Suryaa.co.in

Andhra Pradesh

మాతో చర్చలకు ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో లేదు

– ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ

విజయవాడ : ఏపీ ఉద్యోగ సంఘం నేత, పీఆర్సీ సాధన సమితి ప్రతినిధి సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు జరపడానికి తాము సిద్ధంగానే ఉన్నామని, కానీ ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో లేదని వ్యాఖ్యానించారు. మాటలతో తమను చర్చలకు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు.

చర్చలు జరపడానికి ముందు ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.కాగితాలపై పుట్టిన సంఘాలతో చర్చించి న్యాయం చేసినా మంచిదేనని సూర్యనారాయణ అన్నారు. సమస్యలపై తాము ఇప్పటికే వందల సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చామని వెల్లడించారు.మేం ఇచ్చిన 859 అభ్యర్థనలు పెండింగ్ లో ఉన్నాయని సీఎస్ చెప్పారని వివరించారు.

ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పందిస్తూ..
ఉద్యోగుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాము చర్చలకు సుముఖంగానే ఉన్నామని, కానీ ఉద్యోగ సంఘాలే చర్చలకు రావడంలేదంటూ తమపైనే ఆరోపణలు చేస్తున్నారని వివరించారు.

ప్రభుత్వానికి మూడు డిమాండ్లపై లేఖ ఇచ్చి పరిష్కరించాలని కోరామని, చర్చలకు వచ్చేవారిని అవమానించవద్దని కోరుతున్నామని అన్నారు. ఇంతలా ఉద్యోగ సంఘాలను అవమానించడాన్ని ఎప్పుడూ చూడలేదని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు.

తాము చర్చలకు వచ్చినప్పుడు తమ డిమాండ్లు ఎందుకు పరిష్కరించలేదని ప్రశ్నించారు. 30 నెలల ఐఆర్ ను ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకున్నారని ఆరోపించారు. ఎప్పుడు చర్చలు జరిగినా తమను మోసం చేస్తూనే ఉన్నారని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాతజీతాలే ఇవ్వాలని బొప్పరాజు స్పష్టం చేశారు. తాము చర్చలకు ఎప్పుడూ సిద్ధమేనని ప్రకటించారు.

LEAVE A RESPONSE