• దేశంలో సర్క్యులర్ ఎకానమీ అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఏపీ
• పాలసీ అమలుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో టాస్క్ ఫోర్స్
– పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి. కృష్ణయ్య
విజయవాడ: దేశంలో సర్క్యులర్ ఎకానమీ మరియు వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ (4.0) ని అందిపుచ్చుకుని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించనుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి. కృష్ణయ్య తెలిపారు.
గురువారం స్థానిక ఫార్చ్యూన్ మురళీ హోటల్ లో వివిధ కార్పొరేషన్స్ చైర్మన్లు, శాఖాధిపతులతో ఏర్పాటు చేసిన వర్క్ షాపులో చైర్మన్ పి. కృష్ణయ్య పాలసీపై చర్చించి అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పాలసీని రాష్ట్రంలో పగడ్బందీగా అమలు చేయడంతోపాటు సామాన్యులను భాగస్వామ్యులను చేసి లబ్ధి చేకూర్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు. పారిశ్రామిక రంగాల నుంచి వచ్చే వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేవిధంగా అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంకల్పమైన యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా పనిచేయడంతోపాటు, పర్యావరణ పరిరక్షణలో ఈ పాలసీ అమలు చేయడం జరుగుతుందన్నారు. సమావేశానికి వచ్చిన వివిధ సంస్ధల చైర్మన్లు, శాఖాధిపతుల సూచనల మేరకు రాష్ట్రంలో, జిల్లాలో చేపట్టే విధంగా చర్యలు చేపట్టడం జరగుతుందన్నారు.
రాబోయే రోజుల్లో స్వచ్ఛంధ సంస్ధల సహకారంతో పెద్ద ఎత్తున ఉపాధి కల్పన, వ్యర్ధాల నియంత్రణ, రీసైక్లింగ్ చేయడం వంటి కార్యక్రమాలతోపాటు రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్ధేశించుకున్న కార్యాచరణ ప్రణాళికను అమలు చేసే విధంగా కమిటీల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.
స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కే. పట్టాభిరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 149 ప్రకారంగా వేస్ట్ రీసైక్టింగ్ పాలసీని పటిష్టంగా అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కమిటీలో సభ్యులుగా రాష్ట్ర స్థాయిలో మంత్రులు, వివిధ సంస్థల చైర్మన్స్, పీసీబీ, పరిశ్రమల శాఖలో వారు సభ్యులుగా ఉంటారన్నారు.
ఈ పాలసీని ఎలా గ్రౌండ్ చేయాలి, పెట్టుబడులను ఏ విధంగా తీసుకురావాలో సమన్వయం చేస్తున్నామన్నారు. సీఎస్ఆర్, పీ4, 20 సూత్రాల అమలు అంశాలు సమన్వయం చేసుకుంటూ వెళతామన్నారు. ఇదొక మంచి శుభారంభమని రాబోయే రోజుల్లో సర్క్యులర్ ఎకానమీని ముందుకు తీసుకెళతామన్నారు.
20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సర్క్యులర్ ఎకానమీ-వేస్ట్ రీసైక్లింగ్ పై కార్యాచరణ ఎలా ఉండాలో అనే విషయంపై సమీక్షించామన్నారు. ప్రతి జిల్లాలో కామన్ గా ఉన్న వేస్టేజ్ ని గుర్తించే వారికి తోడ్పాటు అందించాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు గార్బేజ్ వేస్ట్, వ్యవసాయ వ్యర్ధాలు, రబ్బరు వేస్ట్, ఫార్మాస్యూటికల్ వేస్ట్ వంటివి కారణంగా ఉంటున్నాయన్నారు. కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో గ్రానైట్ వ్యర్ధాలను ఏ విధంగా రీసైక్లింగ్ చేసి వాటిని వాల్యూ ఎడిషన్ చేసి అదొక ఆదాయ వనరుగా చేయ వచ్చునన్నారు.
ఎమ్ఎస్ఎమ్ఈ చైర్మన్ టి. శివశంకర్ రావు మాట్లాడుతూ సరికొత్త ఆలోచనలతో వేస్ట్ మేనేజ్ మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ద్వారా పాలసీ తీసుకురావటం ముందుచూపుకు నిదర్శనమన్నారు. తొలిసారిగా రాష్ట్రంలో ఈ పాలసీని విజయవంతంగా అమలు చేస్తే దేశానికే మన రాష్ట్రం మార్గదర్శకంగా ఉంటుందన్నారు.
సీడాప్ చైర్మన్ జీ. దీపక్ రెడ్డి మాట్లాడుతూ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మంచి ఆవిష్కరణకు నాంది పలికిందన్నారు. దేశంలో 36 సెక్టార్స్ వాళ్లను రాష్ట్రంలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు తీసుకురావడంతో వాళ్లు చాలా సంతోషం వ్యక్తం చేశారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ధేశించిన లక్ష్యమైన రాష్ట్రంలో 20 లక్షల యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా సీడాప్ పనిచేస్తుందన్నారు. యువతకు శిక్షణ ఇచ్చి స్థానికంగా ఉపాధి కల్పించే విధంగా పనిచేస్తున్నామని తద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి తోడ్పడుతుందన్నారు.
పీ 4 ఫౌండేషన్ ఉపాధ్యక్షులు కుటుంబరావు మాట్లాడుతూ, దేశంలో సర్క్యులర్ ఎకానమీ తీసుకొచ్చిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. సర్క్యులర్ ఎకానమీ పై పీసీబీ సంస్ధ ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ లో అన్ని సంస్థల భాగస్వామ్యంతో పాలసీని ముందుకు తీసుకెళ్లాలన్నారు. భావితరాలకు గ్రీన్ ఎన్విరాన్ మెంట్ ను అందించేందుకు మనందరం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ఏపీ బయో డైవర్శిటీ బోర్డు చైర్మన్ ఎన్. విజయ్ కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై సర్క్యులర్ ఎకానమీ పాలసీ ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా చర్యలు ఉండాలన్నారు.
ముందుగా రాష్ట్రంలోని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్, స్కిల్ డవలప్ మెంట్, పీ4 ఫౌండేషన్, రాష్ట్ర బయోడైవర్శిటీ బోర్డు, ఏపీఐఐసీ, ఎమ్ఎస్ఎమ్ఈ వంటి తదితర విభాగాల ఛైర్మన్లు రాష్ట్రంలో పాలసీ అమలుపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)తో సమిష్టిగా చర్చించారు. ఈ సంస్ధలతోపాటు పరిశ్రమలు, సీడీఎమ్ఏ, హ్యాండ్లూమ్స్ , దేవాదాయ శాఖ తదితర విభాగాల అధికారులు పాల్గొని పాలసీ పై తమ అభిప్రాయాలను తెలియజేశారు.