– అద్దంకి పరిధిలో 38 సబ్ హెల్త్ సెంటర్లు మంజూరు
– వైసీపీ హయాంలో ప్రజారోగ్యం కాగితాలకే పరిమితం
– ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి అడుగులు
– అనుసంధానానికే పేరెంట్స్, టీచర్స్ మీటింగ్
– ఆరోగ్యశాఖ మంత్రి వై. సత్య కుమార్ , ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అద్దంకి: గ్రామీణ ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరులో ఆరోగ్యశాఖ మంత్రి వై. సత్య కుమార్ తో కలిసి శుక్రవారం మంత్రి గొట్టిపాటి పర్యటించారు. ముందుగా ఇరువురు మంత్రులు సంతమాగులూరు లో రూ.1.66 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్మాణం పూర్తి చేసుకున్న సంతమాగులూరు సచివాలయం – 2 ను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఆ తరువాత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ..
సంతమాగులూరుతో పాటు అద్దంకి, కొరిశపాడు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పూర్తయ్యిందని, వాటిని కూడా త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రకటించారు. అదే విధంగా ఏల్చూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.1.50 కోట్ల నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే ఏల్చూరులోనూ పీ.హెచ్.సీ నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. డయాలసిస్, ఎయిడ్స్ రోగులకు అద్దంకిలోనే సేవలు…. అడిగిన వెంటనే ప్రాథమిక వైద్య కేంద్రాలకు నిధులు మంజూరు చేసిన సహచర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి గొట్టిపాటి, అద్దంకి పరిధిలో మంజూరు అయిన 38 సబ్ హెల్త్ సెంటర్ల నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని వెల్లడించారు.
సబ్ సెంటర్ల నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణను వెంటనే పూర్తి చేయాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సబ్ సెంటర్ల నిర్మాణానికి ముందుకు వచ్చే స్థల దాతల పేర్లను భవనాలకు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. అద్దంకి పరిధిలోని డయాలసిస్ రోగులకు ఇబ్బంది లేకుండా 5 పడకల డయాలసిస్ సెంటర్ తో పాటు ఎయిడ్స్ చికిత్సా కేంద్రాన్ని కూడా త్వరలోనే అందుబాటులోకి వస్తామని తెలిపారు. అద్దంకిలోని 30 పడకల ఆరోగ్య కేంద్రాన్ని ఆధునీకరిస్తామని మంత్రి చెప్పారు. ప్రజారోగ్యాన్ని వైసీపీ గాలికి వదిలేసిందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్య శాఖ అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితం అయ్యిందని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. సంతమాగులూరు సచివాలయాన్ని కూడా సగం కట్టి వదిలేశారని, అదే విధంగా అత్యధిక ఆయకట్టు ఉన్న నాగార్జున సాగర్ అధికారులకు కూడా కనీసం కార్యాలయ భవనం లేకుండా చేశారని గత వైసీపీ ప్రభుత్వం పై ఆరోపణలు చేశారు. సీఎం, డీ.సీఎం ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రజలకు చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అద్దంకి ప్రజల కష్టాలు తీర్చేందుకు, ఇచ్చిన మాటకు కట్టుబడి అద్దంకికి ప్రత్యేక రెవిన్యూ డివిజన్ కేటాయించడమే కాకుండా, అద్దంకి నియోజకవర్గాన్ని సీఎం చంద్రబాబు మరలా ప్రకాశం జిల్లాలో కలిపేందుకు తగు చర్యలు తీసుకున్నారని తెలిపారు.
గత ప్రభుత్వంలో మాదిరి కక్షలు, కార్పణ్యాలకు తావు లేకుండా, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుగు వెళ్తుందని ఆయన వెల్లడించారు. ప్రజలకు ఏది అవసరమో దానిని అందిస్తున్నామన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ కూడా అద్దంకి నియోజకవర్గానికి ఎంతో అండగా ఉన్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సత్య కుమార్ కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపిన మంత్రి గొట్టిపాటి, ఆ పరిచయాలతోనే వైద్య, ఆరోగ్య శాఖకు నిధులు తీసుకు వచ్చి అభివృద్ధి చేస్తున్నారని అభినందించారు.
ఎలా చదువుతున్నారో తెలుసుకోవడానికే… విద్యార్థులు ఎలా చదువుతున్నారో, ఏ విధంగా స్కూల్ కు వస్తున్నారో తెలుసుకొని… వారిని అనుసంధానించడానికే మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి గొట్టిపాటి వివరించారు. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మంత్రి లోకేష్ ఎన్నో సంస్కరణలు ప్రవేశ పెట్టారని తెలిపారు. డిఎస్సీ ద్వారా 16,300 మందిని ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చేయడమే కాకుండా ప్రతి ఏడాది ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. అద్దంకి పరిధిలో ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు కొందరు ఇంటర్ విద్యార్థులకూ దాతల సహాయంతో సైకిళ్లను ఉచితంగా అందించామన్నారు.
సంతమాగులూరు ఉన్నత పాఠశాల విద్యార్థులకు కాంటినెంటల్ కాఫీ అధినేత రాజేంద్ర ప్రసాద్ ఆర్థిక సహాయంతో 350 సైకిళ్లను, అసిస్ట్ సేవా సంస్థ ద్వారా 150 సైకిళ్లను శుక్రవారం అందించామన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాలో పాఠశాల విద్యను నిర్వీర్యం చేసేలా చర్యలు చేపట్టారని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. సంతమాగులూరు ఎస్సీ హాస్టల్ వైసీపీ ప్రభుత్వ హయాంలో సరైన సౌకర్యాలు లేక మూత పడిందని ఆయన గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మరలా దానిని ఆధునీకరించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు.




