Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం శాసనసభలో చేసిన సుదీర్ఘ ప్రసంగం వ్యర్థ ప్రసంగమే

-సీజేఐ జస్టిస్ లలిత్ గతంలో జగన్ తరఫున కేసుల్లో లాయర్‌గా ఉన్నారు
-కొత్త సీజేఐకు ఏపీ వ్యవహారాలు, సీఎం జగన్ పట్ల అవగాహన ఉంది
-రాజధాని విషయంలో సీజేఐ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం
-ఎన్నికల లోపల అమరావతి జడ్జిమెంట్ రాకుండా ప్రభుత్వం ఎత్తుగడ
– టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం శాసనసభలో చేసిన సుదీర్ఘ ప్రసంగం వ్యర్థ ప్రసంగమే అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను బలవంతంగా గెంటేసి ప్రసంగించాల్సిన అవసరమేమొచ్చింది? అసత్య ప్రచారాలతో ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు. ఆ అసత్య ప్రచారాలనే మరింత విస్తృతంగా అన్ని వేదికలను ఉపయోగించుకొని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

అసెంబ్లీ సాక్షిగా తన ప్రభుత్వంమీద తానే తప్పుడు లెక్కలు చెప్పిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో మిగిలిపోతారు. ముఖ్యమంత్రి పొరపాటున సంఖ్యలు తప్పు చెప్పలేదు. అధికారులెవరూ ఆయనను తప్పుదోవ పట్టించలేదు. ఈ అంకెలు, సంఖ్యలు ఎవరూ చూడరనే ఉద్దేశంతో సీఎం ఉద్దేశపూర్వకంగా సభను తప్పుదోవ పట్టించారు. ప్రభుత్వం మాటలకు, చేతలకు పొంతన లేదు. జగన్ కు ఆర్థిక పరిస్థితిపై ప్రగాఢ నమ్మకమే ఉంటే, అద్భుతమైన పరిస్థితులున్నాయనే నమ్మకముంటే పారదర్శక విధానాన్ని ఎందుకు పాటించడంలేదు?

మీ ఫైనాన్స్ డీటైల్స్ దొరకవు, ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమాచారం కావాలన్నా దొరకదు. జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి ఎంత వస్తోందో తెలియదు. ఏ విధమైన సమాచారం ఏ ప్రభుత్వ వెబ్ సైట్ లో దరకదు. జీవోలను వెబ్ సైట్ లో ఎందుకు పెట్టడంలేదు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీడీపీ శ్వేతపత్రం అడిగితే ఉలుకూ పలుకూ లేదు. ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో రెండు రోజులు చర్చ పెడతామన్నా మాకు అభ్యంతరంలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే ప్రభుత్వ ఉద్యోగులకు నెల నెలా జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు?
రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ సకాలంలో ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? వైసీపీ మంత్రులే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోలా మాట్లాడుతున్నారు. సీపీఎస్ మీద అవగాహన లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు ఉద్యోగులకు సీపీఎస్ ఇవ్వలేకపోతున్నామని సీఎంఓలు, సలహాదారులు, మంత్రులు ప్రకటించారు. ముఖ్యమంత్రి ఏమో ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా వుందని అసెంబ్లీలో చెప్పారు. ఏది అబద్దం, ఏది నిజం? ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూదులు, పారాసిటిమోల్ ట్యాబ్లెట్లు కూడా దొరకని పరిస్థితి ఎందుకుంది?

అంగన్ వాడీల ద్వారా చిన్నారులకు కోడిగుడ్ల సరఫరా, చిక్కీ సరఫరా నిలిపేశారు. 10 కోట్లు వారికి బకాయిలు పెట్టారు. కర్నాటక డెయిరీ డెవలప్ మెంట్ బిల్లు వంద కోట్లు చెల్లించకపోవడంతో చిన్నపిల్లలకు సరఫరా చేసే పాలు ఆపేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి టిడ్కో ఇళ్లకై తీసుకున్న రూ.7,300 కోట్లు ఎక్కడికి మళ్లించారో తెలియాలి. మీ ఖజానా నిండుగా ఉంటే రోడ్లను ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారు? కూలీలకు ఇచ్చే సెస్‍ను దారి మళ్లించారు. సీఎం అసెంబ్లీలో తప్పుడు లెక్కలు వల్లెవేశారు. చెప్పిన మాటల్లో నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉందనుకుంటే ఆర్థిక పరిస్థితిపై తప్పక చర్చించాలి.

అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలను పాలకుల్లాగాను, టీడీపీ ఎమ్మెల్యేలను సేవకుల్లాగాను చూస్తున్నారు. రేపు అసెంబ్లీ చర్చలో సరైన సమయాన్ని ఇవ్వాలని కోరుతున్నాం. సీఎం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో పారదర్శకతతో వ్యవహరించాలి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటే ప్రజలపై భారాలెందుకు?.. అధిక వడ్దీకి అప్పులు ఎందుకు? 11 కేంద్ర పథకాలను ఉపయోగించుకోలేక పోయారు. డబ్బులు లేవని హైకోర్టులోనే అఫిడవిట్ వేశారు. కూలీలకు ఇచ్చే సెస్‍ను దారి మళ్లించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సమయానికి ఇవ్వలేకపోతున్నారు.

అన్ని రంగాల్లోనూ బకాయిలు పెరిగిపోయాయి. రాష్ట్ర పరిస్థితులను ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. అసత్యాలు మానుకుని శ్వేతపత్రం విడుదల చేయాలి. ఉత్తరాంధ్రలో చేసిన భూకబ్జాలకు వైసీపీ నాయకులు భయపడుతున్నారు. రాష్ట్రంలో రోడ్లు ఎందుకు అభివృద్ధి చేయడం లేదు? రాజధానిపై నిర్ణయం చేసే అధికారం రాష్ట్రానికి లేదని కోర్టు చెప్పింది. ఎన్నికల వరకు వాయిదాలకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అనుమానం కలుగుతోంది. అందుకు అనేక ఎత్తుగడలు వేస్తోంది. సుప్రీం కోర్టు తాను టైం కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వమే వాయిదాలు తీసుకొని ఎన్నికలలోపల అమరావతి జడ్జిమెంట్ రాకుండా ఎత్తుగడ వేస్తోంది.

కొత్త సీజేఐకు ఏపీ వ్యవహారాలు, సీఎం జగన్ పట్ల అవగాహన ఉంది. సీజేఐ జస్టిస్ లలిత్ గతంలో జగన్ తరఫున కేసుల్లో లాయర్‌గా ఉన్నారు. రాజధాని విషయంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. రాజధానిపై సీజేఐ న్యాయం జరిగేలా చొరవ చూపుతారని రాష్ట్ర రాజధాని విషయంలో సీజేఐ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఉత్తరాంధ్రలో రాజకీయ లబ్ది పొందడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. మళ్లీ శాసనసభలో అమరావతి రాజధాని బిల్లు బహుశ పెట్టకపోవచ్చు. ప్రజలను అగమ్యగోచరానికి గురిచేయడానికి చూస్తున్నారు. మీ అసత్యాల పునాదులను బద్దలుకొట్టడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ హెచ్చరించారు.

LEAVE A RESPONSE