Suryaa.co.in

Editorial

నవ్వుల పాలవుతున్న..నాలుగో సింహం

– నలుగుతున్న నాలుగో సింహం
– ఏపీలో ‘లా’ ఒక్కింతయు లేదన్న విమర్శలు
– ఎంపీ రఘురామకృష్ణంరాజుపై భౌతికదాడి ఆరోపణలు
– ఆ మేరకు లోక్‌సభ స్పీకర్, ప్రివిలేజ్ కమిటీకి రాజు ఫిర్యాదు
– టీడీపీ ఆఫీసుపై రౌడీ మూకల దాడి
– డీజీపీ ఆఫీసుకు కూతవేటులోనే టీడీపీ రాష్ట్ర కార్యాలయం
– విపక్ష నేత చంద్రబాబుపై ఖాకీల సమక్షంలోనే రాళ్ల దాడి
– అధికార పార్టీ శ్రేణుల బరితెగింపును అడ్డుకోని పోలీసులు
– విపక్ష నేతలకు భద్రత కల్పించే బాధ్యత పోలీసులకు లేదా?
– ఇప్పటికే పోలీసుల తీరుపై ఎస్పీజీకి భద్రతాదళాల ఫిర్యాదు
– విపక్ష నేతల పర్యటనల్లో అధికార పార్టీ నేతలు వినతిపత్రాలిస్తారట
– ఇదెక్కడి సంప్రదాయం సారూ?
– లోకేష్ పర్యటనపైనా ఆగని రాళ్ల దాడులు
– పవన్ పర్యటనలకూ అడుగడుగునా అడ్డంకులు
– విపక్ష నేతల పర్యటన మార్గంలో అధికార పార్టీ శ్రేణులకు అనుమతులా?
-సీఎం పర్యటనకు ముందు విపక్ష నేతల గృహనిర్బంధం
– మరి విపక్ష నేతల పర్యటనల ముందు అధికార పార్టీ నేతలను గృహనిర్బంధం చేయరేం?
– వైఎస్ జమానాలోనూ కనిపించని విధేయత
– ఆంధ్రాలో అప్రతిష్ఠ పాలవుతున్న నాలుగో సింహం
( మార్తి సుబ్రహ్మణ్యం)

కనిపించని నాలుగో సింహం ఇప్పుడు ఆంధ్రాలో అప్రతిష్ఠపాలవుతోంది. వైఎస్, కాంగ్రెస్ జమానాలో సమన్యాయం పాటించిన నాలుగో సింహం, ఇప్పుడు కేవలం అధికార పార్టీ కోసం సింహగర్జన చేస్తోంది. విపక్ష నేతల పర్యటనలకు భద్రత కల్పించాల్సిన నాలుగో సింహం.. వారిపై రాళ్లదాడి చేస్తుంటే ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. చంద్రబాబునాయుడు.. పవన్ కల్యాణ్.. లోకేష్. పేర్లు ఏదైతేనేం? వారిపై అధికార పార్టీ జరిపే రాళ్ల దాడిలో నిస్సహాయురాలవుతోంది. నిందితులపై లాఠీ ఎత్తాల్సిన చేతులు.. ముద్దాయిలపై కేసులు పెట్టాల్సిన వేళ్లు, అధికార పార్టీ నేతలకు సాగిలపడుతోన్న వైనం విమర్శల పాలవుతోంది. అధికార పార్టీ ఒత్తిళ్లకు నలిగిపోతోంది. ఫలితంగా.. ఆంధ్రాలో ‘లా’ ఒక్కింతయు లేదన్న అప్రతిష్ఠ మూటకట్టుకుంటున్న దుస్థితి.

ఏ రాష్ట్రంలోనయినా వీవీఐపీలు, కేంద్రభద్రత ఉన్న ప్రముఖులకు.. ఆయా రాష్ట్రాల పోలీసులు భద్రత కల్పించడం సర్వ సహజం. సదరు ప్రముఖుల పర్యటన పూర్తయ్యేవరకూ ఒళ్లు దగ్గరపెట్టుకుని, కళ్లల్లో దివిటీలు వేసుకుని మరీ కాపలా కాస్తారు. వారి పర్యటనలో ఏమైనా అపశృతి దొర్లితే, తమ పరువు పోతుందన్న భయం. తమ రాష్ట్ర పోలీసులు, ఇతర రాష్ట్రాల ముందు నవ్వులపాలవుతారన్న ఆందోళన. అందుకే ప్రముఖుల పర్యటనలో పోలీసులు, రాజకీయ పార్టీలకు అతీతంగా బందోబస్తు చేస్తుంటారు.

అంటే ఆ ప్రకారంగా.. ముందే పర్యటనల షెడ్యూలు వివరాలు తీసుకుని, ఆ మార్గంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తుంటారు. ఇతర పార్టీల నుంచి ఆ ప్రముఖులకు ఇబ్బంది ఉందన్న సమాచారం ఉంటే, వారిని గృహనిర్బంధాలు చేసి, వీఐపీల పర్యటన ముగిసిన తర్వాత వదిలిపెడుతుంటారు. అదే ఎస్పీజీ- సీఆర్పీఎఫ్ వంటి భద్రతలో ఉన్న ప్రముఖుల పర్యటనలకయితే, ఒళ్లు దగ్గరపెట్టుకుని మరీ భద్రత కల్పిస్తారు. దానికోసం అత్యంత కఠినంగా వ్యవహరిస్తారు.

అధికార పార్టీ వారైనా సరే.. వీఐపీ పర్యటనలకు అడ్డు వస్తారన్న సమాచారం ఉంటే, వారిని నిర్దాక్షిణ్యంగా గృహనిర్బంధం చేస్తారు. అసలు ఆ మార్గంలో మరే ఇతర పార్టీల కార్యక్రమాలు అనుమతించరు. నిరసన కార్యక్రమాలనయితే అసలు అంగీకరించరు. కనీసం ఎదుటపడే అవకాశం కూడా ఇవ్వరు. ఇవన్నీ ఎక్కడైనా, ఏ రాష్ట్ర పోలీసులయినా సహజంగా తీసుకునే జాగ్రత్తలే. ఇవన్నీ కనిపించని నాలుగో సింహం పనితీరు గురించి అందరికీ తెలిసిన అంశాలే.

కానీ ఏపీలో మాత్రం అందుకు రివర్సు. వీవీఐపీలు-కేంద్ర భద్రత ఉన్న ప్రముఖులకు ఎదురెళ్లి, వారిపై అధికార పార్టీ శ్రేణులు రొమ్ము విరుచుకుది, రాళ్లు విసురుతుంటే.. పోలీసుల సాక్షిగానే భౌతిక దాడులకు దిగితే ఖాకీలు కళ్లు తెరవరు. ప్రేక్షకపాత్ర నుంచి బయటకు రారు. అంతా అయిపోయిన తర్వాత తీరిగ్గా బాధితులపైనే లాఠీలకు పనిచెప్పి, వారిపై కేసులు పెట్టే విచిత్ర సంస్కృతి, సహజంగానే పేరుగొప్ప నాలుగోసింహాన్ని నవ్వులపాలు చేస్తోంది. ఇలాంటి ఘటనలు ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇటీవలి కాలం వరకూ ఎవరూ చూసి ఉండరు.

అసలు పాలకుల విధానాలకు వ్యతిరేకంగా పర్యటించే నేతల వద్దకు, అదే పాలకపార్టీ నేతలు ఎదురెళ్లి వినతిపత్రాలు ఇస్తామంటే, వారిని అడ్డుకునే బదులు.. అనుమతించడం బహుశా దేశంలో ఇదే తొలిసారి కావచ్చు. విపక్ష నేతలకు ఎదురెళ్లి అధికార పార్టీ నేతలు వినతిపత్రాలివ్వడం ఏమిటో.. వారిని పోలీసులు అడ్డుకోకుండా, మహదానందంగా పంపించడం ఏమిటో ఎవరికీ అర్ధం కాని కొత్త సంప్రదాయం!

డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలోనే ఉండే టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో.. వైసీపీ శ్రేణులు స్వైరవిహారం చేసి, అద్దాలు-తలుపులు పగులకొట్టి, పొట్టకూటి కోసం పనిచేసే సిబ్బందిపై కర్రలతో దాడి చేసి అరాచ కం సృష్టిస్తే, ఇప్పటిదాకా నిందితులను శిక్షించకపోవడం, సహజంగా పోలీసుల విశ్వసనీయత-చిత్తశుద్ధిని ప్రశ్నించే పరిణామమే. ఈ ఘటన తర్వాత ఎస్పీజీ అధికారులు పార్టీ ఆఫీసుకు వచ్చి పరిశీలించడంతోపాటు, బాబు భద్రతపై ఆరా తీయడం, రాష్ట్ర పోలీసులకు తలవంపులే కదా?

ఒకవేళ ఆ మరుసటిరోజు ఆ చర్యకు ప్రతి చర్యగా.. టీడీపీ శ్రేణులు కూడా కిరాయిమూకలను, అక్కడికి దగ్గర్లోనే ఉన్న వైసీపీ ఆఫీసుపై ఉసిగొల్పితే, ఆ తర్వాత తలెత్తే శాంతిభద్రతల సమస్యకు జవాబుదారీ ఎవరు? అప్పుడు కూడా పోలీసులు ప్రేక్షకపాత్రే వహిస్తారా? అన్న అప్పటి ప్రశ్నలకు ఇప్పటిదాకా జవాబు లేదు.

హైకోర్టు న్యాయమూర్తులపై వెకిలి పోస్టింగు పెట్టి, వారి విశ్వసనీయతను దారుణంగా దెబ్బతీసిన అధికారపార్టీ కార్యకర్తలపై.. ఇప్పటివరకూ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. పైగా ఈ విషయంలో సీఐడీ చేతులెత్తేస్తే, హైకోర్టు ఆ విచారణను సీబీకి అప్పగించడం రాష్ట్ర పోలీసులకు నామర్దా కాక మరేమిటి?
సీఎంపై సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టారన్న కారణంతో వృద్ధులు, వికలాంగులు, విద్యార్ధులపై కేసులు పెట్టే పోలీసుల ఉత్సాహం.. హైకోర్టు జడ్జిలపై పోస్టింగులు పెట్టిన వారి విషయంలో, ఎందుకు నీరుగారిపోయిందన్న ప్రశ్నలు వినిపించడం సమంజసమే కదా?

సొంత పార్టీ సర్కారుపై సమరశంఖం పూరించిన ఎంపీ రఘురామకృష్ణంరాజును, అత్యంత అమానుషంగా కొట్టిన వైనం పరిశీలిస్తే.. ధీర చరిత్ర గల పోలీసు వ్యవస్థ, తమ పైవారిని మెప్పించే పనిముట్టులా మారిందన్న విమర్శలను కొట్టివేయలేం. ఎంపి రాజు మరింత కసితో సొంత పార్టీ సర్కారుపై, రోజూ రచ్చబండతో చాకిరేవు పెట్టడానికి ప్రేరణ కూడా అదే కావడాన్ని విస్మరించకూడదు.

ఆ ఘటన జరగకపోతే, ఈరోజు ఎంపీ రాజు అదేపనిగా.. జగనన్న సర్కారులో జరుగుతున్న వ్యవహారాలను, ప్రతిరోజూ కేంద్రం వద్ద దండోరా వేసేవారు కాదేమో. తనను అన్యాయంగా జైలుకు పంపించారన్న కసితో, జగనన్న పోరాడి అధికారం సాధించారు. అలాంటి కసి ఇతరులకూ ఉంటే.. ఫలితాలు కూడా అలాగే ఉంటాయని ఎందుకు భావించకూడదన్నది మేధావుల ప్రశ్న. అహం దెబ్బతింటే ఎవరు ఎందాకైనా వెళతారనడానికి.. అప్పుడు జగన్, ఇప్పుడు రాజు పోరాటాలే చక్కటి ఉదాహరణలు.

ప్రజలెన్నుకున్న ఒక ఎంపీని.. ఏళ్ల తరబడి తన నియోజకవర్గానికి రాకుండా, పకడ్బందీ కేసులతో కాళ్లకు బంధనాలు బిగించడం, ప్రజాస్వామ్యానికి శోభనివ్వదు. రాజకీయాల్లో ప్రత్యర్ధులుగా ఉండాలే తప్ప, శత్రువులుగా ఉండకూడదు. అది ఎవరికీ మంచిది కాదు. ఇలాంటి పలుకులన్నీ పాలకులకు బహుశా అప్రియంగా తోచడంలో ఆశ్చర్యం లేదు. ఎంపి రాజుకు ధనబలం-రాజకీయ బలం-ప్రజాస్వామ్యప్రియుల అండ ఉన్నాయి కాబట్టి, ఆయన వాటిని ఎదుర్కోగలరు. కానీ అదే స్థానంలో సాధారణ వ్యక్తి ఉంటే, అతని పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న.

