Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ తొత్తులకు ఉద్యోగాల కోసం కార్పొరేషన్ పెట్టి దోచిపెట్టారు

– డిజిటల్ లైబ్రరీ కు కేటాయించిన రూ.750 కోట్లు సొమ్ములు ఏమయ్యాయి?
– నాకు నోటీసులు ఇచ్చిన వాసుదేవరెడ్డి అంతా కరెక్ట్ గా చేస్తే ఎందుకు పారిపోయాడు?
– చిన్న వాసుదేవరెడ్డి, దేవేందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ లాంటి నేతలను డిజిటల్ కార్పొరేషన్ ద్వారా పోషించారు.
– గూగుల్ లో “పొలిటికల్ యాడ్స్” ఇవ్వొచ్చా?
– యాడ్స్ ను గూగుల్ ఎందుకు తొలగించింది?
• గడిచిన ఐదేళ్లలో వ్యవస్థలను, కార్పొరేషన్ లను జగన్ రెడ్డి సర్వనాశనం చేశాడు
• కంటెంట్ కార్పొరేషన్ గా ఉన్నదాన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరు మార్చి దోచుకున్నారు
• ఒక చిన్న కార్పొరేషన్ లో 129 మంది ఉద్యోగులను తీసుకొని లక్షల్లో జీతాలు చెల్లించారు
• సగంమంది ఆఫీసుకు రాకుండా జీతాలు చెల్లించారు
• చైర్మన్, వైస్ చైర్మన్ల ఇళ్లలో ట్యూషన్ చెబుతున్న టీచర్లకు కార్పొరేషన్ నుండి జీతాలు చెల్లించారు
• ప్రకటనల పేరుతో సాక్షి పేపర్ కు, ఐ ప్యాక్ కు కోట్లు కట్టబెట్టారు
• భార్య భర్తల స్కీమ్, ఫ్యామిలీ స్కీమ్ లను అమలు చేశారు
• ఒక యూట్యూబ్ నడుపుకునే వ్యక్తికి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టి ఇదంతా చేశారు
– ఆ బకాసురులపై చర్య తీసుకోవాల్సిందే
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ సంచలన ఆరోపణలు

అస్మదీయులకు ఉద్యోగాల కోసం ఏకంగా కార్పొరేషన్ పెట్టి కోట్ల రూపాయల ప్రజాధనం కొల్లగొట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్ రెడ్డి ప్రభుత్వమేనని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు.

కంటెంట్ కార్పొరేషన్ గా ఉన్నదాన్ని ఏపీ డిజిటల్ కార్పొరేషన్ గా పేరు మార్చి వైసీపీ సోషల్ మీడియా టీమ్, సాక్షిలో పనిచేసిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టి జగన్ కు డబ్బా కొట్టించుకోవడం తప్ప డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ప్రజలకు జరిగిన మేలు ఒక్కంటే ఒక్కటి కూడా లేదన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

నీలాయపాలెం విజయ్ కుమార్ మాట్లాడుతూ.. తమ పార్టీలోని వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి కార్పొరేషన్ పెట్టి ఏరకమైన క్వాలిఫికేషన్ లేకుండా.. ఉద్యోగుల్లో మూడోవంతు ఆఫీసుకు రాకుండా లక్షల జీతాలు చెల్లిస్తూ దోచిపెట్టారు. అస్మదీయులకు ఉద్యోగాలు కట్టబెట్టి, అక్రమంగా యాడ్ లు ఇచ్చి కోట్ల ప్రజాధం కొల్లగొట్టారు. వైసీపీ సోషల్ మీడియా కోసం డిజిటల్ కొర్పొరేషన్ ను ఉద్యోగ పునరావాస కేంద్రంగా వాడుకున్నారు. తమ వారికోసం ఏకంగా ఒక కార్పొరేషన్ ను పెట్టిన ఘనుడు ఈ జగన్ మోహన్ రెడ్డి.

ఐడ్రీమ్ అనే యూట్యూబ్ ఛానల్ ను నిర్వహించే వ్యక్తికి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ప్రభుత్వ సొమ్మును యథేచ్ఛగా కొల్లగొట్టారు. ప్రభుత్వం మారిన వెంటనే సగం మంది రిజైన్ చేసి వెళ్లిపోయారు. దోచుకున్నన్ని రోజులు దోచుకుని, ప్రభుత్వం మారగానే పారిపోయారు. సాక్షికి ఇచ్చే యాడ్లకే కాకుండా జగన్ రెడ్డికి మేలు చేసేందుకు గూగుల్ యాడ్లకోసం కోట్లు ఖర్చు పెట్టారు. డిజిటల్ కార్పొరేషన్ ను అస్తవ్యస్తంగా తయారు చేసి దోచుకున్నారు.

