– ఉద్యాన శాఖ చొరవతో వెలుగులు
ఒక వైపు పంట పండితే, మరో వైపు గిట్టుబాటు ధర పలకక కన్నీరు పెట్టుకునే రైతన్నల కష్టాన్ని తీర్చేందుకు రాష్ట్ర ఉద్యాన శాఖ ఓ కీలక అడుగు వేసింది. అరటి పంట మార్కెట్లో నెలకొన్న సంక్షోభం, ధరల ఒడిదొడుకులపై చర్చించేందుకు… ఏకంగా అన్ని ప్రధాన దళారీ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ గారు ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో S.K.Banana, INI, Nova, Sandriya Wegrow, Bhandhan వంటి బడా కంపెనీల ప్రతినిధులు, ఉద్యాన శాఖ అధికారులు పాల్గొన్నారు. కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ… నాణ్యత ఉన్న అరటిని మాత్రమే తాము రైతు నుండి ₹7.50/- నుండి ₹8.00/- వరకు కొనుగోలు చేయగలుగుతున్నామని తెలిపారు.
నాణ్యత లేని పంటకు లోకల్ ట్రేడర్స్ తక్కువ ధర ఇస్తున్నారని స్పష్టం చేశారు. నాణ్యత పెరిగితేనే దూర ప్రాంతాలకు ఎగుమతులు పెరుగుతాయి, అప్పుడే లోకల్ మార్కెట్లో కూడా ధర పెరుగుతుంది. లేదంటే రైతు నష్టపోతాడు” అంటూ డైరెక్టర్ గారు అన్ని జిల్లాల ఉద్యాన అధికారులకు ఒక స్పష్టమైన ఆదేశాన్ని ఇచ్చారు.
ప్రతి రైతు ‘ఫ్రూట్ కేర్ యాక్టివిటీ’ (పండ్ల నాణ్యత మెరుగు పరిచే పద్ధతులు) తప్పనిసరిగా పాటించేలా చూడాలి! ఈ పద్ధతులు పాటిస్తే అరటి నాణ్యత పెరిగి, మార్కెట్లో మంచి ధర రావడానికి అవకాశం ఉంటుందని వివరించారు. ఈ నాణ్యమైన పండు దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ మనకు బలమైన స్థానాన్ని ఇస్తుందని తెలిపారు. డిసెంబర్ 15 నుండి శుభవార్త! ఏప్రిల్‌లో మన రాష్ట్రంలో వేసిన అరటి పంటకు ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది, చిల్లింగ్ ప్రభావం ఉండదు.
కానీ, మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో ఈ వాతావరణ సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల వారి నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి, మన రాష్ట్ర రైతులకు డిసెంబర్ 15 నుండి మార్కెట్లో మంచి ధర వచ్చే అవకాశం ఉందని డైరెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ మంచి ధరను అందిపుచ్చుకోవడానికి, ప్రతి రైతు మంచి వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా కృషి చేయాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఉద్యాన శాఖ ఆదేశాలు జారీ చేసింది.