కోర్టులపై అక్కసేల?

శాసనసభలో జరిగిన చర్చను చూస్తున్నప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రజా రాజధాని అమరావతిని శాసన, పాలనా రాజధానిగా కొనసాగించి 3 నెలల్లో రైతులకు ప్లాట్లు ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా శాసనసభలో రాజధాని పై చర్చ జరపడం రాష్ట్ర ప్రభుత్వ దురాలోచనకు, కక్షపూరిత చర్యలకు నిదర్శనం.

వ్యవస్థల మీద జగన్‌రెడ్డికి గౌరవం లేదన్న విషయం నేడు మరోసారి స్పష్టమైంది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై 6 గంటలు చర్చించి తమ పాండిత్యాన్నంతా ఒలకబోశారు. శాసనసభకు చట్టం చేసే అధికారం లేదని హైకోర్టు చెప్పిందని ముఖ్యమంత్రితో సహా అందరూ గంటల తరబడి మాట్లాడారు.

– హైకోర్టు తీర్పును గమనించినప్పుడు 3 విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి…
1. ఆర్టికల్‌ 258(3) ప్రకారం పార్లమెంటు ‘‘ఒక రాజధాని
(ఎ క్యాపిటల్‌)’’ను నెలకొల్పుకోవడానికి శాసనసభకు ఇచ్చిన అధికారాన్ని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ వినియోగించుకుని అమరావతిని రాజధానిగా ఏకగ్రీవంగా ఎంచుకున్నది. దీనిపై మరల చట్టం చేసి దానిని మార్చడానికి గానీ, విభజించడానికి గానీ ఈ శాసనసభకు అధికారం లేదు. ఆర్టికల్‌(4) కింద ఈ విషయంపై సర్వ హక్కులు పార్లమెంటుకు మాత్రమే ఉన్నాయి.
… that the parliament delegated power to State under Article 258 (2) of the Constitution of India, which is a one time delegation. (పేజి నెం.300, పేరా 506)
దీనిని వక్రీకరించి శాసనసభ అధికారాలపై హైకోర్టు పెత్తనం చేస్తోందని, ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, దాని హక్కులను కాలరాస్తోందని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి విఫలయత్నం చేస్తున్నారు.

వీళ్లు వ్యవస్థల గురించి, వ్యవస్థల పరిధుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. వీరి పరిపాలనలో ఏ వ్యవస్థకైనా రక్షణ ఉందా? ఎలక్షన్‌ కమిషన్‌ నుంచి మొదలుపెట్టి న్యాయ వ్యవస్థ, పంచాయతీరాజ్‌ వ్యవస్థ… అన్నింటినీ నిర్వీర్యం చేశారు.

వ్యవస్థల మీద గౌరవం, నమ్మకం ఉన్నవాళ్లు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై 6 గంటలపాటు చట్ట సభల్లో చర్చ కొనసాగిస్తారా?హత్య కేసుపై దర్యాప్తు చేస్తున్న సీబీఐపై కేసులు పెడతారు. ఎన్నికల కమీషనర్‌కు దురుద్దేశాలు ఆపాదిస్తారు. న్యాయ వ్యవస్థను దిగజారుస్తూ, భయపెడుతూ సోషల్‌మీడియా ప్రచారం చేస్తారు.

సాక్షాత్తూ సొంత పార్లమెంటు సభ్యులను పోలీసుల చేత కొట్టిస్తారు. ప్రతిపక్ష నాయకుల కుటుంబ సభ్యులపై అసభ్య వ్యాఖ్యానాలు చేస్తారు. చట్టసభల్లో ప్రజా సమస్యల్ని చర్చించడానికి అవకాశం లేకుండా మందబలంతో వారి హక్కులను హరిస్తారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను అమలు చేయమని అడిగితే అరెస్టులు చేస్తారు, జైలులో పెడతారు.

2. సీఆర్‌డీఏ, రైతుల మధ్య జరిగిన 9.1 ఒప్పందం ప్రకారం నిర్దిష్ట కాల పరిమితిలో రాజధానిని అభివృద్ధి చేసి ప్లాట్లను అంగీకరించిన పద్ధతిలో రైతులకు అందజేయాలి. దీనిని నిర్దిష్ట కాలపరిమితిలో ముగించాలి.
When the State and APCRDA failed to maintain the trust and acted against good governance and violated the constitutional trust, the Court while exercising extraordinary jurisdiction under Article 226 of the Constitution of India, can issue appropriate direction to complete the development activities including infrastructure in the land pooled within the specified time. (పేజి 304, పేరా 508(జి)
ఈ ఒప్పందం ఉల్లంఘన జరిగినప్పుడు సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఈ షరతులను ఉల్లంఘించి రాజధానికి భూములిచ్చిన రైతులను తీవ్రమైన ఆర్థిక, సామాజిక బాధలకు గురిచేస్తున్నప్పుడు ఆర్టికల్‌ 226 కింద న్యాయ స్థానాలకు జోక్యం చేసుకునే హక్కు ఉంటుందని న్యాయస్థానం చెప్పింది.
– దీనిలో వీళ్ల హక్కులను హరించడమేముంది? ప్రజల హక్కులను హరిస్తున్న ప్రభుత్వాల నుంచి ఈ రాష్ట్రంలో కోర్టులు జోక్యం చేసుకోవడంలో ఆశ్చర్యమేముంది?
రాజ్యాంగం ఇచ్చిన హక్కులను పరిరక్షించడం భారత రాజ్యాంగం ప్రకారం కోర్టుల ప్రాథమిక విధి. వారి విధిని వారు నిర్వర్తిస్తున్నప్పుడు వారికి నీతి పాటాలు చెప్పడం తీవ్ర అవివేకం.

