– సీఆర్డీఏలో అవినీతి
– సీఆర్డీఓ కార్యాలయ ప్రారంభోత్సవ ఆహ్వానం ఏదీ?
– అభివృద్ధి కార్యక్రమాల్లో లోపించిన భాగస్వామ్యం
– పదిరోజుల్లో స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక
– తొలిసారి గళం విప్పిన అమరావతి రైతు జేఏసీ
– గుంటూరు భేటీలో తీర్మానాలు
అమరావతి రైతులు తొలిసారి ఘాటుగా స్పందించారు. ప్రభుత్వానికి బహిరంగంగా డిమాండ్లు ఇచ్చారు. ఇప్పటివరకు అత్యంత జాగ్రత్తగా వ్యవహారించాము. కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఆర్డీఏ కార్యాలయ ప్రారంభ సమయంలో ఈ విషయం సంచలనం అయ్యింది.
ప్రభుత్వ నిర్లక్ష్య విధానంపై ఆదివారం గుంటూరులో జరిగిన అమరావతి రైతు జెఎసి సమావేశం వివరాలు, తీర్మానాలు..
అమరావతి రైతులు తొలిసారి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదనీ, సీఆర్డీఓలో అవినీతి పెరిగిందని తీర్మానించారు. పది రోజుల్లో ప్రభుత్వం స్పందించక పోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
1. నూతన ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు అయినప్పటికీ అనేక సమస్యలు అనగా రైతులకు సంబంధించి పరిష్కరించబడలేదు.
2. అనేకసార్లు సిఆర్డిఏ అధికారులు మరియు గౌరవ మున్సిపల్‌శాఖ మంత్రి వర్యులకు వినతిపత్రములు మరియు, గ్రీవెన్స్ సదస్సులలోనూ, వారి దృష్టికి తీసుకువచ్చినా నేటి వరకూ పరిష్కారం కాలేదు.
3. అసైన్డ్ రైతుల సమస్య, కౌలు చెల్లింపు క్రమబద్దీకరణ, రోడ్డుపోటు ప్లాట్ల సమస్య, మరియు, ప్లాట్ల కేటాయింపు సమస్య, గ్రామ కంఠాల సమస్య, మరియు అసంబద్ధమైన ఎఫ్ఎస్ఐ విధానం, మరియు ఇతర సమస్యల పట్ల అధికారుల మరియు ప్రభుత్వ అలసత్వ ధోరణి, మరియు క్రిందిస్తాయి అధికారుల అవినీతి చర్యలపై నిర్లక్ష్య ధోరణి పట్ల రైతులు, రైతు కూలీలు ఆందోళన చెందుతున్నారు.
4. నూతన ప్రభుత్వం యొక్క అమరావతి అభివృద్ధి కార్యక్రమములలో లోపించిన రైతుల భాగస్వామ్యము, మరియు స్వయం ఉపాధి రూపకల్పనలో వైఫల్యం వల్ల రైతులు, రైతు కూలీలు ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించబడుతున్నారు.
5. అమరావతి ఉద్యమంలో ముందుండి పోరాడిన అమరావతి ఐక్య కార్యాచరణ సమితి(జెఎసి)పై తీవ్ర ఒత్తిడి వస్తున్నందువల్ల ఈ రోజు అనగా 12.10.2025వ తేదీన గుంటూరులో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిపి ఈ దిగువ తీర్మానములు ఏకగ్రీవంగా ఆమోదించబడినవి.
డిమాండ్లు
1. గౌరవ ముఖ్యమంత్రివర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మున్సిపల్‌శాఖ మంత్రి వర్యులు మరియు సంబంధిత ప్రజాప్రతినిధులు రైతు జెఎసితో రానున్న పదిరోజుల్లో అనగా వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయవలసినదిగా డిమాండు చేస్తున్నాము.
2. రైతు సమస్యలు పరిష్కారం గురించి చర్చించి కాలవ్యవథిని నిర్ణయించి అమలు చేయాల్సిందిగా డిమాండు చేస్తున్నాము
3.ప్రతి రెండు నెలలకు రైతు జెఎసితో సంయుక్త సమావేశం జరపాలని ఆ సమావేశంలో పురోగతిని సమీక్షించాలని కోరుతున్నాము
4.పై డిమాండ్లపై ప్రభుత్వ స్పందన వెంటనే లేని ఎడయ భూ సమీకరణకు భూమి ఇచ్చిన రైతులు, రైతు కూలీల విస్తృత సమావేశం జరిపి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను నిర్ణయించాలని తీర్మానించడం అయినది.
– వల్లభనేని సురేష్
సీనియర్ జర్నలిస్ట్
9010099208