దేశ సినిమాలో తొలిసారి అశోకుడు పాత్ర చేసింది ఎవరు?
షాహ్రుఖ్ ఖాన్ కాదు… 2001లో అశోకా అన్న హిందీ సినిమాలో షాహ్రుఖ్ ఖాన్ అశోకుడి పాత్ర చేశారు. అయితే ఆయన అశోకుడి పాత్ర చేసిన తొలి నటుడు కాదు.
ఎన్.టీ. రామారావా? కాదు! 1992లో ఎన్.టీ.ఆర్. ‘సామ్రాట్ అశోక’ సినిమాలో అశోకుడి పాత్ర చేశారు. కానీ ఆయన కూడా అశోకుడి పాత్ర చేసిన తొలి నటుడు కాదు.
అశోకుడి పాత్ర చేసిన తొలి భారతీయ నటుడు నాగయ్య!
1941లో వచ్చిన ‘అశోక్ కుమార్’ అన్న తమిళ్ష్ సినిమాలో నాగయ్య అశోకుడి పాత్ర చేశారు. అశోకుడి కొడుకు కునాలుడిగా సినిమా నాయకుడు తియాగరాజ బాగవదర్ చేశారు. కునాలుడిని మోహించే సవతి తల్లి తిశ్యరక్కిత పాత్ర కన్నాంబ చేశారు.
ఈ అశోక్ కుమార్ సినిమాకు కథను సమకూర్చిన కిషోర్ సాహు 1945లో ‘వీర్ కునాల్’ పేరుతో హిందీలో తీశారు. ఆ వీర్ కునాల్ సినిమాలో కిషోర్ సాహు కునాలుడిగానూ, అశోకుడిగా ముబారక్ నటించారు.
1941లో వచ్చిన ‘అశోక్ కుమార్’ తమిళ్ష్ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. ఆ సినిమాలో హీరో అయిన తియాగరాజ బాగవదర్ దక్షిణాదిలోనే కాదు దేశంలోనే తొలి సూపర్ స్టార్!
1935-44 వరకూ దేశంలో తియాగరాజ బాగవదర్ వలే ప్రజాదరణ పొందిన సినిమా నటుడు లేడు. అప్పటికి నాగయ్య కూడా తెలుగులో ఎంతో ఖరీదైన, ప్రజాదరణ ఉన్న నటుడే. కానీ తియాగరాజ బాగవదర్ అంత కన్నా ఖరీదైన, ప్రజాకర్షణ, ప్రజాదరణ ఉన్న నటుడు. పన్నీటి స్నానం, పంచ కళ్యాణి గుఱ్ఱంపై వీధుల్లో తిరగడం, పదివేళ్లకూ వజ్రపుటుంగరాలు, బంగారు కంచాల్లో భోజనాలు, విపరీతమైన స్త్రీ సాహచర్యం, సిరిసంపదలు వీటితో ఆయనంత వైభవంగా బతికిన సినిమా హీరో ఆయన కాలంలో మరొకరు లేరేమో?
తియాగరాజ బాగవదర్ నటించి 1944లో విడుదలైన ‘హరిదాస్’ సినిమా 110 వారాలు ఆడింది! ఇది ఎన్.టీ.ఆర్ ‘పాండురంగ మహత్యం’గా తెలుగులో రీమేక్ అయింది. 1944లో లక్ష్మీకాన్దన్ అన్న వ్యక్తి హత్య కేసులో జైలుపాలైన తియాగరాజ బాగవదర్ అటు తరువాత అతి తీవ్రంగా పతనమయ్యారు. ఎంతో ఘనంగా బతికిన నాగయ్య కూడా ఒక దశ తరువాత అతి దారుణంగా పతనం అయ్యారు.
నాగయ్య… దేశ సినిమాలో అశోకుడిగా నటించిన తొలినటుడు నాగయ్య.
– రోచిష్మాన్
9444012279