-దళిత బంధును లబ్ధిదారుల సద్వినియోగం చేసుకోవాలి
-లబ్ధిదారులకు దళిత బంధుపై ప్రభుత్వం అవగాహన కల్పించాలి
-కులాంతర వివాహం చేసుకున్న వారికి ఈ పథకం వర్తింపు చేయాలని మంత్రికి వినతి
-“దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
దళితుల జీవన విధానం స్థితిగతుల్లో…ఆర్థిక స్థితిగతుల్లో ఎదుగుదల ఉండాలని తద్వారా సామాజిక అభివృద్ధిలో వారు భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆశిస్తున్నట్లు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని SRNBJNR డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ గౌతం ఆధ్వర్యంలో జరిగిన దళిత బంధు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళిత బంధు పథకం రూపొందించే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా తాను హాజరై ఈ పథకం విధివిధానాలు దళితులకు ఉపయోగకరంగా ఎలా ఉండాలనే విషయాలపై అనేక సలహాలు సూచనలు ఇచ్చామని వివరించారు.
రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో నియోజకవర్గంలోని చింతకాని మండలం ఎంపికై రాజకీయాలకు అతీతంగా సాచ్యురేషన్ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక జరగడం, లబ్ధిదారుల ఇష్ట ప్రకారం గా యూనిట్స్ మంజూరు చేసి ఆస్తులను పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. దళిత బంధు పథకం సద్వినియోగం చేసుకొని వ్యాపారరంగంలో ఆర్థికంగా ఎదిగి చింతకాని మండలం లబ్ధిదారులు రాష్ట్రంలో ఇతర మండలాల లబ్ధిదారులకు స్ఫూర్తిగా నిలవాలన్నారు. దళిత బంధు పథకం యూనిట్స్ ఎంపిక చేసుకోవడం, మార్కెటింగ్ చేసుకోవడం, అలా వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుదల సాధించేందుకు లబ్ధిదారులకు కావలసిన అవగాహన ప్రభుత్వం నుంచి కల్పించాల్సిన అవసరం ఉందని సూచించారు. కులాంతర వివాహాలు చేసుకున్న దళితులకు కూడా దళిత బంధు పథకం వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమానికి హాజరైన సంబంధిత శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు విజ్ఞప్తి చేయగా వెంటనే ఆయన సానుకూలంగా స్పందించారు.