ములాఖత్ వల్ల జైలులోని సాధారణ ఖైదీలకు ఇబ్బంది అనడంపై టీడీపీ మండిపాటు
జైళ్ల శాఖ డిఐజికి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేతల వినతి పత్రం
రాజమహేంద్రవరం:- తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే లీగల్ ములాఖత్ లను కుదించడంపై టీడీపీ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు తన కేసుల్లో సరైన విధంగా న్యాయ పోరాటం చేయకుండా చూడడం కోసమే ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి లీగల్ ములాఖత్ పై ఆంక్షలు పెట్టిందని పార్టీ నేతలు ఆరోపించారు. 39 రోజులుగా జైల్లో ఉన్న చంద్రబాబును రోజూ రెండు సార్లు తన అడ్వకేట్లు కలుస్తున్నారు. అయితే నిన్నటి నుంచి రోజుకు ఒక్క సారి మాత్రమే ములాఖత్ ఉంటుందని అధికారుల తేల్చి చెప్పారు.
చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతున్నారని….వీటిపై పోరాటం కోసం ఆయన నిత్యం న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని నేతలు చెప్పారు. అయితే ప్రభుత్వం లీగల్ ములాఖత్ లను తగ్గించడం ద్వారా లీగల్ ఫైట్ లో చంద్రబాబు ముందుకు వెళ్లకుండా చూడాలన్న కుట్ర చేసిందని నేతలు ఆరోపించారు.
లీగల్ ములాఖత్ ల విషయంలో ఆంక్షలు తొలగించి… రోజుకు రెండు సార్లు ములాఖత్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు, ఇంచార్జ్ లు మంగళవారం జైళ్ల శాఖ డిఐజి రవి కిరణ్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు. చంద్రబాబు భద్రత, కుటుంబ సభ్యులకు కూడా మెడికల్ నివేదిక ఇవ్వకపోవడం వంటి అంశాలపై తగు చర్యలు తీసుకోవాలని డిఐజి కోరారు.
పార్టీ నేతలు నిమ్మకాలయ చినరాజప్ప, జవహర్, బుచ్చయ్య చౌదరి, జ్యోతుల నెహ్రూ, జోగేశ్వరరావు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బూరుగుపల్లి శేషారావు, ఎస్విఎస్ఎన్ వర్మ, బొడ్డు వెంకట రమణ చౌదరి, మద్దిపాటి వెంకట రాజు తదితరులు పాల్గొన్నారు.