Suryaa.co.in

Andhra Pradesh

ఎన్టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీని 1వతేదీ ఉ.6గం.లకే ప్రారంభించాలి

  • ఆగస్టు నెలకు 64.82లక్షల పింఛన్లకు రూ.2737.41 కోట్లు విడుదల
  • 1వతేదీనే 96శాతం పంపిణీ,2వ తేదీతో నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి
  • పింఛన్ల పంపిణీ ప్రక్రియలో జిల్లా కలక్టర్లు పాల్గొనాలి
  • పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి
  • గత నెలలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్

అమరావతి: ఆగస్టు 1వ తేదీన ఉదయం 6గం.లకే ఎన్టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు 1వతేదీనే 96శాతం పైగా పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు.

పింఛన్ల పంపిణీపై మంగళవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగష్టు నెలకు సంబంధించి 64 లక్షల 82 వేల 52 వివిధ రకాల పింఛన్లు పంపిణీకి రూ.2737.41 కోట్లను విడుదల చేయడం జరిగిందని ఈమొత్తాన్నిబుధవారం మధ్యాహ్నం లోగా డ్రా చేసేందుకు ఎల్డియంలతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు.

గ్రామ,వార్డు సచివాలయ సిబ్బంది 1వతేదీ ఇంటింటా వెళ్ళి 96 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని,2వతేదీన నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు.ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు స్వయంగా పాల్గొనాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.

పింఛన్ల పంపిణీకి సంబంధించి జూలై నెలలో పశ్చిమ గోదావరి, కడప, అనంతపురం జిల్లాల్లో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

ఆ సంఘటనలకు సంబంధించి బాధ్యులపై ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు వారిని విధుల నుండి సస్పెండ్ చేసినందున, తదపురి క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫించన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని సిఎస్ స్పష్టం చేశారు.

వర్చువల్ గా పాల్గొన్న రాష్ట్ర పంచాయితీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ ఫించన్ల పంపిణీకి సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఇప్పటికే జిల్లా కలక్టర్లకు తగు ఆదేశాలు జారీ చేశామని వివరించారు.

జూలై మాసంలో పింఛన్ల పంపిణీకి సంబంధించి సర్వర్ డౌన్ కావడంతో ఆధార్ అధంటికేషన్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, వాటిని అధికమించేందుకు యుఐడిఎఐ అధికారుల సమన్వయంతో తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో సెర్ప్ సిఇఓ జి.వీరపాండ్యన్,ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి జె.నివాస్, జిల్లా కలక్టర్లు,డిఆర్డిఏ పిడిలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE