– బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
శ్రీకాకుళం: దేశానికి ఎంతో గర్వకారణంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గాంధీ స్మృతి వనం నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం తొలిసారిగా నగరంలో ఉన్న గాంధీ మందిరాన్ని సందర్శించి.. అక్కడ చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం గాంధీ మందిరం స్వాతంత్య్ర సమరయోధులు సంఘసంస్కర్తల స్మృతి వనాన్ని ఒక అపురూపవనంగా వర్ణించారు. ముందుగా బాపూజీకి పూలమాలవేసి రఘుపతి రాఘవ రాజారామ్ కీర్తన గాంధీ మందిరం బృందంతో పాటు ఆలపించారు.
బాపూజీ స్ఫూర్తి విశ్వవ్యాప్తంగా ప్రజ్వరిల్లుతోందని, తనకు ఈ స్మృతి వనంలో అడుగుపెట్టినప్పుడు నుంచి తెలియని భావోద్వేగం దేశభక్తి రెట్టింపు అవుతోందని మాధవ్ అన్నారు. దేశంలోని ఎక్కడా లేని ఒక చారిత్రక నిర్మాణాన్ని చేపట్టి సమాజానికి అందించిన నిర్వాహకులు దాతలు ప్రజలను సమాజాన్ని కి శిరస్సు వంచి నమస్కరించారు. గాంధీ మందిరం తరఫున నిర్వాహకులు చిరు జ్ఞాపిక తో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న సహజ వనరులు సక్రమంగా వినియోగించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. సాగునీరు, మంచినీరు సమస్య లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాలకు మంచినీరు అందిస్తున్నామని చెప్పారు.. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్రంలో మాట్లాడి నిధులు తీసికొని వచ్చి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకన్నా ముందు చాయ్ పే చర్చా కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా గొప్పతనాన్ని.. చారిత్రిక నేపథ్యం వివరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, వివిధ వర్గాల ప్రతినిధులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం మల్లయోధుడు, కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.