– సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి
బాపట్ల: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఇంచార్జి మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ లు గురువారం బాపట్లకు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళితో కలిసి బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలు, సభా వేదిక ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. మెగా విద్యార్థుల పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కి హాజరయ్యేందుకు వస్తున్నందున పాఠశాల తరగతి గదులు, విద్యార్థుల తల్లులకు నిర్వహించే రంగవల్లులు, తండ్రులకు నిర్వహించే టగ్గాఫ్ వార్ పోటీల నిర్వహణ, ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.
వర్షం వస్తే కార్యక్రమానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. సభా వేదిక, ప్రాంగణం ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. పాఠశాలలో 919 మంది విద్యార్థులు నమోదు కాగా, ప్రస్తుతం 818 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని మంత్రులకు కలెక్టర్ వివరించారు. తరగతి గదుల విశాలత లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి ఇబ్బందులు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పిఎ సిస్టం నడిపించడంలో అవాంతరాలు రాకుండా చర్యలు తీసుకోవాలని సమాచార శాఖ ఏడిని ఇంచార్జి మంత్రి ఆదేశించారు. మీడియా పాసుల ఇవ్వడంలో సమస్యలు రాకుండా చూడాలన్నారు. పాఠశాల ప్రాంగణమంతా కలియతిరిగారు.
రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 7వ తేదీన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లు ప్రారంభమవుతాయని జిల్లా ఇంచార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్లలో నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ, హెచ్ ఆర్ డి మంత్రి నారా లోకేష్ హాజరవుతున్నారని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు. పాఠశాలల అభివృద్ధి, పిల్లల చదువులు, వ్యక్తిత్వ వికాసం పెంపొందించడానికే రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు.
పాఠశాలల్లో విద్యార్థులు ఎలా చదువుతున్నారు, ఏ రంగాల్లో ఆసక్తితో ఉన్నారనే అంశాలను గుర్తించడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. విద్యార్థులు నిర్లప్తంగా ఉంటే అందుకు కారణాలు, వారిలో అసంతృప్తి, ఏ సబ్జెక్టులలో బలహీనంగా ఉన్నారో గుర్తించి వారిని సరైన మార్గాలోకి తెచ్చేలా తల్లిదండ్రులతో చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. విద్యార్థులలో క్రమశిక్షణ నేర్పేలా తల్లిదండ్రులకు వ్యక్తిగత క్రమశిక్షణ అలవర్చడం, వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటామన్నారు.
ఎన్ సి ఆర్ టి నిబంధనల ప్రకారం పాఠశాలల్లో విద్యాబోధన జరుగుతుందో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించి, విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని జిల్లా ఇంచార్జి మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం, సరైన విధానంలో విద్యాబోధన సాగుతుందో లేదో తెలుసుకుంటామన్నారు.
పిల్లల చదువులు, వ్యక్తిత్వ వికాసం, నాణ్యమైన విద్యాబోధన అందించే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములైన పూర్వ విద్యార్థులను గుర్తించి ఆహ్వానించడం, అభినందించడం ద్వారా వారిని ప్రోత్సహించినట్లు అవుతుందన్నారు. మరింత మంది ముందుకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు ఎవరి నియోజకవర్గాలలో వారు ఈ తల్లిదండ్రుల సమావేశానికి హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు.
ఎక్కడా రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా సాదాసీదాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రాజకీయ పార్టీ నాయకులు పాల్గొనడం, పార్టీ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వంటివి లేకుండా పూర్తిగా తల్లిదండ్రులతోనే ఈ సమావేశం జరిగేలా ప్రణాళికల రూపొందించినట్లు వివరించారు. కేవలం విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా సర్వసాధారణంగానే సమావేశాలు నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
2014 నుంచి 2019 వరకు బాపట్ల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల ఫలితాలు 90 శాతానికి పైగా ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 29 శాతానికి పడిపోయాయని మంత్రి చెప్పారు. విద్యాభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు మాత్రమేకాదని, నిబంధనల మేరకు ఉపాధ్యాయులను నియమించడం, విద్యా బోధనపై దృష్టి సారించడం ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం అని మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల, చీరాల, పర్చూరు శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ, ఎం ఎం కొండయ్య, ఏలూరి సాంబశివరావు, జిల్లా ఎస్పీ తుషార్ డూడి, జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, బుడా చైర్మన్ రాజశేఖరబాబు, మాజీ శాసనసభ్యులు చీరాల గోవర్ధన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.