• కమిషన్ నివేదికలపై సత్వర చర్యలు
• గ్రంథాలయాల పూర్వ వైభవానికి ప్రణాళిక
• అవుట్ సోర్సింగ్ ద్వారా సిబ్బంది నియామాకం
• డిజిటైజేషన్, భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత
• సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విజయవాడ, జూన్ 13
పాఠశాల విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు, తీసుకోవాల్సిన చర్యలపై విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షక కమిషన్ సమగ్రమైన సిఫారసులు చేయాలని విద్యా శాఖ మంత్రి బొత్ససత్యనారాయణ అన్నారు. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో పాఠశాల విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్, విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ లతో కలిసి సోమవారం నాడు విద్యా కమిషన్ కార్యక్రమాలు, గ్రంథాలయాల నిర్వహణ అంశాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలోనే మొదటి సారిగా విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచలనలకు అనుగుణంగా కమిషన్ క్రియాశీలకంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కమిషన్ సభ్యులు క్షేత్ర స్థాయిలో జరిపిన పరిశీలనలు, తనిఖీల్లో కనుగొన్న అంశాలపై సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో కమిషన్ పలు ఇంటర్మీడియట్ కళాశాలలు, పాఠశాలలను తనిఖీ చేసి పలు లోపాలను గుర్తించి నివేదికలు అందచేసింది. కమిషన్ క్రియాశీలకంగా పనిచేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.
విద్యా కమిషన్ వినూత్నమైన ఆలోచనలతో ప్రభుత్వానికి సిఫారసులు చేయాలన్నారు. ఈ సందర్భంగా కమిషన్ సిఇఒ ఎ. సాంబశివారెడ్డి, వైస్ చైర్ పర్సన్ డా. విజయశారద రెడ్డి లు కమిషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాలపై పవర్ పాయింట్ ద్వారా వివరించారు.
అనంతరం గ్రంథాలయాల స్థితిగతులను సమీక్షిస్తూ రాష్ట్రంలోని గ్రంథాలయాల పునరుజ్జీవనానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని, మంచి ఆకృతులతో కొత్త భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలను రూపొందించాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. గ్రంథాలయాలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు అనువుగా అవసరమైన సిబ్బందిని అవుట్ సోర్సింగ్ ద్వారా నియమించుకునే అవకాశాన్ని పరిశీలిస్తామన్నారు.
డిజిటైజేషన్ ప్రక్రియ, ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి తీసుకుని వచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పాఠశాలలతో గ్రంథాలయాలను ఇంటిగ్రేట్ చేయాల్సిన ఆవశ్యకతను మంత్రి గుర్తు చేశారు. గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ ఎం.శేషగిరిరావు, డైరక్టర్ ఎం.ఆర్.ప్రసన్న కుమార్ రాష్ట్రంలోని గ్రంథాలయాల తీరు తెన్నులను వివరించారు.