– మన సమాజం మొత్తం సితార జమిందార్ల సమూహమే
– సంపాదన పెంచటం చేతగానప్పుడు కనమని అడిగే హక్కు లేదని గ్రహిస్తే మంచిది
ఇది ఆ కాలానికి పెద్దాయన వ్రాసిన మాట. కానీ నేలకి గీతలు గీసి వేలం వేస్కుంటున్న ఈ రోజుల్లో – నేటి సమాజానికి ఇదెలా వర్తిస్తుంది …???
ప్రపంచ దేశాలన్నీ జనాభా తగ్గటంతో – పిల్లలని కనటానికి ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి . కరెక్టే …
కానీ – మనం మనల్ని వాళ్ళతో పోల్చుకునేటప్పుడు కాస్తలో కాస్తంతన్నా – వాళ్ళ క్రమశిక్షణనీ, నిబద్ధతనీ కలిగుండాలిగా ..??
మన దేశంలో జనాభా తగ్గిపోతున్నారు కాబట్టి ఒక్కొక్కరూ ముగ్గురు నలుగురిని కనండని చెబుతున్నారు . పిల్లల బాధ్యత మాదే అని ఎలక్షన్ హామీలు కూడా ఇచ్చేస్తున్నారు
కానీ – మన దేశంలో ఉపాధి అవకాశాల స్థాయేంటో ?? ఈ మాటలు మాట్లాడుతున్న ఏ ఒక్కడికన్నా తెలుసా ..??
గత మూడు దశాబ్ధాలుగా ప్రభుత్వ ఉపాది హామీ పథకం అంటే పల్లెటూర్లో చెరువుల్లో పూడికలు తీయంచే దగ్గరే ఆలోచన ఆగిపోయిన దేశంలో…
ఉపాదికి – సంపాదనకీ – పేదరికానికీ సరైన నిర్వచనం ఇవ్వలేని సన్నాసుల పాలనలో – అంతంత మందిని కనిపారేస్తే ఎవడమ్మ మొగుడొచ్చి పోషిస్తాడని అనుకుంటున్నారు ..???
ప్రభుత్వాలు ఉన్న ఉద్యోగాలకి నోటిఫికేషన్లు డిజైను చేసే సరికే – డిగ్రీ చదివిన సన్నాసికి రిటైర్మెంటు వయసొచ్చేస్తుంటే … ఏం పెట్టి పోషిస్తాడు ..??
గత దశాబ్ధ కాలంగా దేశంలో ప్రైవేటు కంపెనీల్లో బేసిక్ ఎలిమెంటరీ లెవల్ ఉద్యోగం తాలూకా మినిమం జీతం అనేది నెలకి 15 వేల రూపాయలు దాటలేదన్న సంగతి ఒక్కడికన్నా తెలుసా ..???
ఉద్యోగం – ఉపాధి అంటే వేలల్లో రోడ్ల మీద కనిపిస్తున్న గంట కూలీలైన ఫుడ్ డెలివరీ బాయ్స్ – బైక్ టాక్షీవాలాలే అనుకుంటే ప్రభుత్వాన్ని నడిపే వాళ్ళని మ్యూజియంలోనో లేకపోతే పురావస్తు శాఖ వారి అలమరాల్లోనో పెట్టాల ..??
సగటు నగరంలో సింగిల్ రూమ్ 5 వేల రూపాయలకి దొరకటం గగనమైపోయిన ఈ కాలంలో…
ఓ కుటుంబం నెలకి సగటున 15 నుండి 30 వేల రూపాయల జీతంతో – నెలలో రెండవ వారం రాకమునుపే అప్పులతో బతుకులీడుస్తున్నాయని ఎవడికన్నా తెలుసా ?
గత దశాబ్ద కాలంలో పెరిగిన – ధరలకీ , పెరగాల్సిన జీతాలకీ మధ్య అంతరం ఎంతుందో ఏ ఒక్కడి దగ్గరన్నా సరైన రిపోర్టుందా ? రికార్డుందా ?
ఒక పూటకి చాలీ చాలని జీతాలంటూ ఏడుస్తున్న మధ్య తరగతిని మరో మెట్టు ఎదగకుండా – వారి రక్తం పీలుస్తున్న టాక్సు అనబడే జలగని అదుపు చేయటం చేతగాని వాళ్ళంతా కూడా పిల్లలనీ కనమని చెప్పటం హాస్యాస్పదం కాదూ …???
వాళ్ళదేం పోయింది – పురిటి నొప్పులు – భుజాల బరువులూ వాళ్ళవి కావుగా …
చివరికి ముష్టివాడు కూడా తన కడుపున పుట్టిన పిల్లలని తనకన్నా ఓ మెట్టు పైనే చూస్కోవాలనే అనుకుంటాడు.
కానీ నూటికి 90% మధ్య తరగతిని అడగండి – గడిచిన దశాబ్ధ కాలంలో వారి బ్రతుకులు ఎన్ని మెట్లు కిందకి జారాయో చూపిస్తారు …
ఒక్కటంటే – ఒక్క రంగంలోనన్నా చెప్పుకోదగ్గ ఉపాది అవకాశాలున్నాయా?
అలాగనీ – దేశంలోఎవడూ ఉద్యోగాలు చేయటం లేదా అంటే చేస్తున్నారు – వడ్డీల కోసం , ఈయంఐల కోసం , రెంటు కరెంటుల కోసం …
సేవింగ్స్ అన్నమాట పెద్ద బూతులా వినపడుతుందొక్కొక్కడికీ.
కార్పొరేటు ఉద్యోగి జీతం ఆడి బట్టల ఇస్త్రీ కీ , బూట్ పాలిష్ లకీ , క్లీన్ షేవ్ లకే సరిపోదు.
ప్రతి వాడికీ బయట తొడుక్కునే ఇస్త్రీ కోటే కనీపిస్తుంది కానీ – లోపల ఉన్న బొక్కల బనీన్లెవడికీ కనపడవు.
ప్రభుత్వాలు ఒక్కసారి మూసుకుపోయిన తమ కళ్ళని విశాలం చేస్కుని ” జాబ్ పోర్టల్సు – రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లూ ” అందులో వాళ్ళు ఆఫర్ చేసే జీతాలూ చూడండి …
సిగ్గుకే సిగ్గొచ్చి సిగ్గుతో చచ్చిపోయే స్థాయిలో ఉంటాయి ఆ ” పే స్కేల్స్ …”
ఇది వరకు కేజీ కూర కొనుక్కున్న కుటుంబాలు – పావుకేజీతో పూట గడుపుకుంటున్నాయంటే బూతు కాదు .
ఇలాంటి బతుకు బతుకుతున్న మధ్య తరగతి ఇప్పుడు ముగ్గురు నలుగురుని కనాలా ? తలా పిడికెడు రేషను బియ్యం పోసేస్తే పోషించేసినట్టేనా ?
పోనీ – గత దశాబ్ధ కాలంలో ప్రభుత్వాలేమన్నా పీకి కట్టలు కట్టేసే స్థాయిలో పెట్టుబడులు , కంపెనీలనేమన్నా తెచ్చి చచ్చారా అంటే …
వాడు తెచ్చిన దాన్ని వీడు గెంటేయటం – వీడు తెచ్చిన దాన్ని వాడు గెంటేయటం …
సంపాదన పెంచటం చేతగానప్పుడు – కనమని అడిగే హక్కు లేదని గ్రహిస్తే మంచిది.
సంపద పెంచటం అంటే భూముల రేట్లు – రిజిష్ట్రేషన్ చార్జీలు – టాక్షులు – లిక్కరు ధరలు పెంచుకు దొబ్బటం కాదు మేష్టారూ?!
ఆ కాలంలో జనాలకి చావంటే భయం ఉండేది – ఇప్పుడు బ్రతుకంటే …
సరిగ్గా కళ్ళు తెరిచి చూడండి – మన సమాజం మొత్తం సితార జమిందార్ల సమూహమే …!!!
@ నాలోనేను