మార్గదర్శి కేసులో, అత్యుత్సాహం ప్రదర్శించవద్దన్న కోర్టు ఆదేశాలు కూడా ధిక్కరిస్తున్న వైనం పరిశీలిస్తే.. పోలీసులు ఇక ఎవరి ఆదేశాలు పాటిస్తారన్న అనుమానాలు తలెత్తక తప్పదు. రామోజీరావును విచారించే సమయంలో తీసిన వీడియోలు, ఎంచుకున్న టీవీ చానెళ్లలో వచ్చాయంటే, పోలీసులు ఎవరి కోసమో పనిచేస్తున్నారన్న ఆనుమానం, మెడపై తల ఉన్న ఎవరికైనా రావటం సహజం. వివేకా హత్య కేసు విచారిస్తున్న సీబీఐ ఎస్పీ పైనే కేసులు పెట్టి, న్యాయస్థానంతో అక్షింతలు వేయించుకున్న పోలీసు వ్యవస్థలో, మార్పు కోరుకోవడం అత్యాశ కాదు.

చివరాఖరకు.. గ్రామాల్లో అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వుకుంటున్న, ఇసుక లారీలను అడ్డుకుంటున్న సొంత పార్టీ నాయకులపైనే, పోలీసులు కేసులు పెట్టడం మరో వింత. అసలు ఇసుకకు-పోలీసులకు సంబంధం ఏమిటన్నది ప్రశ్న. ఇటీవల ఇసుక అంశం రెవిన్యూ పరిథిలోనిదని గనుల శాఖ పెద్దాఫీసరు రెడ్డిగారు మీడియా ముఖంగా సెలవిచ్చారు.

అయినా పోలీసులకు.. ఇసుక రీచ్‌ల దగ్గర ఏం పని అని ప్రశ్నించిన వాడు, పాపాత్ముడి కింద లెక్క. గ్రామస్తులు ఇసుక ట్రాక్టర్లు పట్టుకుని పోలీసుస్టేషన్లలో అప్పగిస్తే, వారిపై చర్యల కొరడా ఝళిపించని పోలీసులపై, చివరకు అధికార పార్టీ నేతలు కూడా కన్నెర్ర చేస్తున్నారంటే.. ఇంత శ్రమదానం చేసి పోలీసులు సాధించిందేమిటన్నది ప్రశ్న.

సహజంగా వీవీఐపీలు, కేంద్ర బలగాల భద్రత ఉన్న వారి పర్యటన మార్గంలో ఇతర పార్టీల కార్యక్రమాలు, ప్రదర్శనలను అనుమతించరు. ఒకవేళ ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే, వారిని అరెస్టు చేసి మరొక స్టేషన్‌కు తరలిస్తారు. ముందుగా ఇచ్చిన రూట్‌ను క్లియర్ చేసి, వీఐపీల పర్యటనను సజావుగా ముగిసేలా చూడాల్సిన బాధ్యత నిస్సందేహంగా పోలీసులదే. అయితే, మంత్రులు- ఎమ్మెల్యేల మెరమెచ్చుల కోసం.. ముందుగా ఖరారు చేసిన రూట్‌ను దారిమళ్లించడం, అటు వెళ్లకుండా పోలీసులే బ్యారికేడ్లు అడ్డువేయడం తెంపరితనమే.

అసలు రోడ్లుకు అడ్డుగా లారీలు పెడితే, ట్రాఫిక్ పొలీసులు వాటిపై చలాన్లు వేస్తుంటారు. కానీ ఏపీలో పోలీసులే కొన్నిచోట్ల, విపక్ష నేత పర్యటన సమయంలో రోడ్డుకు అడ్డుగా లారీలను నిలపడం.. ఇన్నేళ్ల పోలీసు చరిత్రలో ఎవరూ విని-చూసి ఉండరు. బహుశా ఇప్పుడు డీజీ, ఏడీజీ, ఐజీలుగా పనిచేస్తున్న వారి సర్వీసులో కూడా, ఇలాంటి వింత దృశ్యాలను చూసి ఉండరు. చేసి ఉండరు కూడా.

కానీ విపక్ష నేత చంద్రబాబునాయుడు- లోకేష్-జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలో ఇలాంటి వింత దృశ్యాలను చూసే, భాగ్యం కల్పించిన పోలీసులకు సెల్యూట్ కొట్టాల్సిందే. చంద్రబాబు, లోకేష్ పర్యటనల్లో వారిపై అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లు రువ్వడం వంటి చర్యలను చూస్తుండటం వల్ల, అభాసుపాలయ్యేది పోలీసుల ప్రతిష్ఠనే. వారిద్దరే కాదు. ఆ స్థానంలో ఇంకెవరు ఉన్నా, వారిపై దాడి జరుగుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం అప్రతిష్ఠనే.