డిజిటల్ కార్పొరేషన్ లో చేరిన చాలా మంది ఉద్యోగులకు ఏరకమైన క్వాలిఫికేషన్ లేదు. చైర్మన్, వైస్ చైర్మన్ ఇళ్లలో పిల్లలకు ట్యూషన్ చెప్పే టీచర్లను డిజిటల్ కార్పొరేషన్ లో ఉద్యోగులుగా చూపించి జీతాలు చెల్లించారు. 129 మంది లో 49 మంది ఆఫీసుకే రారు. కార్పొరేషన్ లో కపుల్ పాలసీ ఉంది. భర్త ఉద్యోగానికి వస్తే భార్య ఆఫీసుకు రానక్కరలేదట. అలాగే ఫ్యామిలీ పాలసీని కూడా తీసుకొచ్చారు.. సిస్టమ్స్ మెయింటన్ చేసే వ్యక్తి కుటుంబంలో ముగ్గురికి ఉద్యోగాలు ఇచ్చారు.

ఒకే పనిచేసేవారికి ఒకే రకమైన జీతాలు లేవు… ఒక వ్యక్తి లక్షరూపాయాలు ఇస్తే మరో వ్యక్తికి 40 వేలు ఇచ్చారు. ఇంకొకడికి 23 వేలు ఇచ్చారు. జగన్ కు భజన చేసేందుకు నాలుగు సంవత్సరాల్లో రూ. 500 కోట్లు ఖర్చుపెట్టి కొల్లగొట్టారు. 500 వెబ్ సైట్ లకు డబ్బులు ఇచ్చి, కార్పొరేషన్ డబ్బులను దోచి పెట్టారు. గూగుల్ తో పాటు, ఐ ప్యాక్ కు కూడా యాడ్స్ రూపంలో కార్పొరేషన్ నుండి డబ్బులు చెల్లించి, జగన్ రెడ్డికి డబ్బాకొట్టి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు.

బయట సాక్షి పేపర్ ఎలా ఉందో… ప్రభుత్వం లోపల డిజిటల్ కార్పొరేషన్ ను అలా తయారు చేశారు. అందులో ఉండేవారందూరు సాక్షి సోషల్ మీడియాలో పనిచేసేవారే. ప్రభుత్వ కార్యకలాపాల ప్రచారం కోసం అంటూ జగన్ కోసం పనిచేశారు. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారు. డిజిటల్ కార్పొరేషన్ లో అంతా ఖర్చే. ఆదాయం లేదు.

డిజిటల్ కార్పొరేషన్ ద్వారా చేసింది జగన్ రెడ్డికి డబ్బా కొట్టడమే. ఇది ఒక కార్పొరేషన్ చేయాల్సిన పనేనా? కార్పొరేషన్ ఎందుకు పెట్టారు? జగన్ రెడ్డికి వ్యక్తిగత పూజ చేయడానికా? ఒక ప్రభుత్వ కార్పొరేషన్ గా ఉండి గూగుల్ లో “పొలిటికల్ యాడ్స్” ఇవ్వొచ్చా అనేది ప్రశ్న. డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చిన యాడ్స్ ను గూగుల్ ఎందుకు తొలగించింది? జగన్ రెడ్డికి డబ్బాకొట్టే యాడ్ లు అనే కదా?

డిజిటల్ కార్పొరేషన్ ఏం చేయాలి ? పల్లెల్లో డిజిటల్ లైబ్రరీలను పెట్టాలి, పల్లెల్లో డిజిటల్ క్లాసుల ఏర్పాటు కోసం కృషి చేయాలి. కానీ అది ఎక్కడా కనిపించలేదు. డిజిటల్ లైబ్రరీ కు కేటాయించిన రూ.750 కోట్లు సొమ్ములు ఏమైయ్యాయో తెలియదు. జగన్ కు భజన చేసి అప్పనంగా బొక్కేసిన సొమ్మంతా మాఫీ కావాల్సిందేనా? ప్రశ్నించినందుకు నాకు నోటీసులు ఇచ్చిన చిన్న వాసుదేవరెడ్డి అంతా కరెక్ట్ గా చేస్తే ఎందుకు పారిపోవాల్సి వచ్చింది?

టీడీపీ నేతలపై నోరు పారేసుకున్న చిన్న వాసుదేవరెడ్డి, దేవేందర్ రెడ్డి, ఇంటూరి రవికిరణ్ లాంటి నేతలను జగన్ రెడ్డి డిజిటల్ కార్పొరేషన్ లద్వారా పోషించారు. దీనికి సహకరించిన అధికారులు, దోచుకున్న నేతలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

LEAVE A RESPONSE