికల నాటికి దశలవారీగా మద్య నిషేధం అమలు చేయకపోతే, ఓట్లే అడగని తమ పార్టీ అధ్యక్షుడు చెప్పారని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఆదేశాలతో గడపగడపకు తిరగనున్న ప్రజాప్రతినిధులకు గుర్తు చేయాలన్నారు.. తమ పార్టీ అధ్యక్షుడై తే, కాలర్ పట్టుకొని నిలదీయమన్నారని, అంత పని చేయవద్దని సూచించారు. ఎందుకంటే కాలర్ పట్టుకుంటే పోలీసులు కుళ్ల బొడు స్తారని, అందుకే కేవలం ప్రశ్నించాలన్నారు..
రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ, కార్పొరేషన్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వం అప్పులను చేసిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. కొన్ని మద్యం డిపోల నుంచి వచ్చే ఆదాయాన్ని గ్యారెంటీగా చూపెట్టి రాష్ట్ర ప్రభుత్వం తొలుత 10 వేల కోట్ల రూపాయల అప్పులు చేసిందన్నారు. తిరిగి మరికొన్ని డిపోల ఆదాయాన్ని గ్యారెంటీగా చూపెట్టి అప్పు పొందే ప్రయత్నాన్ని కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా అడ్డుకోవడం జరిగిందన్నారు.. అయితే ప్రభుత్వ పెద్దలు, కొంతమంది బ్యాంకర్లు కుమ్మక్కై, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు ప్రత్యేక ఆదాయాన్ని చూపెట్టి అప్పులను పొందడాన్ని ఆక్షేపించారు.
రాజ్యాంగంలో లేని మార్జిన్ అనే విపరీత పదాన్ని కనిపెట్టి, రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని, బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయంగా చూపెడుతూ అప్పులను పొందుతున్నారన్నారు. దొడ్డిదారిన 8 వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకోవడం అనైతికమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ 9 2022 పేరిట తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను కోర్టులో సవాలు చేయడం జరిగిందని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. దీనిపై ఈనెల 15వ తేదీన మరోసారి వాదనలు జరగనున్నాయన్నారు.
రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ, కార్పొరేషన్ పేట్ పేరిట రుణాలను పొందడం తప్పే కాదు… మోసం అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని న్యాయస్థానాలు ప్రోత్సహిస్తాయని తాను అనుకోవడం లేదని, కానీ న్యాయస్థానాల దృష్టికి తనలాంటి వారు ఎవరో ఒకరు తీసుకువెళ్లాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసి, కార్పొరేషన్ పేరిట తీసుకున్న 8 వేల కోట్ల రుణాన్ని తప్పుపడుతూ కోర్టు ఆదేశాలను జారీ చేస్తే, ఇన్వెస్టర్లకు ఆ డబ్బులు తిరిగి చెల్లించవలసి ఉంటుందన్నారు.
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ పేరిట రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, కోర్టులో కేసు పెండింగ్ దశలో ఉండగానే దొంగచాటుగా అప్పులు చేయడం తప్పు అన్నారు. అయితే గతంలో కోర్టులో వాదనలు జరిగినప్పుడు ప్రధాన న్యాయమూర్తి, తన సహ చర న్యాయమూర్తి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా యధాలాపంగా చేసిన వ్యాఖ్యలను సాక్షి దినపత్రిక విపరీత అర్ధాలు తీసి, చిలవలు పలవలుగా రాసిందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ప్రజల దృష్టి మరల్చడానికి ఈ విధంగా తప్పుడు కథనాలను రాసిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ల లో ఐదు వేల కోట్ల రూపాయలు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్ కు సంబంధించినవని, ఈ సొమ్ము పై మార్కెట్ రేటు కంటే 1.65 శాతం అధిక వడ్డీ చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇలాంటి వ్యవహారాలలో ఏజెన్సీ సంస్థలకు సాధారణంగా కమిషన్ ఇవ్వరని కానీ 0.85 శాతం కమిషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు..
విప్ ఎప్పుడు జారీ చేయలేదు… నేను ఉల్లంఘించింది లేదు
లోక్ సభ స్పీకర్ తన మూడేళ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ ఉండగా, సాక్షి దిన పత్రిక విలేఖరి తన అనర్హత పిటిషన్ ఎన్నాళ్ళు పెండింగులో పెడతారని ప్రశ్నించినట్లు తెలిసిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. దానికి స్పీకర్ స్పందిస్తూ… రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ను రఘురామకృష్ణంరాజు ఉల్లంఘించలేదని, అనర్హత వేటు అన్న ప్రశ్న తలెత్తదని సమాధానం గా చెప్పినట్లు పత్రికల్లో వచ్చిందన్నారు.
