ప్రభుత్వంలో విలీనం ఎందుకు తీసుకున్నామా అని ఆలోచించే పరిస్థితి
– ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు
పీఆర్సీ జీవోల రద్దు, ఇతర అంశాలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి.పీఆర్సీ సాధన సమితికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు తెలిపారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.
ఉద్యమంలో ఆర్టీసీ సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయని.. అన్ని రకాల ఆందోళనలకు పూర్తిగా మద్దతిస్తున్నట్లు చెప్పారు. రేపు, ఎల్లుండి నిరాహారదీక్షల్లో , ఫిబ్రవరి 3న చలో విజయవాడలో పాల్గొంటున్నట్లు తెలిపారు.
‘రివర్స్ పీఆర్సీతో జీతాలు తగ్గే పరిస్థితి’ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులను విలీనం చేస్తే మంచి జరుగుతుందని భావించామని.. విలీనానికి ఎందుకు అంగీకరించామా అని ఇప్పుడు ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు. ఉన్న సౌకర్యాలు కోల్పోతుంటే మేం కోరుకున్న విలీనం ఇదేనా?’ అని కార్మికవర్గాల్లో చర్చ జరుగుతోందని చెప్పారు.రివర్స్ పీఆర్సీతో జీతాలు తగ్గే పరిస్థితి ఎదురైందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.’క్రమశిక్షణా చర్యలు తీసుకుంటే ఇప్పటినుంచే’ 50 నుంచి 60 శాతం ఫిట్మెంట్ కోల్పోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు.
ఆర్టీసీ ఉద్యోగులు 2 పీఆర్సీలు కోల్పోతున్నారని.. సర్వీసు రూల్స్ వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందన్నారు. 5, 6 తేదీల్లో డిపోల్లో సమావేశాలు ఏర్పాటుచేస్తామని.. ఏ క్షణం నుంచైనా బస్సులు ఆపేందుకు వెనుకాడబోమని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని హెచ్చరించాయి.పీఆర్సీ సాధన సమితి ఎప్పుడు చెబితే అప్పుడు సమ్మెకు వెళతామని.. ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఈ క్షణమే సమ్మెకు సిద్ధమని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.