3. తమకు ఏకైక జీవనాధారమైన పూర్వీకులు/స్వార్జితంతో సమకూర్చుకున్న వ్యవసాయ భూములను రాష్ట్రానికి మంచి జరగాలన్న ఉద్దేశ్యంతో ల్యాండ్‌ పూలింగ్‌ ద్వారా ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ద్వారా తమ భూమిని మాస్టర్‌ ప్లాన్‌లో చెప్పిన విధంగా జరుగుతుందని వారు ఆశిస్తారు. దీన్నే ‘లెజిటిమేట్‌ ఎక్స్‌పెక్టేషన్‌’ అనే న్యాయసూత్రం కింద కోర్టు వారు అభిప్రాయ పడ్డారు.
…When the respondents – State and APCRDA failed to keep up their promise and are acting to defeat the legitimate expectation of the petitioners, the Court can issue appropriate direction to the State and APCRDA, to comply with the terms of Development Agreement-cum-Irrevocable General Power of Attorney in Form 9.14, APCRDA Act, Land Pooling Rules, 2015 while exercising extraordinary power under Article 226 of the Constitution of India. (Page No.302, Para 508(d).
ప్రజా రాజధాని అమరావతిని మార్చమని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఊరూరా ప్రచారం చేసిన జగన్‌రెడ్డి అధికారంలోకి రాగానే 3 రాజధాను లంటూ విధ్వంసకర రాజకీయాలకు తెరలేపారు. 800 రోజులు దాటి పోరాటం చేస్తున్న రాజధాని మహిళలు, రైతులను ఎన్ని రకాలుగా హింసించారో తలుచుకుంటేనే బాధగా ఉంది.

మహిళలని కూడా చూడకుండా బూటుకాళ్లతో తన్నించారు. స్నానాల గదిపైకి డ్రోన్లు ఎగురవేశారు. చివరకు తిరుపతి వేంకటేశ్వరస్వామి చెంతకు వెళుతుంటే కూడా భోజనానికి కూడా స్థలమివ్వకుండా రోడ్లపై భోజనం చేసేలా అవమానించారు.

ఈరోజు అసెంబ్లీలో చెబుతున్నారు… ఈ ప్రాంతంపై ఆయనకు ప్రేమ ఉందట… అందుకే ఇల్లు కట్టుకున్నాడంట… శాసన రాజధాని ఇక్కడే ఉంచుతాడట… ఏదో సామెత చెప్పినట్లు అందరూ ఎప్పుడూ మోసం చేయలేరు… ఈ 3 సంవత్సరాల కాలంలో మీ నిజస్వరూపాన్ని అన్ని వర్గాల వారు గ్రహించగలిగారు.

జ్యుడీషియల్‌ రివ్యూ అనేది భారత రాజ్యాంగంలో భాగమే. హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద ఏమైనా అసంతృప్తి ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది. కానీ అసెంబ్లీలో కూర్చుని సుదీర్ఘ ప్రసంగాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏమిటి?

న్యాయ వ్యవస్థ అన్నింటిలో జోక్యం చేసుకుంటోందా?
రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులపై అసభ్యకరమైన భాషతో ధూషించి వారి విధులు నిర్వహించుకోవడానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన వారిపై కేసు నమోదు చేయకుండా నిందితులకు అండగా నిలబడడం మీ సంయమనమా?

ప్రజా రాజధానిగా అమరావతిని ఆమోదిస్తూ 2016లో నిండు శాసనసభలో ఏకగ్రీవంగా ఓటు వేశారు. అధికారంలోకి రాగానే మాట మార్చి గత ప్రభుత్వ హయాంలో భూములిచ్చిన రైతులతో న్యాయ, రాజ్యాంగబద్ధంగా జరిగిన ఒప్పందాలను నిర్వీర్యం చేయడం వ్యవస్థలను గౌరవించినట్లా?

న్యాయబద్ధంగా ప్రజలకు చెందిన ఆస్తులను ప్రభుత్వ అవసరాలకోసం యధేచ్ఛగా అమ్ముకోవచ్చు. కానీ మీకు మాత్రం న్యాయ సూత్రాలు వర్తించవా?రాజ్యాంగబద్ధంగా ప్రజలకు వచ్చిన పాధమిక హక్కులను కాలరాస్తూ నిర్భంధాలకు మీరు పాల్పడవచ్చు. కానీ ప్రజలకు స్వేచ్ఛ ఉండరాదు.

ఒప్పందాలకు విరుద్ధంగా కోవిడ్‌ సమయంలో ప్రాణాధారమైన మందులు, ఇతర పరికరాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు, గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించినటువంటి కాంట్రాక్టర్లకు, బిల్లులు ఎగ్గొట్టే మీరు న్యాయ వ్యవస్థకు నియంత్రణ కావాలంటారా?

చట్టసభలు ప్రజాస్వామ్యయుతంగా పనిచేయనప్పుడు, ప్రతిపక్ష పార్టీల నేతలను చట్ట సభల్లో, వెలుపల విధులు నిర్వహించకుండా అడ్డుపడుతూ న్యాయ వ్యవస్థ సంయమనంగా ఉండాలనడం, ప్రజలను నిర్ధాక్షిణ్యంగా కాల్చి పారేయడానికి గన్‌ లైసెన్స్‌ అడగడమే.

వికేంద్రీకరణ కాదు… అది విధ్వంసం
అసెంబ్లీలో జరుగుతున్న చర్చ వికేంద్రీకరణపై కాదు… అది విధ్వంసంపై జరుగుతోంది. 101 మంది ఉన్న కౌరవులు ఎట్లా కనుమరుగయ్యారో 151 మంది ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే పరిస్థితి ఏర్పడుతుంది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును గౌరవించి వెంటనే రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేయాలి.

– శ్రీధర్

Leave a Reply