Suryaa.co.in

Telangana

వ్యాక్సిన్ మొదటి డోస్ 100 శాతం పూర్తి చేయడంలో డాక్టర్ల కృషి అభినందనీయం

కరోనా సమయంలో వైద్యులు చేసిన సేవలు వెలకట్టలేనివి
రెండో డోస్ కూడా వెంటనే 100 శాతం పూర్తి చేయాలి
వ్యాక్సిన్ వేసుకున్నామని నిర్లక్ష్యం తగదు..ఒమిక్రాన్ ముప్పు పొంచి ఉంది..కరోనా జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి
రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, డిసెంబర్ 14 : కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, కుటుంబాలకు దూరంగా ఉంటూ డాక్టర్లు చేసిన కృషి అభినందనీయమైందని, వారి సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోస్ 100 శాతం సాధించడంలో వైద్యుల కృషి మరువలేనిదన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డొస్ 100% సాధించి మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలో 10వ స్థానం చేరుకున్న సందర్భంగా నేడు ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ ఆవరణలో జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన జరిగిన అభినందన కార్యక్రమంలో మంత్రి పాల్గొని, వైద్యులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతమని, అందులోనూ జిల్లాలోనే అత్యంత మారుమూల మండలాలైన కొత్తగూడ, గంగారం సిగ్నల్ లేని ప్రాంతాలని, అటువంటి ప్రాంతాలలోనే ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేసి నూరు శాతం వ్యాక్సినేశన్ పూర్తి చేయడం పట్ల వైద్యులను ప్రత్యేకంగా అభినందించారు. కోవిడ్ సమయంలో వైద్య సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అయినా ఆత్మవిశ్వాసంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా చేయడంలో, వైద్యులకు నిత్యం స్ఫూర్తినిస్తూ ప్రోత్సహించడంలో జిల్లా కలెక్టర్ శశాంక గారు బాగా పని చేసి విజయవంతమయ్యారని అన్నారు. ఇదే స్ఫూర్తితో రెండవ డోసు కూడా 100 శాతం పూర్తి చేయాలన్నారు.
రైతులు పండించిన పంటలో ప్రతి గింజ కొంటామని, రైతులు అధైర్య పడవద్దని మంత్రి అన్నారు. యాసంగిలో పండించే ధాన్యం భారత ఆహార సంస్థ కొనుగోలు చేయమని చెప్పినందున రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు చేపట్టి ఆర్థిక అభివృద్ధి సాధించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ, జిల్లాలో 18 సంవత్సరములు దాటిన వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేసి 100 శాతంతో ఉన్నామన్నారు. అదేవిధంగా రెండవ డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 3.20 లక్షల మందికి వేసి 56% గా ఉన్నామని, ప్రణాళికాబద్ధంగా చేపట్టినందున విజయానికి చేరువ అవుతున్నామని తెలియజేశారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నామని నిర్లక్ష్యం తగదని, ఓమిక్రాన్ మరోవైపు పొంచివుందని మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలన్నారు. అనంతరం మంత్రి వైద్య సిబ్బందిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు, ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకులు వెంకట రాములు, జిల్లా టీఎన్జీవోస్ నాయకులు వడ్డెబోయిన శ్రీనివాస్, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE