మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం ఉక్కుపాదం

– డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌
రాజమండ్రి: పోలీసు వ్యవస్థపై రాజకీయ విమర్శలు చేయడం తగదని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. పోలీసు ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో రాజమండ్రిలో మాదక ద్రవ్యాల నియంత్రణపై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ.. ఏపీలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని స్పష్టం చేశారు. అదే విధంగా.. గంజాయి సాగు, రవాణాను అరికట్టేందుకు ఎన్‌ఐఎ సహకారం కూడా తీసుకుంటామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు.
ముంద్ర పోర్టులో పట్టుబడిన హెరాయిన్ కి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో డ్రగ్స్ పట్టుబడినట్లుగా జరుగుతున్న ప్రచారంలో ఆంధ్ర ప్రదేశ్ కి ఎటువంటి సంబంధం లేదు అని మరోసారి స్పష్టం చేస్తున్నాం. గతంలో ఎన్నడలేని విధంగా రాష్ట్రంలో గంజాయి పై ఉక్కుపాదాన్ని మోపుతున్నాం. అన్ని శాఖల సమన్వయంతో కలసి పనిచేస్తూ గంజాయి సాగు, రవాణా ను నియంత్రించేందుకు, కట్టడి చేసేందుకు పూర్తి చర్యలు చేపడుతున్నాం. ఇతర రాష్ట్రాలకు చెందిన నేరస్తుల పై గట్టి నిఘా ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారందరిని చట్టం ముందుకు తీసుకు వస్తాం.
ఇప్పటికే 463 మంది అంతర్ రాష్ట్ర నిందితులను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాము. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం ఇప్పటికే అత్యధిక స్థాయిలో మూడు లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు పదిహేను వందల వాహనాలను జప్తు చేసి, ఐదు వేల మంది నిందితులను అరెస్టు చేశాం. సంబంధం లేని అంశాలపై అసత్య ఆరోపణలు ను మానుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాము.