– బాధిత కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలి
– బల్క్ డ్రగ్ పార్క్ ఉద్యమ నేత అప్పలరాజుది అక్రమ అరెస్టు
– పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలి
– ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పీడీ యాక్ట్ బనాయిస్తారా?
– రోజులు ఎప్పడూ ఒకేలా ఉండవని అధికారులు గుర్తుంచుకోవాలి
– తాడేపల్లి లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కురసాల కన్నబాబు
– మీడియా సమావేశంలో పాల్గొన్న వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు ఏ నారాయణమూర్తి
తాడేపల్లి : వైఎస్.జగన్ కు వస్తున్న జనాదరణ చూసి సీఎం చంద్రబాబు తట్టుకోలేక దిక్కుతోచని స్ధితిలో.. వైయస్సార్సీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… ఒకవైపు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తడంతో పాటు, మరోవైపు వైయస్.జగన్ పుట్టిన రోజును వాడ, వాడలా పండగలా నిర్వహించడంతో కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని స్పష్టం చేశారు.
దీనికి తోడు అమరావతి కోసం ఇచ్చిన భూమికి బదులు వాగుల్లో ప్లాట్ కేటాయించారన్న ఆవేదనలో రాజధాని రైతు చనిపోవడంతో.. వీటన్నింటినీ డైవర్షన్ చేయడం కోసమే చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. వైయస్.జగన్ పుట్టిన రోజు సంబరాల్లో జంతుబలి అంటూ నానా గొడవ చేస్తున్న హోంమంత్రి అనిత… గతంలో చంద్రబాబు, బాలకృష్ణ ప్లెక్సీలకు పొట్టేళ్లను బలిఇచ్చి తలకాయలతో దండలు వేసిన ఘటనపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.
తన నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటును గతంలో వ్యతిరేకించిన హోంమంత్రి.. ఇప్పుడు ఉద్యమ నేత అప్పలరాజుని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించిన ఆయన… ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పీడీ యాక్ట్ బనాయిస్తారా? అని నిలదీశారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసులు అధికార పార్టీకి కార్యకర్తల్లా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించిన కన్నబాబు.. పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలని, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.
ప్రైవేటీకరణకు అనుగుణంగా మెడికల్ కాలేజీలకు ఒక్క టెండర్ కూడా వేయలేదు. ఒక్క కాలేజీకి మాత్రం కిమ్స్ ఆస్పత్రి టెండర్ వేసిందని వారికి మద్దతిచ్చే పత్రికలో రాశారు. ఆ తర్వాత కిమ్స్ తాము టెండర్లు వేయలేదని ఖండిస్తే, కిమ్స్ కాదు అందులో పనిచేసే డాక్టర్ ఆ టెండర్ వేశారని వివరణలు ఇచ్చుకున్నారు.
చంద్రబాబు చాలా గొప్పగా చెప్పుకునే అమరావతి రైతుల వేదనకు, బాధకు సాక్షంగా ఓ ఘటన జరిగింది. మొదటి విడత భూములిచ్చిన రైతులకూ న్యాయం చేయకుండా వారికి వాగుల్లో, చెరువుల్లో ప్లాట్లు ఇచ్చారు. వాటిని లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సాక్ష్యాత్తు మున్సిపల్ శాఖ మంత్రి ముందే ఆవేదన వ్యక్తం చేసి ఓ రైతు చనిపోయిన ఘటన చూశాం. దీనిపై ప్రభుత్వంలో మంత్రులు, బాధ్యత కలిగిన వారి నుంచి కనీస స్పందన లేదు. తప్పు చేశామన్న బాధ కూడా వారిలో లేదు.
ఈ ఘటనకు ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. మంత్రి నారాయణ ముందే ఆవేదన చెందుతూ రైతు చనిపోయాడు. ఇలాంటి సంఘటన పట్ల కూడా వీళ్లు చలించలేదు. ఈ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. బాధిత రైతు కుటుంబానికి ప్రభుత్వమే పరిహారం చెల్లించాలి.
తప్పులన్నీ మీరు చేస్తారు, పాపాలన్నీ మీరు చేస్తారు. అమరావతిలో రైతు కూడా మీరు చేసిన పాపానికి గుండె పగిలి చనిపోయే పరిస్ధితి వచ్చింది. అయినా వైఎస్సార్సీపీని విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అధికారం వల్ల అనిత గారికి వచ్చిన ప్రయోజనం ఇదేనా?, హోంమంత్రి నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ కు వ్యతిరేకంగా ఓ ఉద్యమం చేస్తుంటే, అక్కడ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అప్పలరాజు అనే కమ్యూనిస్టు నాయకుడిని పీడి యాక్ట్ పెట్టి అరెస్టు చేశారు.
ఈ రాష్ట్రంలో కార్పోరేట్ విధానాలకు తప్ప, పేదల గురించి గొంతెత్తే వారి గురించి ఆలోచించం, వారిని కచ్చితంగా అణచివేస్తాం అనే సంకేతాలు ఇస్తున్నారు. పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి విపరీతంగా కొట్టి, వారిని రెండు కిలోమీటర్లు రోడ్డు మీద నడిపించే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఇదీ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్ధితి.. ఇవన్నీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకు కేక్ కట్ చేశారని, మేక కట్ చేశారని చెప్పుకుని బతికేద్దాం అనుకుంటున్నారు.
నిన్న అమరావతిలో రైతు కుప్పకూలిపోయి చనిపోయిన ఘటనపై ఎందుకు స్పందించలేదు? గతంలో మీరు వస్తే అమరావతి బంగారం అయిపోతుందని అబద్దాలు చెప్పిన వాళ్లు ఇప్పుడేం చేస్తున్నారు?. రైతు మరణంపై కచ్చితంగా ఎఫ్ఐఆర్ వేయాల్సిందే. మీ ఇష్టానుసారం అధికారం ఉంది, రాసే పత్రికలు ఉన్నాయి, చూపించే ఛానల్స్ ఉన్నాయని మా మీద బురదజల్లే కార్యక్రమం చేస్తే ప్రజలు అర్దం చేసుకోలేని పరిస్ధితుల్లో ఉన్నారని అనుకోకండి.
రెడ్ బుక్ లో మూడు పేజీలే అయ్యాయి, ఇంకా చాలా పేజీలున్నాయని లోకేష్ చెప్తున్నారు. మీ బెదిరింపులకు బెదిరిపోతారనేది మీ ఉద్దేశం. మీరు ఇలాగే పనిచేస్తే మా న్యాయవిభాగం కూడా అలాగే స్పందిస్తుంది. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని అధికారులు గుర్తుపెట్టుకోవాలి. మాకేదో బ్రాండింగ్ వేద్దామంటే అమాయకత్వమే అవుతుంది.
ఎన్నికల ముందు అమరావతిలో ఒలింపిక్స్ అంటారు, ఎన్నికల తర్వాత ఆవకాయ్ అంటున్నారు. కాసేపు ఏఐ, కాసేపు క్వాంటం అంటారు. ఎకరం 99 పైసలకే ఇచ్చేసారు, మీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు బ్రహ్మాండంగా జరిగింది. కోటి సంతకాల సేకరణ అద్భుతంగా జరిగింది. ప్రజల నిరసన చాలా గట్టిగా వ్యక్తమైంది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయని, దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి మమ్మల్ని అరాచకవాదులుగా ముద్ర వేయాలని మీరు చేస్తున్న ప్రయత్నం బూమరాంగ్ అవ్వడం ఖాయమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.