– దమ్ముంటే సుప్రీం కోర్టుకు వెళ్ళండి….. సిఎం గారూ
– సత్తా ఉంటే మూడుముక్కలాటతో ఎన్నికలకు పోండి ….ముఖ్యమంత్రి గారూ
– విభజన మంటల కోసం శాసన సభ ను వేదిక చేస్తారా?
– చట్ట సభల సాక్షిగా రాజధాని పై విషం కక్కుతారా?
– అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య
తాను చేపట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని, వస్తుందనుకున్న దింపుడు కళ్ళం ఆశలు కూడా ఆవిరయ్యాయని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పేర్కొన్నారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యున్నత హైకోర్టు రాజధాని మార్పుకు రెండవ సారి శాసనసభకు అధికారం లేదని మాత్రమే చెప్పిందని, అలాంటి మార్పు జరగాలంటే విభజన చట్టం తెచ్చిన పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని చెబితే, తీర్పును వక్రీకరించి, చిలువలు, పలువలు చేసి న్యాయస్థానం పైనే ప్రభుత్వం దాడికి దిగిందని ఆరోపించారు. కేవలం మూడు ప్రాంతాలలో విభజన మంటలు రాజేసేందుకే శాసనసభను ముఖ్యమంత్రి వేదికగా వాడుకున్నారని తెలిపారు.
హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించటమో,లేకుంటే సుప్రీంకోర్టుకు వెళ్ళటమో వంటి ప్రజాస్వామిక ప్రక్రియలకు తిలోదకాలు ఇచ్చి న్యాయ వ్యవస్థను ప్రజల్లో పలుచన చేసే దుర్మార్గానికి రాష్ట్ర ప్రభుత్వం ఒడిగట్టిందని ఆరోపించారు. దమ్ముంటే వైకాపా ప్రభుత్వం హైకోర్టు తీర్పు పై సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చని, సత్తా ఉంటే ఎన్నికల కూ పోవచ్చని సలహా ఇచ్చారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని అంటూనే రాజ్యాంగం పొందుపరచిన న్యాయవ్యవస్థపై విషం చిమ్మారని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును కూడా స్మరించే అర్హత కూడా లేదన్నారు. వెర్రి తలలు వేస్తున్న ప్రభుత్వ పాలన రెండేళ్ల లో న్యాయస్థానంలో ఓడినట్లే ప్రజాక్షేత్రంలోనూ ఓడిపోక తప్పదని చెప్పారు.