– బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
అమరావతి : బీసీలు ఆత్మగౌరవంతో జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. దొమ్మర అనే పదానికి గిరి బలిజను కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వుల జారీ చేయడంపై ఆ సామాజిక వర్గ ప్రతినిధులు హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు గురువారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవితను వారంతా కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దొమ్మర అనే కులం పేరుకు గిరి బలజ కలుపుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దొమ్మర(గిరి బలిజ)గా పేర్కొంటూ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.
బీసీల అభ్యున్నతికి గతంలో ఎన్నడూ లేనివిధంగా నిధులు మంజూరు చేస్తోందని, నూతన పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. త్వరలో ఆదరణ 3.0 పథకాన్ని శ్రీకారం చుడుతున్నామని, ఈ పథకంలో భాగంగా ఆధునిక పరికరాలు అందజేయబోతున్నామని వివరించారు. అంతకుముందు మంత్రి సవితను నవ్యాంధ్ర దొమ్మర కుల సంక్షేమ సంఘ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
తమ కులం పేరుతో దూషించడం వల్ల మానసికంగా ఎంతో క్షోభకు గురయ్యే వారమన్నారు. ఇదే విషయమై విషయమై గత ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే, దొమ్మరికి గిరి బలిజ పేరును కలుపుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంపై ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ.గోపాల్ హర్షం వ్యక్తంచేశారు. కుల ధ్రువీకరణ పత్రాలను దొమ్మరి(గిరి బలిజ)గా జారీచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొనడంపై ఆయన ఆనందం వెలిబుచ్చారు.
ప్రభుత్వ ఆదేశాలతో సమాజంలో తమ బిడ్డలు పడే ఆవేదనకు ఫుల్ స్టాప్ పడిందన్నారు. సీఎం చంద్రబాబుకు జీవితాంతం రుణపడి ఉంటామంటూ, జీవో జారీలో సహకరించినందుకు మంత్రి సవితకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర దొమ్మర కుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అన్నపురెడ్డి కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు అన్నపురెడ్డి మురళీ, ఎం.శ్రీనివాసరావు, సభ్యులు ఎగ్గిరెడ్డి రాజారత్నం, ఎ.సురేష్ తదితరులు పాల్గొన్నారు.