– హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత
మంగళగిరి: నేరస్తులు, నేర చరిత్ర కలిగినవారు అధికార ముసుగులో వ్యవస్థల్ని దుర్వినియాగం చేసిన వారు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడటం సిగ్గు చేటుని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. విజనరీ చంద్రబాబునాయుడు తన విజన్తో పోలీస్ వ్యవస్థతో సహా వ్యవస్థలన్నిటినీ పునరిద్ధరిస్తుంటే బాబాయిని చంపించిన వారు, గత ఐదేళ్లలో మహిళలపై జరిగిన వేల నేరాలపై స్పందించని పులివెందుల ఎమ్మెల్యే ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు.
ఇంకా, ఆమె ఏమన్నారంటే… 2014-2019 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు శాంతి భద్రతల రక్షణ కోసం టెక్నాలజీని ఉపయోగించేలా పోలీస్ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారు. 2014-2019 మధ్య సీసీటీఎన్‌ఎస్‌లో డేటా అప్లోడ్ చేయడంలో దేశంలోనే నెంబర్ వన్ గా ఉంది. జన సమూహం ఎక్కువగా ఉండే చోట ఫింగర్ప్రింట్స్ సిస్టం కిట్ తో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులని గుర్తించటం సులువయ్యేది.
జగన్మోహన్రెడ్డి వచ్చాక ఫింగర్ప్రింట్స్ సిస్టం మైంటెనెన్సు కోసం ఐదేళ్ల కాలానికి 10 కోట్లు ఖర్చు పెట్టకుండా ఆ వ్యవస్థని మూలన పెట్టిన వ్యక్తి ఈ రోజు శాంతి భద్రతల గురించి మాట్లాడటం సిగ్గు చేటు. క్రైమ్ స్పాట్ వెహికల్స్, నిందితులని త్వరగా పట్టుకోవటానికి ఉపయోగపడే ఫోరెన్సిక్ కిట్ వీటన్నిటికి ఐదేళ్ల కాలం పాటు డబ్బులివ్వని పరిస్థితి.
చంద్రబాబు నాయుడు హయాంలో సుమారు అత్యాధునిక సాంకేతికత కలిగిన 14 వేల సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేశారు. వీటికి కూడా ఐదేళ్ల కాలం పాటు మైంటెనెన్సు లేక అవి పని చేయని దుస్థితి. జగన్ రెడ్డి ఇంటి చుట్టూ 12 కోట్లతో ఫెన్సింగ్ వేసుకుంటారు కానీ రాష్ట్ర భద్రత కోసం 10 కోట్ల రూపాయలు ఇవ్వటానికి చేతులు రాలేదని మండిపడ్డారు. పోలీస్ శాఖ రూ.
జగన్ రెడ్డి పాలనలో పోలీసులకు ఇవ్వాల్సిన డీఏలు, సరెండర్ లీవులకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కి 700 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టదమే కాకుండా సీసీ కెమెరాలను కంట్రోల్ చేసే ఫాల్కన్ వెహికల్స్, హాక్ వెహికల్స్ ను, ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ సిస్టం, ఈ బీట్స్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు, అప్పా , గ్రే హౌండ్స్ వీటన్నిటినీ నిర్వీర్యం చేసారన్నారు.
కేవలం అమరావతిలో ఉందన్న అక్కసుతో జగన్ రెడ్డి ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణాన్ని నిలిపేశారని, పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడ్డ చందాన తయారు కర్నూల్ జిల్లా తాళ్లూరు పోలీసుస్టేషన్ లో 75 లక్షల విలువ చేసే వెండి మాయమయిందని అన్నారు.
2019-2024 మధ్య దేశం లో ఎక్కడ డ్రగ్స్, గంజాయి పట్టుబడ్డా ఆ మూలాలు ఆంధ్ర నుంచి అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఆఫ్గనిస్తాన్, బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ , గంజాయి రవాణాలో వైసీపీ నేతల హస్తముంది. సెబ్ పేరుతో కాలయాపన చేసి రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చారు. జగన్ రెడ్డి చేసిన పాపాలు రాష్ట్రాన్న్ని శాపంలా వెంటాడుతున్నాయి. జగన్ రెడ్డి హయాంలో నడిరోడ్డు మీద హత్యలు, అత్యాచారాలు,అఘాయిత్యాలు జరిగేవి. జగన్ రెడ్డి ఇంటికి కూత వేటు దూరంలో గంజాయి బ్యాచ్ అత్యాచారం చేస్తే ఒక్క మాట మాట్లాడలేదు.
జగన్ రెడ్డి పాలనలో ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం మహిళలు, చిన్నారుల మీద 2,04,418 నేరాలు నమోదయ్యాయి. ఐదేళ్లపాటు జరిగిన నేరాలలో ఒక్క సంఘటనపై మాట్లాడని వ్యక్తి ఇప్పుడు శవ రాజకీయం కోసం ప్రాకులాడడానికి సిగ్గు పడాలన్నారు. బెంగళూరులో రెస్ట్ తీసుకుంటూ విజిటింగ్ కి రాష్ట్రానికి వచ్చే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గురించి, లోకేష్ గురించి, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడటం సిగ్గు చేటు. ఆర్ధికంగా రాష్ట్రం ఇబ్బందులలో ఉన్నా చంద్రబాబు నిధులిచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ ని పటిష్ఠం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రం కోసం ఏం చేస్తుందో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు.