– మున్సిపల్ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించాలి
– పార్టీ శ్రేణులకు కెటిఅర్ పిలుపు
– తెలంగాణ భవన్ సమావేశంలో కాంగ్రెస్, రేవంత్ రెడ్డిపైన విరుచుకుపడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్
– బీజేపీ నుంచి బీఆర్ఎస్ చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
హైదరాబాద్: రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గొప్ప విజయం సాధించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ పిలుపునిచ్చారు. రెండు సంవత్సరాాల్లో అన్ని రంగాల్లో విఫలం అయిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడి అద్భుతమైన విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ప్రజల గురించి పట్టించుకునే తీరిక, ఉద్దేశ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అందుకే ఇచ్చిన అన్నీ హమీలను తుంగలో తొక్కిందని కెటిఅర్ అన్నారు.
అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ కు ప్రజలు బుద్ది చెప్పి మున్సిపల్ ఏన్నికల్లో ప్రజకు బిఅర్ ఏస్ వెంట నిలబడతారని కెటిఅర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అందరు కలిసి సమిష్టిగా ఎన్నికల్లో పోరాడాలని కెటిఅర్ పిలపునిచ్చారు. కేవలం మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాకుండా రానున్న ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ జెండాకు, కారు గుర్తుకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌ను తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు.
రెండు సంవత్సరాలుగా రాష్ట్రంలో కాంగ్రెస్, 12 ఏండ్లుగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేయకుండా టైంపాస్ చేస్తున్నాయని, అందుకే తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తన అనుచరులతో కలిసి బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరగా, పార్టీ కండువా కప్పి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
తెలివిలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని, రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అందుకే గత ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలు చేస్తూ పరిపాలనను వదిలిపెట్టారని అన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాటి అమలును పూర్తిగా విస్మరించారని, హామీల అమలును ప్రశ్నిస్తే బెదిరింపులు, కేసులు, అబద్ధాలకు దిగుతున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పూర్తిగా అబద్ధాల మీద పరిపాలన చేయడం అలవాటు చేసుకున్నారని విమర్శించారు.
కేవలం పరిపాలన చేతగాక అప్పుల పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, కాగ్ (CAG) ఏజెన్సీలు నామమాత్రపు అప్పు మాత్రమే ఉందని చెబుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పుల సంఖ్య పెంచి తప్పుడు లెక్కలు చూపుతోందని కేటీఆర్ ఆరోపించారు. అయితే కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ప్రతి పైసా అప్పును సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే వినియోగించిందని గుర్తు చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి పథకాలు, విద్యాలయాలు, ఆసుపత్రులు నిర్మించామని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి రెండు సంవత్సరాల్లో తెచ్చిన రెండున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్టారా అని ప్రశ్నించారు. ఆ అప్పును ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం ఒక్క ప్రాజెక్టైనా నిర్మించారా? సంక్షేమంపై ఖర్చు చేశారా? అని నిలదీశారు.
ఆరూరి రమేష్‌కు స్వాగతం
తిరిగి పార్టీలోకి వచ్చిన ఆరూరి రమేష్‌కు కేటీఆర్ హృదయపూర్వక స్వాగతం పలికారు. రెండు సంవత్సరాల్లో బీజేపీ–కాంగ్రెస్ వైఫల్యాలను చూసిన తర్వాత ప్రజలంతా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని అన్నారు. ఆరూరి రమేష్ గతంలో వర్ధన్నపేట నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేశారని, దాదాపు లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన 16 ఓట్ల తేడాతో ఓడిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
కానీ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పాలనను చూసిన తర్వాత వర్ధన్నపేటలో మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. గతంలో పార్టీ నాయకులతో పాటు ప్రస్తుతం ఉన్న ప్రతి ఒక్కరినీ కలుపుకొని సమిష్టిగా ముందుకు వెళ్లి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించాలని ఆరూరి రమేష్‌ను కోరారు.