తండ్రీకొడుకులపై రాళ్ల దాడిలో, భద్రతా సిబ్బంది మేల్కొని రక్షణ కవచంలా ఏర్పడ్డారు కాబట్టి సరిపోయింది. అదే వారిద్దరికీ గాయాలయితే, అప్పుడు జాతీయ స్థాయిలో నగుబాటు పాలయ్యేది మన పోలీసుల ప్రతిష్ఠనే కదా? అప్పుడు ఇతర రాష్ట్రాల పోలీసుల ముందు.. వీఐపీలకు భద్రత కల్పించలేని వారిగా, మన పోలీసులను చిన్నచూపు చూస్తే.. ఆ అవమానం వ్యక్తులకా? రాష్ట్రానికా?

మంచి పోస్టింగుల కోసం కొందరు అధికారులు, పాలకుల సన్నిధి చేరడం ఇదే మొదలు కాదు. దశాబ్దాల నుంచి జరుగుతున్న పరాధీన వ్యవహారమే. సూరిబావ మాదిరిగా.. పాలకుల కళ్లలో ఆనందం చూసే, అధికారుల సంఖ్య పెద్దదే కావచ్చు. కానీ అంతమాత్రాన పాలకులకు సాగిలబడాల్సిన పనిలేదు.

తాము లొంగినప్పుడు, తమతోపాటు నెత్తిన ఉన్న సింహాలు కూడా, లొంగుతాయన్న స్పృహ ఉంటే చాలు. చనిపోయినా ప్రజల గుండెల్లో, ఇప్పటికీ కొలువైన పోలీసు అధికారులు లేకపోలేదు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన, వారి చరిత్రను ప్రతి ఒక్కరూ నెమరువేసుకుంటారు.

పాలకుల మెరమెచ్చులకన్నా, ప్రజలిచ్చే జీతానికే విలువిచ్చే అధికారులూ లే కపోలేదు. ముక్కుసూటిగా పనిచేసే అధికారుల సంఖ్య కూడా తక్కువేం కాదు. ఎక్కడ పోస్టింగు వేసినా పనిచేసి, తమకొచ్చే జీతంతో తృప్తిపడే అధికారులూ లేకపోలేదు. ఈ తరహా అధికారుల జోలికి ఏ ప్రభుత్వమూ వెళ్లదు. కాకపోతే అలాంటి వారి సంఖ్య తక్కువగా ఉండటమే బాధాకరం.

అధికారం ఏ పార్టీకీ శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరు. అలా అనుకోవడం భ్రమ. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. పాలకుల దన్నుతో అధికారంలో ఉన్నప్పుడు వారికి శ్రమదానం చేసిన అధికారులకు, ఆ తర్వాత ఏగతి పట్టిందో ఇప్పటి అధికారులు చూస్తూనే ఉన్నారు.

అందులో కొందరికి ఇప్పటికీ పోస్టింగులు లేకపోతే, మరికొందరు అధికారులకు పాలకుల కాళ్లు పట్టుకుని, శరణు వేడితే గానీ పోస్టింగులు దక్కలేదు. విచిత్రమేమిటంటే… ఎవరికోసమైతే సదరు అధికారులు శ్రమదానం చేశారో.. వారెవరూ ఈ అధికారులను కాపాడకపోవడం!

రేపు అలాంటి అనుభవం.. ఇప్పటి అధికారులకు ఎదురుకాదన్న గ్యారంటీ ఎవరూ ఇవ్వలేరు. మితిమీరిన శ్రమదానం చేసిన వారికి, పోస్టింగులు దక్కుతాయన్న భరోసా కూడా ఉండదు. ఎందుకంటే.. నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష!

కాబట్టి ప్రజలు దైవంగా నమ్మే వ్యవస్థ, లొంగుబాటు దిశలో కాకుండా.. న్యాయం-ధర్మం దిశగా పయనిస్తే, ఆ కీర్తి పదికాలాలు పదిలంగా నిలుస్తుంది. నాలుగో సింహం నవ్వులపాలు కావడాన్ని ఎవరూ స్వాగతించరు!

LEAVE A RESPONSE