పదవ షెడ్యూల్ మేరకు ముఖ్యమంత్రి , మంత్రులను విమర్శించడం అన్నది అనర్హత కిందికి రాదని స్పష్టం గా పేర్కొనడం జరిగిందన్నారు. పార్టీ జారీ చేసే విప్ ను దిక్కరించడం మాత్రమే, అనర్హతకు దారితీస్తుందని పదవ షెడ్యూల్ లో స్పష్టంగా వెల్లడించారన్నారు. ఎన్ని విమానాలు వేసుకుని తిరిగిన, ఎవరి,ఎవరో కాళ్లు పట్టుకున్న …గత మూడేళ్లలో తమ పార్టీ విప్ జారీ చేసింది లేదు.. దాన్ని తాను దిక్కరించి లేదన్నారు. ఈ విషయం లో విజయసాయి వంటి వారు రాజ్యాంగాన్ని చదువుకుంటే మంచిదని సూచించారు.
ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ పర్మిషన్ ఉంటే ఎన్ డి ఏ బలపరిచిన అభ్యర్థిని కాదని , కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కి ఓటు వేయమని జగన్మోహన్ రెడ్డి విప్ జారీ చేస్తే, తాను కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కే ఓటు వేస్తానని, అప్పుడు కూడా పార్టీ విధానాన్ని, విప్ ను దిక్కరించనని చెప్పారు. 10వ షెడ్యూల్ నిబంధనలలో మార్పు చేసేంతవరకు తనపై అనర్హత వేటు అనే ప్రశ్న తలెత్తదని రఘురామ వెల్లడించారు.
రాజ్యాంగం చదవమంటే విజయ సాయి భగవద్గీత చదువుతున్నాడు
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి మృతిపై తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి స్పందించిన తీరు ఆశ్చర్యకరంగా ఉందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. విజయసాయి ని రాజ్యాంగం చదవమంటే, భగవద్గీత చదువుతున్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. గంగాధర్ రెడ్డి గతంలో 2007లో హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అటువంటి వ్యక్తి , వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ ప్రకటించిన 5 లక్షల బహుమతి కోసం, ఆయనే నేరుగా సీబీఐని సంప్రదించారని గుర్తు చేశారు. తాను సీబీఐని సంప్రదించిన విషయాన్ని తెలుసుకొని ఒక రెడ్డి గారు తనకు 10 కోట్ల రూపాయలు ఇస్తానని అన్నారని, దీనితో ఈ హత్యలో ఆయన ప్రమేయం ఉండి ఉండవచ్చునని గంగాధర్ రెడ్డి సీబీఐ అధికారులకు వాంగ్మూలం ఇచ్చారనీ తెలిపారు.
అయితే తర్వాత గంగాధర్ రెడ్డి తానిచ్చిన వాంగ్మూలాన్ని తూచ్ …అన్నాడని, కేసు విచారణ తుది దశకు చేరుకున్న తరుణంలో గంగాధర్ రెడ్డి మళ్లీ ఎక్కడ మనసు మార్చుకుంటాడో నని, ఈ కేసులో నిందితులుగా ఉన్న వారే ఆయన్ని హత్య చేసి ఉంటారేమో నని రఘురామకృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు. గంగాధర్ రెడ్డి కి షుగర్ వ్యాధి ఉన్నమాట నిజమేనని, దేశంలో 40 శాతం మంది షుగర్ వ్యాధిగ్రస్తులు లేనని, అంతమాత్రాన ఎలుక కొరికితే చనిపోవడం ఏమిటని విస్మయం వ్యక్తం చేశారు.. సాక్షులు బతికుండగానే వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
కుట్రలన్నీ గమనిస్తా… నియోజకవర్గానికి వెళ్లాలనే ఉంది
వచ్చే నెలలో భీమవరం పట్టణంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతున్న తరుణంలో తనకు ఆ కార్యక్రమంలో పాల్గొనాలని ఉన్నదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రధాని మోడీ, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అంటే తనకు ఎంతో గౌరవం అని పేర్కొన్నారు. తాను ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయితే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని దొంగ , తప్పుడు కేసులు బనాయించే అవకాశం ఉన్నట్లు తనకు తెలిసిందన్నారు.
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లుగా తనకు సమాచారం అందిందని తెలిపారు. అన్ని విషయాలను తెలుసుకున్న తరువాతే సభ కు హాజరవుతానని చెప్పారు.